AletheiAnveshana: విశ్వ రాజుల పాలకుడు 2 సమూయేలు 5:1-3; కొలొస్సయులు 1:12-20; లూకా 23:35-43 (C)

Saturday, 22 November 2025

విశ్వ రాజుల పాలకుడు 2 సమూయేలు 5:1-3; కొలొస్సయులు 1:12-20; లూకా 23:35-43 (C)

 

విశ్వ రాజుల పాలకుడు

 

2 సమూయేలు 5:1-3; కొలొస్సయులు 1:12-20; లూకా 23:35-43 (C)

"ఆయన లోకానికి న్యాయంగానూ, ప్రజలకు న్యాయంగానూ తీర్పు తీరుస్తాడు"

 

ఈ రోజు మనం విశ్వానికి రాజు అయిన మన ప్రభు యేసుక్రీస్తు రాచరికపు వేడుకను జరుపుకుంటున్నాము. ఇది అర్చన కాల సంవత్సరపు చివరి ఆదివారం గొప్ప కిరీటంలా నిలచి వుంది. ఇది పురాతనమైనదిగా అనిపించినప్పటికీ, ఈ వేడుక మాత్రం ఆశ్చర్యకరంగా ఆధునికమైనదే! 11 వ భక్తినాధ పోపు గారు దీనిని 1925లో తన “క్వాస్ ప్రిమాస్” అంటే “మొదటిది” ఆనే విశ్వలేఖ బోధనా ద్వారా స్థాపించారు. ఆ సమయంలో ప్రపంచం పెరిగిపోతున్న జాతీయవాదం, నిరంకుశ పాలనలు మరియు “దేవుడు లేని మానవత్వం” మరియు తనను తాను రక్షించుకోగలననే నమ్మకాలతో ఊయలలూగి పోతున్న రోజులవి.   రాజకీయ సిద్ధాంతాలు, సైనిక శక్తి మరియు మానవ పురోగతిపై ప్రజలు తమ విశ్వాసంను నిలుపుకున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత జీవితం నుండి క్రీస్తు ప్రభువును బయటకు ననెట్టి వేసినపుడు, గందరగోళం, హింస అతని స్థానంలోకి వస్తాయని 11 వ భక్తి నాధ పోపు గారు స్పష్టంగా సమాజ భవితను చూశారు. కాబట్టి శాంతి, న్యాయం, గౌరవం మరియు స్వేచ్ఛను తెచ్చే నిజమైన రాజు క్రీస్తు మాత్రమే అని ప్రపంచానికి గుర్తు చేయడానికే అతను ఈ పండుగను  స్థాపించారు.

 

నేటి లేఖనాలు మనకు "భూలోక రాజులకు అధిపతి" (ప్రకటన 1:5) క్రీస్తు ప్రభువే అని ఉద్బోధన చేస్తుంది. అతను ఈ లోక పాలకులకు పూర్తి భిన్నంగానూ మరియు "ఆకాశ మేఘాలపై వస్తున్న మనుష్యకుమారుడు" (దానియేలు 7:13). కాలం, చరిత్ర మరియు సృష్టికి అతీతంగా వినాశనం కాని రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ రాజు. కానీ చాలా అద్భుతంగా, యేసు బంగారు సింహాసనం నుండి కాకుండా శిలువ నుండి పరిపాలిస్తున్నట్లు సువార్తలు మనకు చూపిస్తున్నాయి. అతని కిరీటం ముళ్ళతో తయారు చేయబడింది. అతని విలువైన రక్తపు వస్త్రం రాజ వస్త్రం. మేకులతో గుచ్చబడిన చేతులే తన  రాజదండం. అయినప్పటికీ, అటువంటి సింహాసనం నుండే అతను తన రాజ్య అధికారాన్ని పాలిస్తాడు. "ఈ రోజే నీవు  నాతోపాటు స్వర్గంలో ఉంటావు" (లూకా 23:43) అన్న ప్రమాణం ఈ నీతి పాలనను మనకు గుర్తు చేస్తుంది. అతని రాజ్యం ఆధిపత్యం కాదు, స్వీయార్పణ  ప్రేమ, బలోపేత పెత్తనం అంతకంటే కాదు, అది కరిగిపోని కరుణ. క్రీస్తు స్వభావరీత్యా అతను రాజు అనీ, దేవుని ఏకైక కుమారుడనీ మరియు  పాపం, చీకటి శక్తులు, మరణంపై విజయం సాధించాడని మాతృ తిరుసభ మనకు బోధిస్తుంది. అలాగునే అతను కుటుంబాలు, సంఘాలు సమాజాలను ప్రకాశవంతం చేసేటటువంటి  ఆత్మలుగా మన ఆత్మలను  మారుస్తాడు అని విస్వసిస్తుంది. అతను తన విలువైన రక్తం ద్వారా ప్రతి ఒక్కరినీ విముక్తి చేస్తాడు. దివ్య సత్ర్పసాద వరం ద్వార మన మనస్సులను నిలబెడతాడు. తిరుసభ పితృ పాదులు, పునీత అగుస్టిను  మరియు పునీత ఆంబ్రోసు లాంటి వారు, క్రీస్తు సత్యపు రాజ్యంలో పరిపాలిస్తున్నాడు కాబట్టి, అక్కడ అబద్ధం ప్రవేశించలేదనీ, ప్రతి వ్యక్తిలో దైవీక ప్రతిరూపo మాత్రమె పునరుద్ధరింప బడుతుందని బోధించారు.

