“నువ్వు
నన్ను ప్రేమిస్తున్నావా?”
అపొ 5:27-32,40b-41; ప్రక 5:11-14; యోహాను 21:1-19 (3 ఈస్టర్/ సి)
“ఆదివారం వారంలో మొదటి
రోజు కాబట్టి మేము మా సాధారణ సమావేశాన్ని జరుపుకుంటాము” (పునీత జస్టిన్)
చాలా
మంది వేద పండితులు నేటి సువార్త భాగం యోహాను సువార్తకు అదనంగా ఉందని నమ్ముతారు. ఈ
నివేదిక మరియు సువార్తలో వివరించబడిన ఇతర నివేదితల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాల
కారణంగానే, ఈ కథ
వేరే ఆధారిత మూలం నుండి వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు వేద శాస్త్రులు. సరస్సు
ఒడ్డున యేసుతో జరిగిన సమావేశం పేతురు పశ్చాత్తాపం మరియు విశ్వాస ప్రకటన కథగా
చూడవచ్చు. ఆయన పదే పదే “అవును,
ప్రభువా!”
అని చెప్పడం ప్రేమ మరియు విధేయతను ప్రకటిస్తుంది. ఇది పేతురు యేసును మూడుసార్లు
తిరస్కరించడానికి అనుగుణంగా కూడా ఉంది. యేసు మూడుసార్లు ప్రశ్నించడానికి ఒక కారణం
ఉంది. పేతురు తన ప్రభువును మూడుసార్లు తిరస్కరించాడు కదా అలాగునే ప్రభువు తన ప్రేమను ధృవీకరించడానికి అతనికి మూడుసార్లు
అవకాశం ఇచ్చాడు (యోహాను 21:15–17). యేసు తన కృపగల క్షమాపణలో, మూడుసార్లు తన ప్రేమను ప్రకటించడం ద్వారా మూడుసార్లు
తిరస్కరించిన జ్ఞాపకాన్ని కూడా తుడిచిపెట్టే అవకాశాన్ని పేతురుకు ఇచ్చాడు.
ఈ
సందర్భంలో "ప్రేమ" అనే పదం ఒక ఆసక్తికరమైన ఉపయోగంగా కన్పిస్తుంది. యేసు
"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగినప్పుడు, పేతురు "అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని సమాధానమిచ్చాడు.
ఇది మంచి అర్ధమే. కానీ గ్రీకు కొత్త నిబంధనలో, పేతురు ఇచ్చిన సమాధానం యేసు అడిగిన ప్రశ్నకు సరిగ్గా
స్పందించదు. వివిధ స్థాయిల “ఆప్యాయత”ను వ్యక్తీకరించడానికి గ్రీకులో అనేక పదాలు
ఉన్నాయి. సి.ఎస్. లూయిస్ అనే వేద శాస్త్ర్తి "ది ఫోర్ లవ్స్" అనే తన
పుస్తకంలో, వాటిని ఈ
విధంగా వర్ణించాడు: "స్టోర్గే" (అనురాగం) మొదటిది. ఉల్లాసంగా ఉండే ఒకరి పొరుగువారి
పట్ల తమకు కలిగే ప్రశాంత ఇష్టత. రెండవది “ఎరోస్". ఇది ఒక ఇంద్రియ లేదా శృంగార ప్రేమ. ఒక జంటను
ఏకం చేసే ప్రేమ. తరచుగా వివాహానికి దారితీస్తుంది ఈ ప్రేమ. ఇది కామం కాదు. మూడవది "ఫిలియా". ఇది స్నేహం. మనం నిజమైన ఆసక్తిని
పంచుకునే వ్యక్తులతో సహవాసాన్ని విశ్వసించడం. చివరగా, "అగాపే". ఇది ఉదారమైన, స్వీయకృత ప్రేమ. దీనిని మనం విలువైనదిగా భావిస్తాము. షరతు లేనిది.
పేతురుకు
ప్రేమ ఏం తెచ్చిపెట్టింది?
