కాలం చేసిన వారందరి జ్ఞాపకార్థమై
ఈ రోజు....
జ్ఞాన 3:1-9; రోమీ
5:5-11; యోహా 6:37-40
(C)
“నిష్క్రమించిన విశ్వాసుల ఆత్మలు శాంతితో
విశ్రాంతి పొందును గాక!”
మన ఆదర్శ ఆధ్యాత్మిక చరిత్రను సంఘ
ప్రార్థనలలో సజీవంగా ఉంచిన విధానం కథోలిక సంఘపు అందమైన అంశాలలో ఒకటి. అందునా సకల
ఆత్మల సంస్మరణ ఈ చరిత్రలో భాగమైన ఒక మచ్చు తునక. ఇప్పటికీ మన చర్చిలో ఇది సజీవ వాస్తవికతకు
అద్దం పడుతుంది. ఈ జ్ఞాపకార్థం లేదా సంస్మరణ పదకొండవ శతాబ్దం నాటిది.
ప్రాన్సు దేశపు క్లూనీ
ప్రాంతానికి చెందిన పునీత ఓడిలో అనే కథోలిక మఠ సన్యాసి తమ తోటి మఠ సన్యాసులందరు మరణించిన
వారందరి ఆత్మల కోసం ఒక రోజు ప్రార్థనలో గడపాలని ఆజ్ఞ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత, మరణించిన విశ్వాసులందరి ఆత్మలు దేవుని శాశ్విత
ప్రేమను పొందుకొనుటకై ఈ ఆచారమును సమస్త కథోలిక సంఘమంతా ఒక రోజు ప్రార్థనాగా జరుపుకోవాలని తన ఆధిపత్యం నుండి ఆజ్ఞ పొందుకున్నది. పద్నాలుగో శతాబ్దంలో, నవంబరు 1న జరిగే “ఆల్ సెయింట్స్” లేదా సకల పునీతుల
పండుగతో అనుసంధానించబడి ఒక స్మారక చిహ్నాన్ని నవంబరు 2కి మార్చింది మాతృ తిరుసభ ఆధిపత్యం.
పరలోకంలో పునీతులు పవిత్రంగా ఉన్నట్లు, మరణం
ద్వారా దేవుని వైపు బయలుదేరిన విశ్వాసుల ఆత్మలన్నియు పరలోకంలోనికి చేరుకోలేవని మనం
సత్యోపదేశ పాఠాల్లోనే నేర్చుకొన్నాము. కానీ - ప్రార్థనలు, దివ్య పూజా ఫలాలు మరియు దేవుని కృపా
సహాయంతో పరలోకానికి చేరుకోవడానికి తమను తాము సిద్ధం చేసుకుంటాయి ఆయా ఆత్మలు. డాంటే
అలిఘీరి అనే పాశ్చాత్య కథల
గ్రంథకర్త తన డివైన్ కామెడీ “ది పుర్గటోరియో” (ఉత్తరించు స్థలం లేదా
Purgatory)
అనే తన రెండవ పుస్తకంలో
– మరణించిన
వారి ఆత్మలు దేవుని సంపూర్ణ ప్రేమను
అంగీకరించేoత
వరకు దేవుని పర్వతాన్ని ఎక్కడానికి అర్హతను పొందుకోరు. కాబట్టి వారు ఆ పర్వతానికి క్రిందనే
ఉండి పోతారని చక్కటి ప్రదర్శన చేసాడు డాం టే. అయినప్పటికీ భూమిపై నివసించే వారి
వారి ప్రియమైనవారి లేదా మనందరి ప్రార్థనలు,
త్యాగ క్రియల సహాయత వలన వారు దేవుని ప్రేమాకరుణలకు నోచుకొని వారి అజ్ఞానాంధకార ముసుగు
తెరలు తెరచుకొని నీతి కిరణాలను చూడగలవు అని మన నమ్మకం కదా!!
ఈరోజు, ఒక ప్రత్యేక పద్ధతిలో, మనం మన ప్రియమైన మృతులను జ్ఞాపకం
చేసుకుంటున్నాము. మనం నిరంతరం చేసే విశ్వాస ప్రకటన లేదా విశ్వాస సంగ్రహం అనేది నిత్యజీవం
కోసం మన ఆశను ఆధారితం చేసుకునే ఒక వాగ్దానమే. తన మరణ పునరుత్థానంలో
యేసు తనను విశ్వసించే
వారందరి కోసం మరణాన్ని జయించాడు. ఎందుకంటే, “నీతిమంతుల
ఆత్మలు దేవుని చేతిలో ఉన్నాయి. ఎటువంటి హాని వారిని తాకదు" (జ్ఞాన 3:1).
