AletheiAnveshana: మీరు దేవుని ఆలయం: యెహె 47:1-2,8-9,12; 1 కొరింథీ 3:9-11,16-17; యోహా 2:13-22 (C 32)

Friday, 7 November 2025

మీరు దేవుని ఆలయం: యెహె 47:1-2,8-9,12; 1 కొరింథీ 3:9-11,16-17; యోహా 2:13-22 (C 32)

 

మీరు దేవుని ఆలయం

 

యెహె 47:1-2,8-9,12; 1 కొరింథీ 3:9-11,16-17; యోహా 2:13-22 (C 32)

సైన్యములకధిపతియగు యెహోవా, నీ నివాసస్థలము ఎంత మనోహరమైనది!” (కీర్త 84:1)

 

నేటి మన అర్చన పఠనాలలో మనకు కన్పించే జెరూసలేం దేవాలయం రక్షణ చరిత్రలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. క్రీస్తు పూర్వం 966 సంవత్సరాల క్రితం సొలోమోను మహా రాజు,  దేవుని అద్భుత నివాస స్థలమైన మొదటి ఆలయాన్ని యేరుసలేములో తన ప్రజలమధ్య నిర్మించాడు. దాని ద్వారా జెరూసలేము ఇజ్రాయేలీయుల రాజరిక మరియు మత కేంద్రంగా మొదట రూపు దిద్దుకొన్నది. అయితే, ఆ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 586 సం.లో బాబిలోనియన్లు నాశనం చేస్తూ స్థానికులను తమ దేశానికి బానిసలుగా తరలించారు. తరువాత నాయకుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో, ఆ యూదులు బాబిలోను నుండి తిరిగి వచ్చి తమ పవిత్ర ఆలయాన్ని పున:నిర్మించడం ప్రారంభించుకున్నారు. ఇది క్రీస్తు పూర్వం 516 సం.లో, పర్షియా రాజు డారియుసు I పాలనలో, ప్రవక్తలు హగ్గయి మరియు జెకర్యా కాలంలో పూర్తికాబడి మరొకసారి సర్వాధిపతి దేవునకు అంకితం చేయబడింది. శతాబ్దాల తరువాత, హేరోదు రాజు అదే ఆలయాన్ని పునరుద్ధరించి మరి కొంతగా విస్తరింప చేశాడు. అది ఇజ్రాయేలీయుల  ప్రతిభకు గర్వకారణం! కానీ యేసు మాత్రం దాని  భవిష్య పతన వాణిని చెప్పినట్లుగా, రోమన్లు దానిని సుమారు క్రీ. శ. 70 సం.లో ​​సర్వ నాశనం చేశారు.

 

నేటి సువార్తలో,  అదే ఆలయాన్ని శుభ్రపరిచే యేసు కోపాగ్ని కథను మనం వింటున్నాము. సువార్తికుడు లూకా దానిని రెండు భాగాలుగా ప్రస్తావిస్తున్నాడు. మొదటిగా, ఆలయ ప్రాంగణంలో డబ్బును చిల్లరిగా మార్చేవారిని మరియు వ్యాపారులను యేసు తరిమికొట్టడం, మరియు రెండవదిగా, “ఈ ఆలయాన్ని నాశనం చేయండి, మూడు రోజుల్లో నేను దానిని తిరిగి నిర్మిస్తాను” అని ఆలయ విధ్వంసం గురించి ఆయన ప్రవచనం చేపినప్పుడు యూదులకు కోపం వచ్చింది. కారణం ఆ ఆలయం యూదు జీవితానికి గుండె. దాని నాశనం వారి వినాశనమే! ఆలయం దేవుని ఉనికిగా కనిపించే ప్రామాణిక సంకేతం కాబట్టి యేసు ప్రవచనానికి వారు ఆశ్చర్యపోయారు. మరియు యేసు తనను తాను దేవుని అసలైన నిజమైన ఆలయము గానూ, దేవుని నివాస స్థలంగానూ ప్రకటించు కున్నప్పుడు వారికి గొంతు మ్రింగుడు పడలేదు. అది పస్కా పండుగ సమయం. వేలాది మంది యాత్రికులు తమ తమ బలులను  సమర్పించు కోవడానికి యెరూషలేముకు వచ్చారు. అటువంటి సమయంలో వారి సౌలభ్యం కోసం, ఆలయ ప్రాంగణంలో జంతువులను అమ్మడం, తమ డబ్బును ఆలయ పన్ను కోసం రోమను నాణేలుగా మార్చుకోవడం జరిగేది. ఈ పద్దతులు ఆచరణాత్మకమైనవి అయినప్పటికీ, దేవుని ఇంటిని వాణిజ్య స్థలంగా మార్చి వేశాయి. ఇదే యేసు కోపానికి కారణమైనది.

