పవిత్ర శుక్రవారం
దేవుని బాధ - మానవుని
విముక్తి
“దేవుడు తన సొంత కుమారుడిని విడిచిపెట్టలేదు. కానీ మనందరి కోసం
ఆయనను అప్పగించాడు”.
బాధ మరియు విముక్తి అనే రెండూ ఇశ్రాయేలీయుల పునః జననం. బానిసత్వం నుండి వారి విముక్తి గురించి చెప్పే నిర్గమ కథకు కేంద్రంగా ఈ రెండు ఉన్నాయి. స్వేచ్ఛ, భూవిస్తరణ మరియు విముక్తి అనే భావనలకు బాధ అనేది మొదటి విషయం కాకపోవచ్చు. ఈ అనుభవాలు తరచుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని నిర్గమకాండ సంఘటన మనకు బోధిస్తుంది. “జోహార్” అనేది యూదుల ఒక ఆధ్యాత్మిక గ్రంథమయినటువంటి “కబ్బాలాహ్” అనే ముఖ్య గ్రంథపు కేంద్ర రచన. తోరా (పాత నిబంధన మొదటి ఐదు గ్రంథాలు) పై వ్యాఖ్యానం చేస్తున్నతువంటిది. దానిలోని ఆధ్యాత్మిక సంకేత అర్థాలను ఈ గ్రంథం పరిశీలిస్తుంది. ఈజిప్టు (హెబ్రీ భాషలో మిట్జ్రాయిము) మరియు “మి'త్సరిము" అంటే “ఇరుకైన జలసంధి” అనే పదాలు శారీరక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక బానిసత్వం అయినా సరే లేదా బాధ, సంకోచంలాంటి వ్యక్తిగత లేదా సామూహిక బాధలలాంటి అనుభవాలకు మారు రూపాలు ఈ పెర్లు అని మనం గ్రహించాలి. ఇశ్రాయేలీయులు మిజ్ట్రాయిము ("ఇరుకైన జలసంధి") నుండి బయటకు తీసుకురాబడ్డారు మరియు ఎర్ర (రీడ్స్) సముద్ర జలాల ద్వారా కొత్త ఉనికిలోకి తీసుకురాబడ్డారు. ఈ కోణంలో, ఈజిప్టు అనేది ఒక తల్లి గర్భంలాగున లేదా జనన కాలువగా కన్పిస్తుంది. దాని నుండి ఇశ్రాయేలీయులు మళ్ళి "పుట్టారు". దేవుడు ఒక మంత్రసానిగా పురుడు పోసిన వాడయ్యాడు!
తన బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, బిడ్డ పుట్టడానికి ముందు ఎంత కష్ట తరమైన బాధను అనుభవిస్తుంది! అదేవిధంగా, ఇశ్రాయేలు విముక్తికి ముందు క్షణాలు అత్యంత భయంకరమైన మరియు చీకటి నిరాశలో మునిగిపోయాయి. చీకటి సంహారక దూత దాటిపోవడంతో, తన ప్రియమైన ప్రథమ కుమారుడిని కోల్పోయిన తర్వాత మాత్రమే ఫరో ఇశ్రాయేలీయులను విడిచిపెట్టాడు. అయినప్పటికీ తరువాత అతను తన మనసు మార్చుకుని వారిని వెంబడించాడు. నడి సముద్రంలో వెంబడిస్తున్న ఐగుప్తు సైన్యం ఒక ప్రక్క, మరో ప్రక్క సముద్ర జలాలో మరణంలాంటి భయనకాల మధ్య చిక్కుకున్నట్లు ఇశ్రాయేలీయ ప్రజలు గ్రహించారు. ఎర్ర సముద్రంను చూసి ఆశ్చర్యపోతూ, ఏ ఇశ్రాయేలీయుడు సముద్రపు నీటిలోనికి