తిరస్కరణ నుండి గౌరవానికి
యెషయా 5:1-7; ఫిలిప్పీ
4:6-9; మత్తయి 21:33-43
(27 / A)
“అవివేకపు
మాటలు మనుషులను తప్పుదారి పట్టించవచ్చు, మరియు అవివేకపు మౌనం
వారిని తప్పుదారిలోనే వదిలివేయవచ్చు.” గ్రెగొరీ ది గ్రేట్
పవిత్ర సత్య తిరుసభ ఈ రోజు మనకు యేసు నేర్పిన ద్రాక్షతోట ఉపమానాన్ని అందిస్తుంది.
ఆయన యెషయా గ్రంథంలోని అందమైన ద్రాక్షతోట చిత్రణ నుండి దీనిని తీసుకుంటున్నాడు. “నా
ప్రియునికి సమృద్ధమైన కొండమీద ఒక ద్రాక్షతోట ఉండెను… అది ద్రాక్షపండ్లను
ఫలిస్తుందని అతడు ఆశించెను, కానీ
అది అడవి ద్రాక్షపండ్లను ఫలింప చేసెను ” (యెష 5:1-7). యెషయా యెహోవా ద్రాక్షతోటను ఇశ్రాయేలు
గృహంగా వివరిస్తున్నాడు. దేవుడు తన ప్రజలను నాటి, కాపాడి, ప్రేమించాడు, కానీ వారి ప్రతిస్పందన తిరస్కరణగా
మారింది. ఇక్కడే మనం తిరస్కరణ రహస్యాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రేమ, సత్యం, బాధ్యత, మరియు సృష్టి అనే బహుమతులను ఇచ్చే ఆయనను
మన మానవాళి ఎందుకు తిరస్కరిస్తుంది? సృష్టి
జీవి సృష్టికర్తను మరచిపోయినప్పుడు పాపం మొదలవుతుంది కదా!!
దేవుడు మానవుడిని తోటలో “దానిని
సాగుచేయుటకును, కాపాడుటకును”
ఉంచాడని ఆదికాండము బోధిస్తుంది (ఆది 2:15). హీబ్రూ పదం “ʿābad” (ఆబాద్) కు “సాగుచేయుట” లేదా “సేవించుట” అని అర్థం. అలాగే “šāmar” (షామర్) కు “కాపాడుట”, “రక్షించుట”, లేదా “కాపాడుట” అని అర్థం. ఈ రెండు
అర్ధాలు ఆధిపత్యం అంటే దోపిడీకి అనుమతి కాదని చూపిస్తున్నాయి. మనం నిర్వాహకులం, సంపూర్ణ యజమానులం కాదు. ఈ విషయాన్ని పునీత
అస్సిసి ఫ్రాన్సిస్ తాను రచించిన ‘క్యాంటికిల్ ఆఫ్ ది క్రీచర్స్’ (సృష్టి జీవుల
ప్రస్తుతి)లో చాలా అందంగా వ్యక్తీకరించాడు. ఆయన: “Laudato mi Signore” (“ఓ నా ప్రభూ, నీ సకల సృష్టి ద్వారా నీకు స్తుతి
కలుగుగాక”) అని ప్రస్తుతించాడు. ఆయన సూర్యుడిని “సోదరుడు”, చంద్రుడిని “సోదరి”, నీటిని “సోదరి”, మరియు అగ్నిని కూడా “సోదరుడు” అని పిలిచాడు.
ఫ్రాన్సిస్ దృష్టిలో, సృష్టి
కేవలం వినియోగించుకోవడానికి చేయబడిన ఒక భౌతిక వస్తువు కాదు. అది సృష్టికర్తను
స్తుతించడానికి ఉపయోగపడే ఒక బహుమతి. ఈ దృక్పథమే పోప్ ఫ్రాన్సిస్ రచించిన ‘Laudato
Si’కి సారాంశం అయింది.