 

యేసు ఆయా వ్యాపారులను వెళ్ళగొట్టినప్పుడు, ఆయన ఆలయాన్ని ఖండించలేదు కానీ ఆ ఆలయ ఉద్దేశ్యాన్ని శుద్ధి చేస్తున్నాడు. దైవారాధనను దురాశతో లేదా స్వార్థంతో ఏకం చేయకూడదనీ, ప్రజలు దానిని అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఒక కొత్త వాస్తవికతను నేర్పిస్తున్నది ఏమిటంటే  దేవుడు ఎన్నడూ రాతి భవనాలలో నివసించడు. కానీ మానవ సజీవ హృదయాలలో – మొదట ఒకరి స్వంత శరీరంలోనూ, మరియు విశ్వాస సంఘంలో వాసమై ఉంటాడు అని నేర్పిస్తున్నాడు. ప్రవక్త యెహెజ్కేలు చెప్పిన ఆలయం నుండి ప్రవహించే నది (యెహే 47) అనేది పవిత్రాత్మ శక్తివంతమైన ప్రతిరూపం. ఈ నది క్రీస్తు మరియు అతని పవిత్ర సజీవ సంఘం నుండి ప్రవహిస్తుంది. అది సమస్త ప్రపంచానికి జీవం, స్వస్థత మరియు పునరుద్ధరణను తీసు కొస్తుంది. పాపం నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. ఆత్మలో మనకు నూతన  జీవితాన్ని ఇస్తుంది. దివ్య సంస్కారముల ద్వారా,  అందునా జ్ఞాన స్నానం, దివ్య సత్ర్పసాద సంస్కారముల ద్వారా, మనం ఈ జీవజలాన్ని పొందుతాము.

 

యేసు కోపం -  దేవుని ఆలయాలుగా మనం పిలువబడ్డామని గుర్తుచేస్తుంది. అందుకే , "మీరు దేవుని ఆలయమని మరియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?" (1 కొరింథీ 3:16) అని పునీత పౌలుడు అంటాడు. యేసు ఆ భౌతిక యేరూషలేము ఆలయాన్ని శుద్ధి చేసినట్లే, మన హృదయాలు మరియు ఆత్మలను కూడా తరచుగా స్వార్థం, గర్వం, అసూయ లేదా ఉదాసీనతల నుండి శుద్ధి చేయడం అవసరం. దేవునితో మన సంబంధం ఒక వ్యాపార లావాదేవీ కాదు. ఇది పిల్లలు తమ ప్రేమగల తండ్రి పట్ల కలిగి ఉన్న ప్రేమగల సంబంధంలాంటిది. దేవుడు మన బేరసారాలను కోరుకోడు. కానీ మన హృదయాలను కోరుకుంటాడు (కీర్త 51). మన దేవుడు జీవించే సజీవ  దేవుడు. అప్పుడు మన ఆరాధన కూడా సజీవంగా ఉండాలి కదా! నిజాయితీగా, ఆనందంగా మరియు చురుకుగా ఉండాలి. మనం పవిత్ర ప్రార్థనలో పాల్గొన్నప్పుడు మనం ఒక ప్రేక్షకులంగా కూర్చోకూడదు. గురువు చేసే పూజలో  క్రీస్తుతో పాటు బలిపీఠంపై మన జీవితాలను అర్పిస్తున్నామని మర్చి పోకూడదు. చివరగా, యేసు కోపం మన విశ్వాస సమాజాన్ని సజీవ ఆలయంగా చూడమని సవాలు చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ సజీవ శిల. మరియు మనమందరము  కలిసి దేవుని నివాస స్థలాన్ని ఏర్పరుస్తున్నాము. కాబట్టి మన భక్తి, ఐక్యత మరియు సేవ ద్వారా మన ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకుందాం. మన యేసు క్రీస్తు శరీరాలయమైన సంఘాన్ని నిర్మించడానికై మన విచారణను, మన సమాజంను, మన కుటుంబాలను,  మన సమయాన్ని, ప్రతిభను ప్రభువుకు సమర్పిద్దాం. దేవుడు మీకు తోడై వుండును గాక!!

 

బాప్టిజం మనలో ప్రతి ఒక్కరినీ దేవుని ఆలయంగా చేస్తుంది” (పునీత సీజరియస్ ఆఫ్ అర్లెస్)

No comments:

Post a Comment