అడుగు పెట్టడానికి సాహసించలేదు. ఈ నిరాశాజనకమైన క్షణాల గురించి వివరిస్తూ మిడ్రాషిక్ అనే హిబ్రూ రచన ఒక చక్కటి సన్నివేశాన్ని అందిస్తుంది. అమ్మినాదాబు కుమారుడు నహ్షోను అనే ఒక వ్యక్తి ఆశ కోల్పోకుండా ముందుగా నీటిలోకి అడుగుపెట్టాడు. అయినప్పటికీ, అతని దృఢ విశ్వాసంలో మరో వైపున ఉన్న మానవ జనీనమైన బాధను మనం ఊహించవచ్చు! ఆ సమయంలో అతని ప్రార్థన ఇలా వుండివుండవచ్చు , "దేవా, నన్ను రక్షించు. నీళ్లు ప్రాణమువరకు పొంగిపొర్లుచున్నవి. నేను లోతైన బురదలోమునిగిపోయాను. అక్కడ నిలువ లేకపోయెను... నీటి వరదన నన్ను ముంచెత్తనియ్యకుము. అగాధము నన్ను మింగనియ్యకుము" (కీర్తన 69:2–3, 16). ఆ సమయంలో, మోషే ఇంకా తన ప్రార్థనలోనే నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు ఎల్ షడ్డాయ్ మోషేతో, “నా ప్రియమైనవారు సముద్రంలో మునిగిపోతున్నారు. నీవు ఇంకా ఎంతసేపు నీ ప్రార్ధనలు నాకు చేస్తావు? అని అంటే అందుకు మోషే , “విశ్వ ప్రభూ! కానీ నేను ఏమి చేయగలను? అని జవాబిచ్చాడు. ఎలోహిమ్ అందుకు మోషేతో, “ఇశ్రాయేలు బిడ్డలతో ముందుకు సాగిపోవుడి అనిచెప్పు. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము” (నిర్గ 14:15–16; సోటా 37a) అని అజ్ఞాపించాడు. అన్ని ఆశలు కోల్పోయి నిరాశల పాలయినప్పుడు తలెత్తే భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ మిడ్రాష్ గ్రంథంలోని ఈ శక్తివంతమైన సన్నివేశం మనకు పాఠం చెపుతుంది.
బ్రెస్లోవ్‌కు చెందిన నాచ్‌మన్ అనే రబ్బీ ఒక యూదు బోధకుడు. అతని పదాల నుండి ప్రేరణ పొందిన ఒక ప్రసిద్ధ గీతం ఒకటి ఉంది. అది ఇలా చెబుతుంది, “ప్రపంచమంతా చాలా ఇరుకైన వంతెన కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దానిని దాటడానికి భయపడకూడదు.” నహ్షోను ఇరుకైన ప్రదేశంలో భయంతో స్తంభించిపోలేదు. అతను విశ్వాసంతో ముందుకు అడుగుపెట్టి ప్రార్థనలో పిలిచాడు. ఆ సాహసం ముందుకు వెళ్ళే కొత్త మార్గాన్ని తెరిచింది. విముక్తి మరియు జీవితానికి మార్గం కల్పించింది. బాధల సముద్రంలో మనం మునిగిపోతున్న సమయంలో నహ్షోను చర్యలలో కలిగి వున్న విశ్వాసం మరియు దాని క్రియాత్మక చర్య రెండింటిలో ఉన్న శక్తిని మనకు బోధిస్తున్నాయి. అన్నీ అసాధ్యం అనిపించినప్పుడు విముక్తికి ప్రార్థన మరియు తెగింపు క్రియాత్మక చర్య అవసరం.
