AletheiAnveshana: రెండు మార్గాలలో ఒకటి మాత్రమే యెషయా 66:18-21; హెబ్రీ 12:5-7,11-13; లూకా 13:22-30 (21 / C)

Saturday, 23 August 2025

రెండు మార్గాలలో ఒకటి మాత్రమే యెషయా 66:18-21; హెబ్రీ 12:5-7,11-13; లూకా 13:22-30 (21 / C)

 

రెండు మార్గాలలో ఒకటి మాత్రమే

యెషయా 66:18-21; హెబ్రీ 12:5-7,11-13; లూకా 13:22-30 (21 / C)

 

స్వర్గ ప్రమాణాలు భూమి ప్రమాణాలు కావు (“ఆనందానికి ఆశాకిరణం నువ్వే”/గౌదియం ఎత్  స్పెస్)

 

"ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించు" (మత్త 7:13-14) అనే యేసు ఉపమానాన్ని సువార్తికుడు లూకా ద్వారా మాతృ శ్రీసభ ధ్యానిస్తుంది. "ఇరుకైన ద్వారం" లేదా "సూది కన్ను/బెజ్జం" (మార్కు 10:25)  అనే అలంకారం నేటి ఉపమానపు చివరి వచనాలను ప్రతిబింబిస్తుంది. ఇది యెషయా 43:5-6లోని పరలోక విందు సన్నివేశంలో, దేవుడు ఇశ్రాయేలు వారసులను తూర్పు మరియు పడమర, ఉత్తరం మరియు దక్షిణం నుండి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడుతూ, అతను తన పవిత్ర పర్వతంపై ఉన్న ప్రజలందరికీ గొప్ప ఆహార పదార్ధాలను ఉత్తమమైన ద్రాక్షాసరాయిములతో కూడిన విందును అందిస్తాడు (యెష 25:6) అని గుర్తు చేస్తుంది. ఆ విందులో పాల్గొనడానికి, యేసు తన శిష్యులను “జీవన మార్గం మరియు మరణ మార్గం” (కీర్త 1) అనే రెండు మార్గాల మధ్య ఎంపికకు పిలుస్తున్నాడు. "జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మీ యెదుట ఉంచితిని. కాబట్టి, జీవమును ఎన్నుకొనుడి" (ద్వితీ 30). ఇరుకు ద్వారము మరియు వెడల్పు ద్వారపు స్పష్టమైన రూపకాన్ని చిత్రీకరిస్తూ యేసు ఈ బోధను పునరుద్ఘాటిస్తున్నాడు.

యేసు కాలంలోని నగరాల్లో, వాటి ద్వారాలు నేటి ప్రహరీలు రెండు గేట్లు కలిగి వుండే బిల్డింగుల్లా ఉండేవి. ఆ నగరాల్లోనికి జనసమూహాలు, వ్యాపారులు మరియు రథ నావిక జంతువులు సులభంగా దాటగలిగే విశాలమైన ద్వారాలు ఉండేవి. వాటితో పాటుగా గిలకల గేటులాంటి చిన్న చిన్న ద్వారాలు కూడా వుండేవి. అక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఒకేసారి ప్రవేశించగలడు. తరచుగా వంగి లేదా పెద్ద పెద్ద లగేజీలను పక్కన పెట్టి ఒక్కో వ్యక్తి మాత్రమె లోనికి ప్రవేశించ గలిగేవారు. ఇదంతా ఒక్కసారి పొద్దు వాలి పోయిన తరువాత జరిగే దిన చర్య. అందుచేతనే ప్రయాణికులందరు పోద్దుపోకముందే నగర ప్రవేశం చేసేవారు. “ఇరుకైన ద్వారపు” శిష్యత్వం అంటే సర్వలోక సర్వభూయిష్టమైపోవడం లేదా ఈ ప్రపంచంలోని ప్రతి (అను)బంధాన్ని మోయడం గురించి కాదని సూచిస్తుంది. పరలోక నగరంలోనికి ప్రవేశించడానికి, క్రైస్తవుడు వినయం కలిగి, గర్వం, పాపం మరియు అనవసరమైన అహంకార తెల్ల నల్ల సామానులను వదిలివేయాలి. క్రీస్తును అనుసరించాలని వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాలి. ఈ చిత్ర రూపాన్ని ఉపయోగించడంలో, యేసు తన స్వంత హృదయాన్ని వెల్లడిస్తున్నాడు. ఆయన ఒక ఇరుకైన ద్వారం. ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు, "నేనే ద్వారం. నా ద్వారా ప్రవేశించేవాడు రక్షింపబడతాడు" (యోహా 10:9). ఈ ద్వారంలోకి ప్రవేశించడం అంటే ఆయన జీవన విధానాన్ని స్వీకరించడం. ఆయన శిలువ జీవితాన్ని జీవించడం. అయినప్పటికీ శిలువపు సంకుచితత్వం పునరుత్థానం మరియు శాశ్వత ఆనందంపు విశాలతలోకి తెరుచుకుంటుంది.

