మెస్సీయ యుగాన్ని
చూడండి!
యెషయా 56:1.6-7; రోమా 11:13-15.29-32; మత్తయి 15:21-28 (A /20)
“సకల జనులారా! మన ప్రాణములకు
జీవమిచ్చిన మన దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా”.
ఒక కనానీయురాలు
యేసును సమీపించి,
“ప్రభువా! దావీదు కుమారుడా! నన్ను కరుణించు!” అని మొరపెట్టుకుంది (మత్త 15:22). ఆమె ఒక పరదేశి. బయటి వ్యక్తి. మరియు ఇశ్రాయేలులో
గుర్తింపు పొందిన మతపరమైన హోదా లేని ఒక సాధారణ స్త్రీ. అయినప్పటికీ ఆమె
వెళ్ళిపోవడానికి నిరాకరించింది. ఆమె తన కుమార్తె కోసం వేడుకుంటూనే ఉంది. చివరకు
యేసు,
“అమ్మా, నీ విశ్వాసము
గొప్పది! నీ కోరిక ప్రకారమే నీకు జరుగును గాక” అని అన్నాడు (మత్త 15:28). ఇది కేవలం స్వస్థత
గురించిన కథ కంటే ఎక్కువే! ఇది విశ్వాసానికి ఒక పరీక్ష మరియు ప్రత్యక్షత. ఇది
నాలుగు అంశాలను తెలియజేస్తుంది మనకు.
మొదట, కనానీయురాలి మొర పట్ల
యేసు మౌనంగా,
దూరంగా
ఏమి పట్టనట్లుగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఈ
నిర్లక్ష్యపూరితమైన క్షణం తిరస్కారం కాదు. కానీ విశ్వాసానికి ఒక
పరీక్ష. అది ఆమె పట్టుదలను బహిర్గతం చేస్తుంది. మరియు ఒక లోతైన సత్యాన్ని
వెల్లడిస్తుంది. విశ్వాసం పరిపక్వం చెందడానికి ముందు కొన్నిసార్లు మౌన పోరాటం
గుండా వెళ్ళాలి. రెండవదిగా,
ఈ
సంఘటన ద్వారా,
యేసు
తాను నిజంగా ఎవరో అన్న విషయాన్ని క్రమంగా వెల్లడిస్తాడు. ఆయన సొంత ప్రజలలో
చాలామంది ఆయనను పూర్తిగా గుర్తించకముందే, ఆ స్త్రీ ఆయనను "దావీదు
కుమారుడు" అని,
ఒక
మెస్సీయ బిరుదుతో సంబోధిస్తుంది కదా! ఆమె విశ్వాసం, జాతి లేదా దేశ
సరిహద్దులచే పరిమితం చేయలేని కరుణ గల మెస్సీయగా యేసును వెల్లడి చేసే క్షణంగా
మారుతుంది.
మూడవదిగా, ఆ స్త్రీ పట్టుదల
నిజమైన విశ్వాసానికి ఒక నమూనాగా నిలుస్తుంది. అడ్డంకులు, నిశ్శబ్దం లేదా
ఆలస్యం ఎదురైనప్పటికీ ఆమె వెనుకాడలేదు. మెస్సీయ యుగం ప్రజలందరి పట్ల నిష్కాపట్యం, పట్టుదల మరియు దేవుని
కరుణపై నమ్మకంతో కూడి ఉంటుందని ఆమె విశ్వాసం చూపిస్తుంది. ఆమెలో - దేవుని రక్షణ పరిమితం కాదని, విశ్వసించే ప్రతి
ఒక్కరికీ విస్తరించబడిందని మనం గ్రహిస్తున్నాము. చివరగా, ఈ సువార్త మనకు ఒక
సవాలుగా మారుతుంది. క్రీస్తు శిష్యులుగా, మనం కేవలం విశ్వసించడానికే కాక
సాక్ష్యమివ్వడానికి కూడా పిలువబడ్డాము. మన విశ్వాసం కరుణ, న్యాయం, క్షమాపణ మరియు సేవలో
కనబడాలి.
ప్రవక్త యెషయా ఈ
విశ్వవ్యాప్త దృక్పథాన్ని : “నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును”
(యెష 56:7) అని
ప్రకటిస్తున్నాడు.
మానవాళి అంతా దేవుని రక్షణ ప్రణాళికలో సమకూర్చబడటమే మెస్సీయ యుగపు ముఖ్య లక్షణం.
దేవుని రక్షణ ఏ ఒక్క జాతి,
దేశం, సంస్కృతి లేదా
సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. అందువల్ల కనానీయురాలు మెస్సీయ యుగానికి
ఒక సూచనగా నిలుస్తుంది. మన విశ్వాసం నిలకడగా ఉండి, క్రీస్తును బయలుపరచి, ఆయన రాజ్యానికి సజీవ
సాక్షిగా నిలుచును గాక.
“దేవునికి
భయపడేవారలారా,
వచ్చి
వినండి. ఆయన నా ప్రాణానికి ఏమి చేశాడో నేను మీకు చెబుతాను, హల్లెలూయా.”