AletheiAnveshana: ఇదిగో! దేవుని గొఱ్ఱె పిల్ల యెష 49:3, 5-6; 1 కొరింథీ 1:1-3; యోహా 1:29-34 (A/2)

Friday, 16 January 2026

ఇదిగో! దేవుని గొఱ్ఱె పిల్ల యెష 49:3, 5-6; 1 కొరింథీ 1:1-3; యోహా 1:29-34 (A/2)

 

ఇదిగో! దేవుని గొఱ్ఱె పిల్ల

 

యెష 49:3, 5-6; 1 కొరింథీ 1:1-3; యోహా 1:29-34 (A/2)

 

ప్రభువు నామమున వచ్చువాడు ధన్యుడు. అల్లెలుయా ( Divine Office)

 

క్రిస్టమస్ మరియు ప్రభువు బాప్తిస్మపు ఆనందం తర్వాత, మాతృ శ్రీసభ ఇప్పుడు మనల్ని సాధారణ అర్చన కాలానికి నడిపిస్తుంది. సాధారణం అంటే అప్రధానమైనది కాదు, కానీ మన విశ్వాసం మౌనంగా, నిశ్శబ్దంగా, స్థిరంగా మరియు నమ్మకంగా ఎదగగడానికి ఉద్దేశించిన క్రమబద్ధమైన అర్చన కాల సమయం. నేడు, ఈ అర్చన సీజను ప్రారంభంలోనే, తిరుసభ జోర్డాను వద్ద బాప్తిస్మ యోహాను ప్రకటనను మన ముందు ఉంచుతుంది. తన వైపు దృష్టిని ఆకర్షించకుండా, అధికారాన్ని కాంక్షించకుండా, వివరణలు ఇవ్వకుండా కేవలం, “ఇదిగో! అని యోహాను యేసును దేవుని గొఱ్ఱె పిల్ల అని పిలుస్తున్నాడు. ఇది యూదులకు పస్కా గొఱ్ఱె పిల్లను గుర్తు చేసింది. దాని రక్తం ఇశ్రాయేలును మరణం నుండి రక్షించిన విధానాన్ని (నిర్గ 12) గుర్తు చేసింది. ఇది వధకు గొఱ్ఱె పిల్లలా నడిపించబడిన బాధలో ఉన్న సేవకుని గురించి మాట్లాడిన ప్రవక్త యెషయాను ప్రతిధ్వనించింది (53:7). పాపాన్ని దానిని సమూలంగా పరిష్కరించేందుకు దేవుడే యేసును పంపాడని యోహాను అర్ధం చేసుకొని సాక్ష్య మిస్తున్నాడు.

 

 

ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. యోహాను ఇలా అంటున్నాడు, “నేను ఆయనను ఎరుగను.” అంటే ఇది తన అజ్ఞానం కాదు. అది వినయం. విశ్వాసం మానవ నిశ్చయత నుండి మాత్రమే రాదని యోహాను మనకు బోధిస్తున్నాడు. యేసు తన హోదా ద్వారా కాదు, శక్తి ద్వారా కాదు, ఆత్మ కదలిక ద్వారా గుర్తించబడ్డాడు. యేసుపై దిగి వచ్చిన అదే ఆత్మ నేడు ఆయనను గుర్తించడానికి మన కళ్ళు తెరిపించేటి  ఆత్మ. దేవుని గొఱ్ఱె పిల్ల మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనను గుర్తించగలమా? మనం తరచుగా దేవుని బలం కోసం, విజయం కోసం నిశ్చయతతో వెతుకుతాము. కానీ దేవుడు గొఱ్ఱె పిల్లగా వస్తాడు. అతడు సౌమ్యుడు, వినయాన్వితుడు, దుర్బలుడు. అప్పుడు చాలామంది ఆయనను గమనించక ఆయనను కోల్పోయారు. ఇప్పుడు చాలామంది ఆయనను గమనించక కోల్పోతున్నారు. ఎందుకంటే ఆయన మన అంచనాలకు మించి వున్నాడు. మనం ఆయన అంచనాలను కనుగోనలేము. అయినప్పటికీ యోహాను మనకు స్పష్టంగా చెబుతున్నాడు: “ఈ గొఱ్ఱె పిల్ల లోక పాపాన్ని తీసివేస్తుంది” అని. వ్యక్తిగత తప్పులు మాత్రమే కాదు, మానవాళిని దేవుని నుండి వేరు చేసే లోతైన విచ్ఛిన్నతను సహితం ఆయన తెసివేస్తాడు. అందుకే యేసు ఒక గురువు లేదా నైతిక ఉదాహరణ కంటే ఎక్కువ మేలైన వాడు. ఆయన విమోచకుడు. ఆయన యోహాను కంటే ముందు ఉన్నవాడు. ఆయన ఆత్మతో నిండి ఉన్నవాడు. ఆయన నీటితో శుద్ధి చేయబడడు, ఆనీటిని శుద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం తీసుకుంటాడు. పరిశుద్దాత్మలో మనకు బాప్తిస్మమిస్తాడు. ఆయన బయట మాత్రమే కాకుండా, లోపలిని సహితం శుద్ధి చేసి కొత్త జీవితాన్ని మనకు ఇస్తాడు.