(ఎ) అది
అతనికి ఒక ప్రత్యేకమైన పనిని తెచ్చిపెట్టింది. “నీవు నన్ను ప్రేమిస్తే, నా మందలోని గొర్రెలను, గొర్రె పిల్లలను
మేపడానికి నీ జీవితాన్ని ఇవ్వు” (యోహాను 21: 15-17) అని యేసు అడిగాడు. ఇతరులను
ప్రేమించడం ద్వారా మాత్రమే మనం యేసును ప్రేమిస్తున్నామని నిరూపించగలం. ప్రేమ
ప్రపంచంలోనే గొప్ప ఆధిక్యత కలిగినది. కానీ అది గొప్ప బాధ్యతను తెస్తుంది. (బి) అది పేతురుకు ఒక శిలువను
తెచ్చిపెట్టింది. యేసు అతనితో ఇలా అన్నాడు: “నీవు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎక్కడికి
వెళ్లాలో నువ్వు ఎంచుకోవచ్చు. కానీ వారు నీ చేతులను
శిలువపై చాచే రోజు వస్తుంది. నీవు ఎంచుకోని మార్గంలో నిన్ను తీసుకెళ్తారు.” (21:18)
రోము నగరంలో, పేతురు
తన ప్రభువు కోసం మరణించే రోజు వచ్చింది. అతను కూడా శిలువెక్క వలిసినప్పుడు, తనను తలక్రిందులుగా
మేకులతో కొట్టమని కోరుకున్నాడు. ఎందుకంటే
తన ప్రభువు మరణించినట్లుగా తాను చనిపోవడానికి అర్హుడు కాదని అతను సాక్ష్యమిచ్చాడు.
ప్రేమలో ఎల్లప్పుడూ బాధ్యత మరియు త్యాగం ఉంటాయి. మనం క్రీస్తును ప్రేమిస్తున్నాము.
కానీ ఆయన
పనిని ఎదుర్కోవడానికి, ఆయన శిలువను తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోతే మనం
క్రీస్తును ప్రేమించలేము.
సరస్సు
వద్ద జరిగిన ఆ సమావేశంలో,
పేతురు
తాను ఇతర శిష్యుల కంటే గొప్పవాడినని భావించే గొప్ప చెప్పుకునే వ్యక్తి కాదు. కానీ తాను చెప్పగలిగిన దానికంటే ఎక్కువ చెప్పుకోని తెలివైన, వినయపూర్వకమైన హృదయం
కలిగినవాడు. పేతురు ఒప్పుకోలు ఎలాంటిదంటే, "నేను నమ్ముతున్నాను, నా అవిశ్వాసాన్ని తొలగించు!" (మార్కు 9:24) అని యేసుతో
దయ్యo పట్టిన బాలుడి తండ్రిలా చెప్పినట్లు ఉంది! అలాగునే పేతురు, "నేను నిన్ను
ప్రేమిస్తున్నాను, ప్రభువా! నా ప్రేమ లేని తనాన్ని తొలగించు" అని పరోక్షంగా చెప్పినది
కూడా అలాగునే వుంది. పునరుత్థానమైన క్రీస్తుతో పేతురు సమావేశం సత్యవంతమైన ప్రేమకు
ఒక వైపు మాత్రమే చెబుతుందని మనకు గుర్తు చేస్తుంది. వాస్తవానికి, మన ప్రేమ షరతు
కలిగినది. ప్రమాదం ఎదురైనప్పుడు మనం తరచుగా వెనక్కి తగ్గుతాము. పేతురు వలే, మనం మన వైఫల్యాలను
స్వస్థత కోసం దేవుని దరికి తీసుకురావాలి. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువా, నా ప్రేమ
లేకపోవడాన్ని తొలగించు" అని పేతురు ప్రకటించినట్లు మనం కూడా ఈరోజు ఆయనతో ప్రార్ధించ
వచ్చు. పేతురు అడుగుజాడలను అనుసరించడానికి మనం పేతురు వారసులుగా వాటికను నగరంలో ఉండవలసిన
అవసరం లేదు. కానీ మన సమాజంలో ఏ ఒక్కరూ దారితప్పకుండా ప్రతిఒక్కరిని
కాపాడుకోవచ్చు. మనలో ప్రతి ఒక్కరూ దేవుని వాక్య ఆహారంతో క్రీస్తు గొర్రె పిల్లలను
పోషించవచ్చు. నూతన పోపు గారిని ఎన్నుకోవడానికి మే నెల 7 న జరగబోయే “కాన్ క్లేవ్” లో
పాల్గొనే “కాలేజ్ ఆఫ్
కార్డినల్స్” కు సహాయమందించమని
పరిశుద్ధాత్మ దేవుని ప్రార్ధన చేద్దాం.
“సృష్టి మొత్తం
విముక్తి పొంది మహిమ మరియు స్వేచ్ఛను అనుభవిస్తుంది” (Divine Office)