AletheiAnveshana: “క్రీస్తు నీటిని శుద్ధి చేయడానికి బాప్తిస్మం తీసుకున్నాడు” యెష 42:1-4, 6-7; అపొ 10:34-38; మత్త 3:13-17 (A)

Friday, 9 January 2026

“క్రీస్తు నీటిని శుద్ధి చేయడానికి బాప్తిస్మం తీసుకున్నాడు” యెష 42:1-4, 6-7; అపొ 10:34-38; మత్త 3:13-17 (A)




క్రీస్తు నీటిని శుద్ధి చేయడానికి బాప్తిస్మం తీసుకున్నాడు

యెష 42:1-4, 6-7; అపొ 10:34-38; మత్త 3:13-17 (A)

మహాత్మ్యముగల దేవుని స్వరం జలాలపై ప్రతిధ్వనిస్తుంది.”

 

ఈ రోజు మనం ప్రభువు జ్ఞానస్నాసపు పండుగను జరుపుకుంటున్నాము. ఇది యేసు ఉనికి మరియు ఆతనిలోని మన ఉనికిని వెల్లడిచేస్తుంది. జోర్డాను నది వద్ద,  పాపులు పశ్చాత్తాపం కోరుకునే నీటిలోకి యేసు అడుగుపెడు తున్నాడు. అయినప్పటికీ అతను పాపరహితుడు. అతను “పాపం తప్ప అన్ని విషయాలలో మనలాగే ఉన్నాడు” (హెబ్రీ 4:15) అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. అయితే అతను బాప్తిస్మం తీసుకోవాలని ఎందుకు కోరుకున్నాడు?  మన పితృపాదులు నాజియాన్జస్‌ అనే ప్రాంతానికి చెందిన పునీత గ్రెగొరీ వారి మాటల ద్వారా మన మాతృ తిరుసభస, “క్రీస్తు శుద్ధి చేయబడాల్సిన అవసరం ఉన్నందున కాదు, నీటిని శుద్ధి చేయడానికి బాప్తిస్మం తీసుకున్నాడు” అని మనకు చక్కటి సమాధానమిస్తుంది. తాను శుద్ధి చేయబడటానికి యేసు జోర్డాను నదికి వెళ్ళలేదు.  ఆ నీటిని శుద్ధి చేయడానికి అతను నది లోపలికి వెళ్ళాడు. అతని సన్నిధి లేదా ఉనికి ద్వారా, నీళ్లు మార్పు చెందాయి. పవిత్రులు జలంలో దిగడం వల్ల ఆ జలం పవిత్రమౌతాయి గానీ ఎటువంటి జలం ఏనాటికీ పవిత్రులను కడుగలేదు కదా!! బాప్టిజంలో మనకు కొత్త జీవితాన్ని ఒసగడానికై, క్రీస్తు నీటిలోకి దిగడం ద్వారా అన్ని జలాలను పవిత్రం చేశాడని పవిత్ర సత్యోపదేశo మనకు బోధిస్తుంది (CCC 536–537).

 

దీని అర్థం – ప్రతి బాప్టిజం మన బప్తిస్మముతో సహా – ఈ క్షణం నుండే దాని పరమ శక్తిని పొందుతుంది. మనపై నీరు పోయబడినప్పుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, క్రీస్తు స్వయంగా ఈ చర్యను ప్రభావితం చేస్తున్నాడు. మనల్ని శుద్ధి చేస్తూ, స్వస్థపరుస్తూ, తిరిగి నూతనంగా సృష్టిస్తున్నాడు. యోర్దాను నది వద్ద, స్వర్గం తెరుచుకుంది. ఆత్మ దిగి వచ్చింది. తండ్రి స్వరం, "ఈయన నా ప్రియమైన కుమారుడు" (మత్త 3:17) అని వినబడింది. ఇక్కడ పవిత్ర త్రిమూర్తులలో ప్రతీ ఒక్కరి రహస్యం వెల్లడైంది. ఒకప్పుడు పాపంతో మూసివేయబడిన స్వర్గం మళ్ళీ తెరవబడింది. పునీత గ్రెగొరీ చెప్పినట్లుగా, ఆదాము మూసివేసిన ద్వారాలను క్రీస్తు తెరిచాడు. జోర్డాను అరణ్యం గుండా ప్రవహిస్తుంది. అది బంజరు మరియు పోరాట ప్రదేశం అయినప్పటికీ అక్కడే వెలుగు విస్ఫోటనం చెందుతుంది. యెషయా వాగ్దానం: "చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు" (యెష 9:2) అన్న ప్రవచనం  నెరవేరింది. బాప్తిస్మమే  ఈ వెలుగు. సత్యోపదేశo దీనిని ప్రకాశం అని పిలుస్తుంది. ఎందుకంటే ఇది ఆత్మను ప్రకాశవంతం చేస్తుంది కాబట్టి  (CCC 1216).

 

కానీ ఈ ఉత్సవం క్రీస్తు బాప్తిస్మము గురించి మాత్రమే కాదు, ఇది నేటి మన బాప్టిజం గురించిన ఉద్దేశ్యాన్ని కలిగి వుంది. పునీత గ్రెగొరీ, “క్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. మనం ఆయనతో పాటు దిగి వెళ్దాం. తద్వారా మనం ఆయనతో కూడా లేచి నూతన జీవితంలోకి నడవవచ్చు” అని మనల్ని ఇలా సవాలు చేస్తున్నాడు. బాప్టిజంలో మనం క్రీస్తుతో మరణిస్తున్నామని తద్వారా మనం ఆయనతో లేచి నూతన జీవితంలో నడుస్తున్నామని (రోమా 6:4) పునీత పౌలుడు మనకు చెబుతున్నాడు.  మీరు చర్చికి హాజరయ్యే వ్యక్తులు మాత్రమే కాదు. మీరు బాప్తిస్మం తీసుకున్నవారు. నీవు భయంలో లేదా చీకటిలో జీవించకూడదు. నీవు వెలుగు బిడ్డవు. నీవు  సువార్తకు ప్రేక్షకునివి  కాదు – నీవు క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షివి. పాపం నిశ్శబ్దంగా తిరిగి వచ్చే చోటును  మరియు సమయాన్ని తిరస్కరిoచు. రాజీపడని వెలుగును ఎంచుకో!! నీ ఇల్లు, కార్యాలయం మరియు సమాజాలలో నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు. అలాగునే మాట్లాడండి. వ్యవహరించండి. పవిత్ర జలంతో నిన్ను నీవు ఆశీర్వదించుకున్నప్పుడు, గుర్తుంచుకో - ఈ జలాలను క్రీస్తు నీ కోసం శుద్ధి చేసాడని!!!

 

"ఈయన నా కుమారుడు, ఆయనయందు నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి, ఆయన మాట వినండి".

No comments:

Post a Comment