దేవుని ముందు ప్రతి జీవికి దాని స్వంత విలువ ఉందని మరియు మానవులు సృష్టి సమగ్రతను
గౌరవించాలని ఆయన మనకు గుర్తుచేస్తాడు. అదేవిధంగా, మనం వాటి పట్ల దయతో ఉండాలని కాటెకిజం
బోధిస్తుంది (CCC 2415–2418).
ద్వితీయోపదేశకాండము “నీ సహోదరుని గాడిద
గాని, అతని
ఎద్దు గాని పడియుండుట చూచి, సహాయము
చేయకుండుట మానవద్దు” (22:4) అని బోధిస్తుంది. విశ్రాంతి
దినపు ఆచారంలో “నీ ఎద్దుయు నీ గాడిదయు విశ్రాంతి పొందునట్లు” (నిర్గ 23:12) అని జంతువులు సహితం చేర్చబడ్డాయి. కీర్తన, “యెహోవా
తన కార్యములనుబట్టి సంతోషించును గాక” (కీర్తన 104:31) అని ప్రకటిస్తోంది. మరియు జ్ఞానగ్రంథం “ఉన్నవాటిని
నీవు ప్రేమించుచున్నావు” (జ్ఞాన 11:24); “నీతిమంతుడు తన పశువు ప్రాణమును
కాపాడును” (సామె 12:10) అని మనకు
గుర్తుచేస్తున్నాయి. కాబట్టి జంతువుల
పట్ల మరియు సృష్టి పట్ల మన ప్రవర్తన దేవునితో మనకున్న సంబంధానికి వేరు కాదు.
ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని మరియు దేవునితో, మన పొరుగువారితో, మరియు భూమితో మనకున్న సంబంధాన్ని వేరు
చేయలేమని ‘లౌదాతో సి’ మనకు
గుర్తుచేస్తుంది.
నేటి సువార్తలోని విషాదం ఏమిటంటే, కౌలుదారులు, “ఈ ద్రాక్షతోట మాది” అని చెప్పుకోవడమే!! మానవాళికి కలిగే శోధన ఏమిటంటే ఈ లోకం నాది. ఈ వనరులు నావి. నేను వాటిని నా ఇష్టానుసారం వాడుకోవచ్చు
అని వాపోవడమే! కానీ కీర్తన “భూమియు దానిమీదనున్న సమస్తమును యెహోవావే” అని మనకు
చెబుతోంది (24). అందుకే నేటి సువార్త మనం నమ్మకమైన
కౌలుదారులమా లేక తిరస్కరించే కౌలుదారులమా?
మనం దేవుని బహుమతులను
కృతజ్ఞతతో స్వీకరిస్తున్నామా,
లేక బాధ్యత లేకుండా
వాటిని వినియోగిస్తున్నామా?
మనం జంతువులను కేవలం
వస్తువులుగా చూస్తున్నామా,
లేక సృష్టికర్త యొక్క
తోటి జీవులుగా చూస్తున్నామా?
మనం సృష్టిని సాగు
చేసి, కాపాడుతున్నామా, లేక దోపిడీ చేసి, నాశనం చేస్తున్నామా అని మనల్ని ప్రశ్నిస్తోంది. ద్రాక్షతోట
దేవునిది. భూమి దేవునిది. జీవం దేవుని బహుమతి. అవి మనకు కొంతకాలం పాటు
అప్పగించబడ్డాయి. మన ప్రతిస్పందన ఎన్నడూ తిరస్కారంగా కాకుండా, ఆయన సృష్టిపై మన ప్రేమతో, ఆయన సృష్టి పట్ల మన శ్రద్ధతో కూడిన
కృతజ్ఞతగా ఉండాలి.
“కాపరి
మాట్లాడేటప్పుడు వివేకంతో మౌనంగా, సూటిగా మాట్లాడాలి…” పునీత గ్రెగరీ ది
గ్రేట్
No comments:
Post a Comment