ఇతరుల బాధలను విస్మరించి మన స్వంత విముక్తి సాధించకూడదని కూడా ఇశ్రాయేలీయుల నిర్గమ కాండం మనకు గుర్తు చేస్తుంది. నిర్గమ చారిత్రాత్మక సంఘటన శూన్యంలో ఉండదు. ఒకరి బాధను మన బాధ నుండి వేరు చేయలేము. ఈజిప్టు అణచివేతదారులు కూడా వేదనను అనుభవించారు. ఒక ప్రజకు స్వేచ్ఛను తెచ్చే శక్తి మరొకరికి బాధను కలిగిస్తుంది. దేవుడు బాధపడే వారందరితో కలసి బాధపడినట్లే, మనం కూడా మన బాధలను తిరిగి చూసుకుని ఇతరుల బాధను అంగీకరిండానికి ఆహ్వానించబడ్డాము. ఇశ్రాయేలు దేవుడు మానవ బాధలను పూర్తిగా అనుభవించాడు. దేవుడు ఇశ్రాయేలీయుల బాధలను చూశాడు. దానిని విన్నాడు. అది మూర్తీభవించిన అర్థంలో తెలుసుకున్నాడు. దేవుని సానుభూతి ఇశ్రాయేలీయులకే పరిమితం కాలేదు. మానవులకు మరియు మానవులు కాని ఆతని అన్ని రకాలైన సృష్టి జీవ రాశులకు విస్తరించింది, వర్తిస్తుంది (నిర్గమ 3:7). మన క్రైస్తవులు చదువుకోలేని యూదుల మరొక గ్రధం తాల్ముదు గ్రంథం. అందులో ఒక చక్కటి సన్నివేశం కన్పిస్తుంది. ఐగుప్తీయులు మునిగిపోతున్నప్పుడు దేవదూతలు ఆనందంగా పాడటం ప్రారంభించారట! అప్పుడు యెహోవా అందుకు సంతోషించలేదు. దేవుడు వారిని గద్దించాడని తాల్ముదు గ్రంథం మనకు ఇలా చెబుతుంది, "నా చేతుల సృష్టి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మీరు ఆనందం కోసం పాడటానికి ఎంత ధైర్యం?" (సేన్హేడ్రిన్ 39b). అంటే ఫరో చక్రవర్తి మరియు తన సైన్యం దేవుని సృష్టి భాగమే కదా!! అందుకే యెహోవా ఈ పరుష పదాలను తన దూతలతో పలికాడని ఈ తాల్ముదు చెపుతుంది. కన్నీరు రప్పిస్తుంది కదా! కరుణా కనికర మూర్తి మన మాట్లాడే దేవుడు. మన శత్రువులు చేడిపోతుంటే సంతోషించేవాడు కాదు మన దేవుడు. మనం బాధ అనుభవించినప్పుడు మరియు విముక్తి పొందినప్పుడు కూడా ఇతరుల బాధలను గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తుంది ఈ గ్రంథం.
ఇతరుల బాధలను అంగీకరించడం కూడా క్రీస్తు పాస్కలో
అంతర్లీనంగా ఉంది! నిర్గమకాండ సంఘటన మన కోసం మాత్రమే కాకుండా కుల, మత, వర్గ, సామాజిక, రాజకీయ,
మానసిక, ఆధ్యాత్మిక విముక్తి కోసం బాధపడే వారందరికీ స్వేచ్చా వ్యయం గురించి
ఆలోచించమని ఆహ్వానిస్తుంది. మనం ప్రేమించే వారి కోసం మాత్రమే కాకుండా, కల్వరిలో
క్రీస్తు ప్రాణ త్యాగం చేసినట్లుగా మనకు వ్యతిరేకంగా నిలబడే వారి విముక్తి కోసం
ప్రార్థించడం కూడా నేర్చుకుందాం. చివరికి, ఉమ్మడి లేదా ఐక్య సర్వమానవత్వం
మాత్రమే మూలుగుతూ ఉన్న సమస్త విశ్వానికి నిజమైన విముక్తిని తీసుకురాగలదు.
“యేసుక్రీస్తు మన పట్ల తన ప్రేమను చూపించాడు మరియు తన జీవిత
రక్తంతో మన పాపాల నుండి మనలను విడిపించాడు”.