యేసు తట్టుచున్నాడు. అప్రమత్తంగా ఉండుము
జ్ఞాన 18:6-9; హెబ్రీ 11:1-2,8-19; లూకా 12:32-48 (19/ C)
“మనలో
ప్రతి ఒక్కరూ మన హృదయంలో దేవుడిని కలిగి ఉన్నాము. ఆయన దివ్య ప్రతిరూపంగా రూపాంతరం
చెందుతున్నాము” (పునీత
సినాయి అనస్తాసియుసు)
యేసు
చెప్పిన గృహనిర్వాహకుని ఉపమానంలో జాగరూకత గురించిన సందేశాన్ని సువార్తికుడు లూకా మనకు
అందిస్తున్నాడు. యేసు కాలంలోని గృహనిర్వాహకులు యజమాని లేనప్పుడు ఇంటిని దాని
సిబ్బందిని నిర్వహించే బాధ్యత వహించేవారు. ఈ అలాంటి వారిలో ఒక వ్యక్తి చేసిన తప్పు
ఏమిటంటే, యజమాని
లేనప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరించాడు. రాబోయే తీర్పుకు సిద్ధంగా ఉండాలనీ,
అర్ధరాత్రిన వచ్చినప్పటికీ అప్రమత్తంగా ఉండాలనీ, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహం
వలే ఎప్పుడూ వెనక్కి తిరగవద్దని యేసు
మనల్ని హెచ్చరిస్తున్నాడు. విశ్వాసం సహనం ఆధ్యాత్మిక ధర్మాలుగా పరిగణించబడతాయి. పునీత
పౌలు విశ్వాసాన్ని ఇలా నిర్వచించాడు, “విశ్వాసమనేది
మనం నిరీక్షిస్తున్న వాటిలో నమ్మకం, మనం చూడని వాటి గురించిన నిశ్చయత” (హెబ్రీ 11:1) అని నిర్వచించాడు.
యేసు
పట్ల విశ్వాసం మరియు ప్రేమతో నిండిన ఇద్దరు యువతులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా
త్యాగం చేశారు. ఈ సంఘటన 202
క్రీ.శ. రోమను సామ్రాజ్యంలో భాగమైన ఉత్తర ఆఫ్రికాలోని కార్తేజు
(ట్యునీషియా) అనే ప్రాంతములో జరిగింది. ఇటలీ దేశపు రోము చక్రవర్తి అయిన సేప్టిముస్
సేర్వానుసు పుట్టినరోజు వేడుకలకు సిద్ధమయ్యే సమయం అది. చక్రవర్తి పుట్టినరోజు
వేడుకల మధ్య, మరణ శిక్షకు
పోరాడుతున్న గ్లాడియేటర్ల (బానిస యుద్ద వీరులు)తో ఉచిత ఆటలు నిర్వహించబడ్డాయి. ఇటువంటి
పోరాట ఆటల మధ్యమధ్యన దేశ ద్రోహులకు విధించబడిన శిక్షను క్రూరమైన
జంతువులకు ఆహారంగా ఇచ్చే వినోదాలు ఉండేవి. ఈ ఇద్దరు యువతులు ఆ వినోద క్రూర ఆటలకు బాలి
అయ్యారు. వారు 22 ఏళ్ల
ఉన్నత కుటుంబ యువతి మరియు ఆమె సేవకురాలు. ఇద్దరూ గర్భవతులే. ఒక మిషనరీ, యేసుక్రీస్తు తన శాశ్వత రాజ్యం మరియు దేవుని ప్రేమ గురించి బోధించటం వారు
విన్నారు. వారు క్రైస్తవులు కావాలని నిర్ణయించుకున్నారు. క్రైస్తవులుగా జీవించడం
వల్ల వారి ఆనందం ఎంత ఎక్కువ అయిందో, రోము చక్రవర్తి
దృష్టిలో అది అంత కర్కశంగా మారింది. ఆ గొప్ప యువతులలో ఒకరు పెర్పెతువ (ఫెలిక్స్), రెండవ వారు ఫెలిచిత (సంతోషం) ఆమె సేవకురాలు. మరియు యేసుక్రీస్తులో
దేవుని ప్రేమను ఇతరులు గ్రహించాలనీ, సాక్ష్యమివ్వాలని వారు నిర్ణయించుకున్నారు. తమ
ఆనందాన్ని తమలోనే దాచుకునే అవకాశమే వారికి లేదు. క్రీస్తును తిరస్కరించడం అంటే
తమను తాము తిరస్కరించుకోవడమేనని ఇద్దరూ నమ్మారు. ఇద్దరూ, “నేను
క్రైస్తవురాలిని” అని బాహాటం చేశారు. వారిని అరెస్టు చేసి భయంకరమైన జైలులో పడవేశారు.
వినోద ఆటలు ప్రారంభమయ్యాయి. పెర్పెతువ మరియు ఫెలిచిత మరియు
మరో ముగ్గురు వినోద యుద్ద భూమిన క్రూరమృగాల ముందు విసిరివేయబడ్డారు. రోమన్లు
గర్భిణీ అమ్మాయిని చంపరు ఎందుకంటే అది శిశువును చంపడం లాంటిది. కానీ సైనికులు ఆ అమ్మాయిలను అన్యమత దేవతల వలె అలంకరించారు.
