AletheiAnveshana: వినయం న్యాయానికి బీజం సిరాకు 3:17-18,20,28-29; హెబ్రీ 12:18-19,22-24; లూకా 14:1,7-14 (22 /C)

Saturday, 30 August 2025

వినయం న్యాయానికి బీజం సిరాకు 3:17-18,20,28-29; హెబ్రీ 12:18-19,22-24; లూకా 14:1,7-14 (22 /C)

 

 

వినయం న్యాయానికి బీజం

సిరాకు 3:17-18,20,28-29; హెబ్రీ 12:18-19,22-24; లూకా 14:1,7-14 (22 /C)

చాలా పురాతనమైన మరియు నూతనమైన సుందరి, ఆలస్యంగా నేను నిన్ను ప్రేమించాను!” (పునీత అగుస్టిను)

 

దేవుని వాక్యం నేడు మనల్ని వినయానికి పిలుస్తుంది. ఇది వ్యక్తిగత సద్గుణంగా మాత్రమే కాకుండా, మనం ఒక సమాజంగా, ఒక సంఘంగా ఎలా కలిసి జీవిస్తామనే దానికి పునాదిగా వుండడానికి పిలుస్తుంది. సిరాకు గ్రంథం ఇలా చెబుతుంది, “నా బిడ్డా, నీ వ్యవహారాలను వినయంతో నిర్వహించు. అప్పుడు నీవు బహుమతులు ఇచ్చేవాడి కంటే ఎక్కువగా ప్రేమించబడతావు” (సిరాకు 3:17; సామెత 23:22). యూదు జ్ఞాన సంస్కృతిలో, వినయం అంటే దేవుని ముందు సత్యంలోనూ, ఇతరుల యందు న్యాయంలో నడవడం. యేసు ఇలా బోధిస్తాడు, “నిన్ను ఆహ్వానించినప్పుడు, వెళ్లి అత్యల్ప స్థానంలోకి వెళ్లు... తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు మరియు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు” (లూకా 14:10-11). ఆయన ఇంకా లోతుగా ఇలా అంటాడు: “నీవు విందు ఏర్పాటు చేయునప్పుడు, పేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఆహ్వానించుము. వారు నీకు ప్రతిఫలము ఇవ్వలేరు గనుక నీవు ధన్యులవుదువు” (మత్త 5:46-47). మానవుని గౌరవం అనేది అందరూ దేవుని స్వరూపములోనే  సృష్టించబడ్డారని గ్రహించడంలో ఉంది.

ఇక్కడ, యేసు వ్యక్తిగత వినయాన్ని మాత్రమే కాకుండా ‘పేదలకు ప్రాధాన్యత’ అనే ఎంపికను కూడా బోధిస్తున్నాడు. ఒక సమాజం, ఒక విచారణ లేదా క్రైస్తవ జీవితం అన్నది ఒక వ్యక్తి ధనంలో బలవంతులైన వారితో ఎలా ప్రవర్తిస్తారనే దాని ద్వారా కాదు కానీ, అన్ని విధాల బలహీనులైన వారిని ఎలా ఉద్ధరిస్తారనే దాని మీద నిర్ణయించబడుతుంది. "క్రైస్తవుడి మొదటి సద్గుణం వినయం. వినయం స్వీయ నిర్లక్ష్యం కానే కాదు. అది స్వీయ బహుమతి” అని పునీత అగుస్టిను అంటాడు. అదే విధంగా, పునీత గ్రెగొరీ ది గ్రేట్ , "గర్వం అన్యాయానికి విత్తనం. కానీ వినయం నిజమైన న్యాయానికి విత్తనం. ఎందుకంటే అది ఇతరులకు సేవ చేయడానికి మన హృదయాలను తెరుస్తుంది" అని వ్రాశాడు. ఇటువంటి తిరుసభ పితృపాదులు ఆధునిక కథోలిక సామాజిక బోధనాభివృద్ధిని (development of modern Catholic Social Teaching) ముందుగానే ఊహించారు. మనం దేవునిలో ఒకే కుటుంబం అని, ఒకరినొకరు ఉద్ధరించడానికి పిలువబడ్డామని ఈ బోధన  మనకు గుర్తు చేస్తుంది.