 

బాప్తిస్మమిచ్చు యోహాను యేసుతో పోటీ పడలేదు. కానీ "ఆయన హెచ్చింప బడాలి. నేను తగ్గింప బడాలి" అని సాక్ష్యం ఇచ్చాడు. స్వీయ-ప్రమోషన్‌ కోసం ప్రోత్సహించి పోటీపడే ప్రపంచంలో, యోహాను స్వీయ-సమర్పణ విలువను బోధిస్తున్నాడు. గందరగోళ అల్లర్లను, ఆకర్షణను కోరుకునే సంస్కృతిలో, మౌనంగా, నిశ్శబ్దంగా స్పష్టంగా క్రీస్తు వైపు లోకాన్ని ఎలా చూపించాలో ఆయన మనకు బోధిస్తున్నాడు. నిజమైన శిష్యరికం అంటే మనల్ని మనం తెలియ జేసుకోవడం కాదు—అది క్రీస్తును కనిపించేలా చేయడం. యేసు లోక పాపాన్ని తొలగించి యన్నట్లు మనం గ్రహించినట్లయితే, ఆయనకు చెందినవారుగా  పాపమునకు భిన్నంగా జీవించాలి. అలా కాకపొతే మనం గొఱ్ఱె పిల్లను స్వీకరించలేము మరియు చేదు, అన్యాయం, నిజాయితీ లేదా ఉదాసీనతతో జీవితాన్ని జీవించడం కొనసాగించలేము.

 

గొఱ్ఱె పిల్లను అనుసరించడం అంటే – తీర్పు కంటే దయ, గర్వం కంటే వినయం, శక్తి కంటే సేవ మరియు ప్రతీకారం కంటే క్షమాపణను ఎంచుకోవడం. మనం ప్రార్థనకు వచ్చిన ప్రతిసారీ, గురువు  : “ఇదిగో దేవుని గొఱ్ఱె పిల్ల” అన్న యోహాను మాటలను పునరావృతం చేయడం వింటాము. కానీ ప్రశ్న ఇంకా మన ముందే మిగిలిపోయి వుంటుంది. మనం నిజంగా ఆయనను చూస్తున్నామా, గమనిస్తున్నామా —లేదా ఈ మాటలు నిత్యకృత్యంగా మారి పోయాయా? ఆయన దివ్య వాక్యంలోనూ, దివ్య సత్ప్రసాదoలోనూ,  గాయపడినవారిలోనూ, మన దైనందిన జీవితంలోని నిశ్శబ్ద క్షణాల్లో ఆయనను మనం గుర్తించ గలుగుతున్నామా? మనం ఈ సాధారణ అర్చన కాల సమయాన్ని ప్రారంభించు చునప్పుడు, నిశ్శబ్దంగా కానీ స్పష్టంగా తనను సూచించే విధంగా జీవించమని ప్రభువు మనల్ని సాధారణ విశ్వాసంలోకి ఆహ్వానిస్తున్నాడు. మన మాటలను, మన ఎంపికలను మరియు మన ప్రేమ జీవితాన్ని యోహాను “ఈయన దేవుని కుమారుడు” అని ఒకసారి జోర్డాన్‌లో చెప్పినట్లుగా ప్రపంచానికి చెప్పనివ్వండి.

 

శాంతి బంధంలో ఆత్మ ఐక్యతను కాపాడుకోవడానికి మీరు చేయగలిగినదంతా చేయండి” ( Divine Office)

No comments:

Post a Comment