లూకా సువార్తకుని రచనలో యేసు, “ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించడానికి కష్టపడండి” (లూకా 13:24) అని అంటాడు. మూల గ్రీకులోని “అగోనిస్తె” అనే పదం తెలుగులో  “పోరాడండి” అనేది “వేదన”/”ఆవేదన” అనే భావం నుండి పుట్టుకొస్తుంది. అంటే శిక్షణలో ఆటగాని వలే పోరాడటం లేదా కుస్తీ పడటం. పునీత పౌలు “నేను మంచి పోరాటం పోరాడాను, నేను పరుగు పందెం పూర్తి చేశాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను” (2 తిమోతి 4:7) అని చెప్పినప్పుడు అదే భావాన్ని వ్యక్త పరుస్తున్నాడని మనం గుర్తించుకోవాలి. క్రైస్తవ జీవితం సులభమైన మార్గంలో యాదృచ్ఛిక నడక కాదు. కానీ ఓర్పు, అప్రమత్తత మరియు క్రమశిక్షణ అనే విలువలు పరుగు పందెంనకు అవసరమయ్యేవి. అవి ఎల్లప్పుడూ దేవుని కృప ద్వారా శక్తివంతం అవుతాయి. ఇరుకైన మార్గం మొదట్లో కష్టమని పునీత అగుస్టిను బోధిస్తాడు. ఎందుకంటే “అది అస్తవ్యస్తమైన శారీరక కోరికలను అణిచివేస్తుంది. దేవుని ప్రేమలో హృదయం విస్తరించబడిన తర్వాత, అది ఆనందంతో మధురంగానూ మరియు విశాలంగా మారుతుంది”. పునీత గ్రెగొరీ ది గ్రేట్ , “ఇరుకైన ద్వారపు త్యాగంలో వ్యక్తీకరించబడినది దేవుని ప్రేమ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే అది మన స్వంత ఇష్టా ఇష్టాలు కాకుండా ఆయన ఇష్టాన్ని మాత్రమె  ఇష్టపడాలి” అని మనకు గుర్తుచేస్తున్నాడు.

నేడు, ఈ బోధన అంతే అత్యవసరంగా ఉంది! విశాలమైన ద్వారం ప్రపంచానికి మార్గం - త్యాగం లేని ఓదార్పు, సత్యం లేని స్వేచ్ఛ మరియు బాధ్యత లేని ఆనందం. ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తక్కువగా మనలను డిమాండ్ చేస్తుంది. కానీ అది శూన్యంలో ముగుస్తుంది. ఇరుకైన ద్వారం క్రీస్తు పట్ల విశ్వాసపాత్రమైన మార్గం. అది ప్రార్థన, నిజాయితీ, క్షమాపణ, పేదల పట్ల దాతృత్వం, వివాహ జీవితంలో విశ్వాసం, ప్రజాదరణ పొందనప్పుడు కూడా సత్యాన్ని జీవించే ధైర్యం. సువార్త ద్వారా యేసు దాని పరిపూర్ణతకు ఏకైక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఇరుకైన ద్వారం దుఃఖం కాదు. క్రీస్తు ప్రేమ, అతని వాక్యం, అతని శరీరం మరియు ప్రశస్త రక్తంచే పోషించబడింది. ఇరుకైనదిగా కనిపించేది దేవుని ప్రేమ విస్తారమైన స్వేచ్ఛకు మరియు అతని రాజ్యపు శాశ్వత ఆనందానికి మార్గం. ప్రతీనాటి దీన చర్యలో ఏ ద్వారంను మనం ఎంచుకుంటున్నాము? దేవుని కృపతో, ధైర్యంతో ఇరుకైన ద్వారంను ఎంచుకుందాం. దాని ద్వారా ప్రవేశించమని మనల్నిపిలిచేవాడు నిత్యజీవానికి మనతో కూడా నడుస్తున్నాడని తెలుసుకుందాం.

కొత్త భూమిపై మన ఆశ బలహీనపడ కూడదు..." (“ఆనందానికి ఆశాకిరణం నువ్వే”/గౌదియం ఎత్  స్పెస్)

No comments:

Post a Comment