 

నేడు, చాలా మంది నకిలీ రాజులు తమ రాజకీయ సిద్ధాంతాలతో, సోషల్ మీడియా వేదికలతో, భౌతిక విజయాలతో మన దృష్టిని ఆకర్షిస్తున్నారు. దానికి మన స్వంత అహం కూడా జోడి అవుతుంది. ఈ రాజులు స్వేచ్ఛను మనకు వాగ్దానం చేస్తున్నారు. కానీ అది తరచుగా శూన్యత మరియు వ్యసన జీవితం మాత్రమె. మానవ హృదయం నిజంగా కోరుకునేది క్రీస్తు రాజును మాత్రమే. హింస ప్రపంచంలో, ఆయన సత్యం, శాంతి మరియు ఒక ప్రామాణికమైన సయోధ్య. ఒంటరితనంలో ఉన్న ప్రపంచంలో, ఆయన ఇమ్మానుయేలు (మనతో ఉన్న దేవుడు). నైతిక గందరగోళం మరియు నిరాశతో కూడిన ప్రపంచంలో, ఆయనే మనకు మార్గం మరియు ఆశ. నేటి ప్రపంచంలో క్రీస్తును రాజుగా ప్రకటించడం అంటే సాపేక్షవాదపు  నియంతృత్వాన్ని, వినియోగదారుల బానిసత్వాన్ని మరియు స్వయం సమృద్ధి భ్రాంతిని తిరస్కరించడమే కదా! మన జీవితాలు గడచిపోయే ధోరణులకు లేదా మారుతున్న సిద్ధాంతాలకు చెందినవి కావు. కానీ శాశ్వత ప్రభువుకు చెందినవని. మనం అర్చనా సంవత్సరాన్ని ముగించేటప్పుడు, క్రీస్తు రాజు మనలో ప్రతి ఒక్కరినీ తన వ్యక్తిగత ప్రతిబింబానికి ఆహ్వానిస్తున్నాడు. ఈ తరుణంలో మన ముందు నిలిచే పెద్ద ప్రశ్న,  నా జీవితాన్నినిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? క్రీస్తు తన రాజరికపు ఆంక్షలను మనపై విధించడు. పశ్చాత్తాపపడిన దొంగ, "యేసు, నీవు నీ రాజ్యంలోకి వెళ్లి నప్పుడు నన్ను గుర్తుంచుకో" అని అడిగినట్లు మనం కుడా అలా అర్ధించడానికి ఆహ్వానించబడ్డాము. అపుడు దయగల విశ్వ పాలకుల రాజు యేసు మనతో, “ఈ రోజు నువ్వు నాతో పాటు పరదైసులో, ఆనందకరమైన స్వర్గంలో ఉంటావు” అని  దయ చూపుతాడు.

 

క్రీస్తు మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన సంఘంలో మరియు మన ప్రపంచంలో రాజ్యం చేయుగాక!”

“మీ రాజ్యము వచ్చును గాక!


No comments:

Post a Comment