నీతి సూర్యుడు రానై
యున్నాడు
మలాకీ
3:19-20; 2 థెస్స 3:7-12; లూకా
21:5-19 (C 33)
“మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును” (మలాకీ 4:2)
నేటి సువార్త మనుష్యకుమారుని రెండవ రాకడ
గురించి హెచ్చరిస్తుంది. అర్చనా సంవత్సరం ముగిసే సమయానికి, మాతృ శ్రీసభ “పరూసియా” (క్రీస్తు
పునరాగమనం) రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది.
అదే సమయంలో "అంతిమ విషయాలు" -
మరణం, తీర్పు, నరకం
లేదా స్వర్గం వంటి విషయాల గురించి ఆలోచించమని మనల్ని ఆహ్వానిస్తుంది. గ్రీకు పదం
“పరూసియా” అనేది “పారా” (ప్రక్కన) మరియు “ఊసియ” (సారాంశం)
అనే రెండు పదముల కలియకే “పరూసియా”. దీని సాహిత్యపరమైన అర్థం “ఉనికి,” లేదా “రాక”. ఈ “పరూసియా” నూతన నిబంధనలో
తరచుగా “యేసు రెండవ రాకడ”ను అందునా ఆదిమ క్రైస్తవ్యం సుమారు క్రీ. శ. 64 దశకంలోనూ
మరియు నేటి సిద్దాంతిక వేదాంతం సూచిస్తూ వుంటుంది. యూదుల లేఖనాలలో “ప్రభువు రోజు” అనే
భావన ఒకటి ఉంది. ఆయా లేఖనాలు “సమయం” రెండు యుగాలలో ఉన్నట్లుగా భావిస్తున్నాయి. అది
మొదట, పూర్తి చెడుగానూ, నయం చేయలేనిదిగానూ మరియు నాశనానికి
మాత్రమే అర్హమైన యుగంగానూ ఉంటుంది. రెండవది
రాబోయే దేవుని స్వర్ణయుగం. కానీ ఈ రెండింటి మధ్య “ప్రభువు రోజు/గడియ” అనేది ఉంటుంది. ఇది విశ్వ తిరుగుబాటు మరియు విధ్వంసం. ఇది ఒక నూతన యుగపు తీరనీ, ప్రసవ వేదనల భయంకరమైన
సమయంగానూ సూచిస్తుంది. దీనినే మన క్రైస్తవ్యం “పరూసియా”లేదా “ప్రభువు రోజు” అని
ప్రతిబింబింప చేస్తుంది.
అది ఒక భయానక దినం. “ఇదిగో ప్రభువు
దినము వచ్చును.
అది క్రూరమైనది, ఉగ్రతతోను, తీవ్రమైన కోపముతోను, భూమిని నాశనం చేయుటకును పాపులను దానినుండి
నశింపజేయుటకును వస్తుంది” (యెష 13:9;
యోవే 2:1-2 పోల్చండి; ఆమో
5:18-20; జెఫా 1:14-18). అది అకస్మాత్తుగా వస్తుంది. “రాత్రి దొంగ వచ్చునట్లు ప్రభువు
దినము వచ్చును” (1 థెస్స 5:2; 2 పేతు
3:10 పోల్చండి). అది లోకము ముక్కలైపోయే దినం
అవుతుంది. “ఆకాశ నక్షత్రములును వాటి నక్షత్రరాసులును తమ కాంతిని లోల్పోతాయి. సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు లేకుండా
చీకటిగా ఉండును.
చంద్రుడు తన కాంతిని కోల్పోవును....
కాబట్టి, ఆయన ఉగ్రమైన కోప దినమున ఆయన ఉగ్రత వలన
భూమి తన స్థానము నుండి కదలింపబడును” (యెష 13:10-13;
యోవే 2:30-31; 2 పేతు 3:10).
యేసు కాలంలో యూదు మతపరమైన ప్రాథమిక భావనలలో లూకా సువార్తికుడు మనకు సమర్పించే “ప్రభువు దినం” అందులో ఒకటి (లూకా 21:9; 21:11; 21:25-26).
దేవుడు న్యాయవంతుడు మరియు ప్రతి
వ్యక్తికి అతను భూమిపై సంపాదించిన దానినే (బట్టే) ఇస్తాడు. ఆయన ఏకపక్షంగా
శిక్షించడు. ప్రతిఫలం దానిని బట్టే వుండును. ఆయన మన స్వేచ్ఛను గౌరవిస్తాడు.
అయినప్పటికీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, మనకు
ఇకపై ఎంచుకునే స్వేచ్ఛ ఉండదని మనం గుర్తుంచుకోవాలి. "పశ్చాత్తాపపడకుండా మరియు
దేవుని దయగల ప్రేమను అంగీకరించకుండా ప్రాణాంతకమైన పాపంలో చనిపోవడం అంటే మన స్వంత
స్వేచ్ఛా ఎంపిక ద్వారా ఆయన నుండి శాశ్వతంగా వేరుగా ఉండటం" (సత్యోపదేశం లేదా CCC 1033).
నేటి సువార్త రెండవ భాగంలో, తన అనుచరులు తన ఎడల కలిగిన తమ నమ్మకాల వలన
హింసలను ఎదుర్కొంటారని యేసు హెచ్చరిస్తున్నాడు. లూకా సువార్తికుడు హింసను యేసు
అనుచరులకు ఒక అవకాశంగా ప్రతిపాదిస్తున్నాడు. ఎందుకంటే “ఇది మీకు సాక్ష్యమివ్వడానికి
దారితీస్తుంది” (లూకా 21:13). కాబట్టి హింసల కాలంలో
దేవుని జ్ఞానం మరియు
శక్తి యేసు తన అనుచరులకు ఒక ఉదాహరణగా చూపబడుతుంది. హింసను ఎదుర్కొనే పట్టుదల వారి
రక్షణకు దారి తీస్తుంది. కష్ట సమయాల్లో కూడా విశ్వాసులకు తాను అండగా ఉన్నాడని
ఇక్కడ యేసు తన అనుచరులకు హామీ ఇస్తున్నాడు. చివరికి, యేసు
తన మరణంతోనే దీనికి సాక్ష్యమిస్తున్నాడు. యేసు శిష్యులుగా, మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు దేవుని దయా
రక్షణను విశ్వసిస్తూ, ఆయన మాదిరిన అనుసరించడానికి ప్రయత్నిoచుదాము.
“ఆయన లోకమునకు న్యాయమునుబట్టియు, తన సత్యమునుబట్టి జనములకు తీర్పు
తీర్చును”
No comments:
Post a Comment