ఇది
ప్రేక్షకులకు నచ్చలేదు. కాబట్టి, వారి గర్భాలు కంపించకుండా వారికి
భారీ బట్టలు ధరింపచేసి స్టేడియంలోకి
నడిపించారు. అడవి దున్నల గుంపును ఆ రక్త భూమిలోనికి విడుదల చేశారు. అవి ఆ యువతులవైపు పరుగులు తీస్తున్న ప్పుడు భూమిపై నుండి లేచిన
దుమ్ము వారిని కప్పివేసి వారిని కానరాకుండా చేసింది. పెర్పెతువ తన
సేవకురాలు ఫెలిచితతో, "కానీ అందరూ చూసేలా మనం క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి"
అని అన్నది. వారి ధైర్య సాహసాలను చూచిన ప్రజలు క్రైస్తవులుగా మారకుండా
నిరోధించడానికి, ఈ అమ్మాయిల ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోకుండా ఉండటానికై
సైనికులు స్టేడియం గోడకు అతుక్కుపోయిన వారిని మధ్యలోకి లాక్కోచ్చారు. సైనికులు దుమ్ములోనే
వారిద్దరినీ చంపేశారు. గురువు ఏ పూజలోనైనా మొదటి దివ్య సత్ప్రసాద ప్రార్ధనను ప్రార్ధిస్తే
మనం ఈ ఇద్దరి పేర్లను తప్పకుండా వింటాం. పెర్పేతువ ఫెలిచితల రక్త సాక్ష్యం నేటి
మనకు ధైర్యాన్నిస్తుంది కదా! "బయటకు రండి, యుద్ధ భూమి మధ్యలోకి
వచ్చి సాక్ష్యం ఇవ్వండి" అనేది క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలనే మన ఆత్మల
అంతర్గత బలమైన కోరిక. యేసును తిరస్కరించేవారు ఆయన కోసం బాధపడమని మనల్ని పిలిచే యుద్ధ
భూమి కేంద్రం వంటి వారు. మన విశ్వాసానికి సరైన ప్రతిస్పందన ఇతరులను క్రీస్తు వైపు
నడిపించడం. మనం క్రీస్తును ఎన్నుకున్నాము. వెనక్కి తగ్గే అవకాశమే లేదు.
"చిన్న మందా, ఇక భయపడకు" (లూకా
12:32) అని యేసు చెప్పిన సున్నితమైన మాటలతో నేటి సువార్తా పఠనం ప్రారంభమవుతుంది.
భయం అనేది శారీరక, ఆధ్యాత్మిక, మానసిక, భావోద్వేగ లేదా నైతిక
ప్రమాదం వల్ల కలిగే ఆందోళన. మనం అన్ని రకాల విషయాలకు భయపడతాము! ఇది మనలోని మానవ
సహజ నిర్మితం. మన ఆరోగ్యాన్ని కోల్పోతామని, ఉద్యోగాలు కోల్పోతామని, కుటుంబ సభ్యుడిని కోల్పోతామని లేదా మంచి స్నేహితులను
కోల్పోతామని భయపడతాము. ఒంటరిగా జీవించడం, ఒంటరిగా చనిపోవడం, తిరస్కరణ, వైఫల్యం మరియు డబ్బును కోల్పోతామని భయపడతాము. మనం
సాన్నిహిత్యం లేదా వదిలివేయబడతామని భయపడవచ్చు. భయం మన ఆధ్యాత్మిక మానసిక ఎదుగుదలకు
ఆటంకం కలిగిస్తుంది. మన భయాలు మనల్ని తమ బంధంలో బందిస్తాయి. దేవుని స్వేచ్ఛను
అనుభవించకుండా నిరోధిస్తాయి. మన భయాలను ప్రతిరోజూ ఎదుర్కోవడం వలన ఆధ్యాత్మికంగా
మానసికంగా ఎదగడానికి మనకు అవకాశాలను అందిస్తుంది. మన రక్షకుడిని కలవడానికి మనం
సిద్ధమవుతున్నప్పుడు వాటిని సవాలుతో ఎదుర్కోవడానికి ఇది ఒక చక్కటి పిలుపు. పునీత
అగస్టీను గారు, “మనలో
ప్రతి ఒక్కరూ ముగింపుకు సిద్ధం కావాలి. ప్రతి రోజు చివరి రోజులా జీవించే ఎవరికీ
చివరి రోజు అనేది ఎటువంటి హానిని కలిగించదు. మీరు శాంతియుతంగా చనిపోయే విధంగా
జీవించండి. ఎందుకంటే
ప్రతిరోజూ చనిపోయేవాడు ఎన్నడు చనిపోడు” అని అంటాడు.
ఇప్పుడు
కావచ్చు రేపు కావచ్చు మన రక్షకుడు వచ్చినప్పుడు మనం మన పనులు చేసుకుంటూ ఉండాలని ఈ
ఉపమానం మనకు గుర్తు చేస్తుంది. నేడు యేసు మన హృది తలుపు తట్టితే, ఆయనను
స్వీకరించడానికి మనం సిద్ధంగానూ ఆసక్తిగానూ ఉండగలమా? రోజున ఏ క్షణంలోనైనా ఆయన రాకకు మనం సిద్ధంగా ఉండాలని ఆయన
కోరుకుంటున్నాడు. ఆయన అందరి హృదయపు తలుపు తట్టి, "వినుము! నేను నిలబడి మీ తలుపు తట్టుతున్నాను. మీరు నా స్వరం
విని తలుపు తెరిస్తే, నేను
లోపలికి వస్తాను మరియు మనం కలిసి విందు చేసుకుంటాము" (ప్రక 3:20). ఆయనే మనలను తన రాకకు సిద్ధపరుస్తాడు.
“మన హృదయాలలో, క్రీస్తు తండ్రితో కలిసి తన నివాసాన్ని తీసుకుంటాడు, అతను ప్రవేశించినప్పుడు ఇలా అంటాడు: నేడు ఈ ఇంటికి మోక్షం వచ్చింది” (పునీత సినాయి అనస్తాసియుసు)
No comments:
Post a Comment