“వినయం”గా ఉండటం అంటే వలస వచ్చినవారు, పేదలు, రోగులు, పుట్టబోయే పిల్లలు, వృద్ధులు మరియు అణగారిన వారివైపు/తరపున రూతు గ్రంథంలోని బోవజు వలే నిలబడటం/ఆదరించడం లేదా పోరాడటం. ప్రతి రాజకీయ విధానం, ప్రతి సంస్థ మరియు ప్రతి సమాజం మానవ గౌరవాన్ని ఎలా రక్షిస్తుంది లేదా సాధారణ మంచిని (common good) ప్రోత్సహిస్తుంది అనే ప్రమాణాల ద్వారా పరిణామాలను కొలవబడాలని కథోలిక సామాజిక బోధన మనకు గుర్తు చేస్తుంది. వినయం అనేది మనల్ని మనం మించిపోయి నడవడానికి లేదా ‘జీవిత విందు’ నుండి ఎవరూ మినహాయింపుకు గురికాని సమాజాలను నిర్మించడానికి మనల్ని సవాలు చేస్తుంది ఈ బోధన. నిజమైన వినయం అంటే తన  గురించి తాను చెడుగా భావించు కోవడం లేదా తనను తాను ఇతరుల కంటే తక్కువగా భావింకోవడం లాంటి న్యూనతను కలిగి వుండడం అసలే కాదు. అలాంటి వినయం మనల్ని మనపైనే స్వార్ధ దృష్టిని సారించనివ్వకుండా విముక్తి చేస్తుంది. అయితే స్వీయ న్యూనతాభిప్రాయం మన దృష్టిని మనపైనే కేంద్రీకరిస్తుంది. వినయం అనేది స్వీయ-అవగాహనలో నిజం మరియు దినచర్యలో నిజాన్ని కలిగిస్తుంది. మనల్ని మనం నిజాయితీగా, స్ప్రుహ తీర్పుతో  సింహావలోకనం చేసుకోవడం అంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో, అలా మనల్ని మనం చూసుకోవడం (కీర్తన 139:1-4). వినయపూర్వకమైన వ్యక్తి తాను అనే “తన” భ్రమనుండి విముక్తి చెంది తనను తాను వాస్తవికంగా అంచనా వేసుకుంటాడు.

ఇది అతి సుందరంగా మన నేటి దివ్య సత్ర్పసాద వేడుకలో నెరవేరడం మనం గమనిస్తున్నాము. ప్రతి సంఘారాధన అనేది యేసు రాజ్య విందు. ఇక్కడ ఉన్నతమైనవారు తక్కువారు, దీనులు ధనవంతులు,  మరియు బలవంతులు బలహీనులు అని తేడా లేకుండా కలిసి సమావేశమవుతారు. ఒక గొంతున సంఘటిత మవుతారు. ఇది ఒకరు సాధించిన పరపతితోనో లేదా తమ తమ స్థానాన్ని బట్టి కాదుకానీ దేవుని కృపాదయ మనల్ని సమానంగా ఆహ్వానిస్తుంది కాబట్టి. దివ్య సత్ర్పసాద స్వీకరణ ముందు, “ప్రభూ! మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను అర్హుడిని కాదు..." అని మనం ప్రార్థిస్తాము. ఇది వినయం. మరియు ఆ క్షణంలోనే, పరలోక ప్రభువు తన శరీరరక్తాలతో మనల్ని పోషించడానికి వినయముగ్ధుడౌతాడు. ఇటువంటి దయా వినయం దాని లోతైన రూపంలోని సమసంఘీభావాన్ని మనకు పంచుతాడు. మానవుణ్ణి తనలోనికి హెచ్చించుకోవడానికి దేవుడు తనను తాను మన మానవత్వంతో ఏక పరచుకుంటున్నాడు. అతను తనను తాను ఖాళీ చేసుకున్నాడు, సేవకుడి రూపాన్ని తీసుకున్నాడు. మరణం వరకు, సిలువపై మరణం వరకుకునూ విధేయుడయ్యాడు (ఫిలి 2:7-8). ప్రభువైన యేసు తనను వెతుకుతున్న వారికి దయను ఇస్తాడు. మన ప్రపంచం నిరంతరం గుర్తింపు, శక్తి మరియు గౌరవాన్ని కోరుకునేలా మనల్ని లోకం లోనికి నెట్టివేస్తుంది. అయినప్పటికీ యేసు మనల్ని “అత్యల్ప స్థానం” తీసుకోవాలని ఆహ్వానిస్తున్నాడు. వినయమనేదానిని ఒక ప్రత్యేక వ్యక్తిగత ఆధ్యాత్మిక దినచర్యగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా యేసు చేసినట్లు మనం చేయగలమా?

"...ఈ వెలుగు నన్ను తయారు చేసింది. నేను దాని క్రింద ఉన్నాను. ఎందుకంటే దాని ద్వారా నేను తయారు చేయబడ్డాను" (పునీత అగుస్టిను)

No comments:

Post a Comment