విశ్వాస లేదా సకల ఆత్మల కోసం మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, వారి ఆత్మలు ప్రక్షాళన పొందుకొని తద్వారా
పరలోకంలోని నిత్యజీవానికి ప్రయాణిస్తున్నాయి. ఎందుకంటే యేసు వాగ్దానం,
"నా దగ్గరకు వచ్చే
వారెవరినీ నేను బయటకు త్రోసివేయను" (యోహా 6:37) అని మనకు భరోసా ఇస్తుంది
కదా!!
దేవుని కృపలో మరణించిన వారందరూ, అందునా ఇప్పటికీ అసంపూర్ణంగా శుద్ధి
చేయబడిన వారందరూ, శిక్షకు
కాదు, దైవీక
ప్రేమ అగ్నికి లోనవుతారని సత్యపదేశం మనకు బోధిస్తుంది (CCC 1030–1032). "పరలోకంలో ఉన్న
సాధువులున్నూ, ఉత్తరించు
స్థలంలో శుద్ధి గావించబడుతున్న ఆత్మలున్నూ, మరియు
భూమిపై వున్న మనం ఒక గొప్ప కుటుంబంగా దేవునిచే ఏర్పాటు చేయబడినాము అని
మర్చిపోకూడదు. “మనం
చనిపోయినవారి కోసం ప్రార్థించినప్పుడు, మనం
ఎపుడూ ఈ కమ్యూనియన్‌లోనే జీవిస్తున్నాము. అందుకే మనం వారికి ప్రార్ధనా సహాయం
చేద్దాం. స్మరించుకుందాం... మన అర్పణలు వారికి ఓదార్పునిస్తాయి" అని పితృ
పాదులు పునీత జాను క్రిసోస్టము మనకు
ఉద్భోదిస్తున్నారు. మన ప్రార్థనలు అనేవి కాల పరిమితులను మించిన దయా కనికరమైనటువంటి
చర్యలు. కాబట్టి మనం మన త్యాగ క్రియలతో వారికి
సహాయం చేద్దాం. స్మరించుకుందాం. యోబు కుమారులు తమ తండ్రి త్యాగ బలి ద్వారా శుద్ధిగావింపగలిగినప్పుడు
(యోబు 1:5),
యూదా మక్కబీయుడు కొంత డబ్బు వసూళ్ళు చేసి యేరూషలేము దేవాలయంలొ, యుద్ధంలో మరణించిన
తన సైనికుల ఆత్మలు దేవుని దరికి చేరుకోవడానికై తమ నిమిత్తం పాప పరిహార బలిని సమర్పింప చేసిన (2
మక్కబీ
12:43-45)
విధానంలో కలిగిన విశ్వాసం
- చనిపోయినవారి కోసం మనం చేసే త్యాగార్పణలు మన వారికి దేవుని దయను తీసుకురాలేవా?
మనం ఎందుకు సందేహించాలి?"
ఈరోజు, పవిత్ర తల్లి సంఘం స్మశానవాటికలను
సందర్శించడం, చనిపోయినవారి
కోసం ప్రార్థించడం మరియు పవిత్ర దివ్యపూజా బలులను సమర్పించడం వంటి పుణ్య క్రియల ద్వారా
మరణించిన వారి పట్ల మనకున్న ప్రేమ చురుకైనదనీ మరియు ఫలవంతమైనదని మనకు తెలియ
చేస్తుంది. మన ప్రియమైనవారి కోసం మరియు అనాథ ఆత్మల కోసం ప్రార్థించడంలో, వారి తరఫున దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
అలాగునే వారు మనకు చేసిన ఉపకారముల నిమిత్తం వారికి ధన్యార్పణ చేసుకుంటున్నాము. వారి
ద్వారా ప్రభువు మనలను ఆశీర్వదించిన అన్ని విధాలుబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
"చివరి రోజున నేను వారిని లేపుదును" (యోహా 6:40) అని మనకు వాగ్దానం
చేసిన రక్షక యేసు ద్వారా మరణించిన మన ప్రియమైన
వారిని దేవునికి మనం అప్పగించుదాము. మరణించిన వారి కోసం అర్పించే ప్రతీ దాతృత్వ
చర్య, ప్రతీ ప్రార్థన, ప్రతీ
జపమాల ప్రార్ధన వారి అంధకారములో ఒక చిన్నపాటి క్రొవ్వొత్తి వెలుగు లాంటిది.
ఆ వెలుగు పరిపూర్ణ
కాంతి వైపు చేరుకోవడానికి వారిని వేగవంతం చేస్తుంది.
"ఓ ప్రభూ!
వారికి శాశ్వత
విశ్రాంతిని ఇవ్వండి. వారిపై శాశ్వత కాంతిని ప్రకాశింపజేయండి"
No comments:
Post a Comment