AletheiAnveshana: క్రీస్తు శిలువలో నా విమోచన: సంఖ్యా 21:4b–9; ఫిలి 2:6–11; యోహాను 3:13–17 (C / Sep 14)

Saturday, 13 September 2025

క్రీస్తు శిలువలో నా విమోచన: సంఖ్యా 21:4b–9; ఫిలి 2:6–11; యోహాను 3:13–17 (C / Sep 14)

 

క్రీస్తు శిలువలో నా విమోచన

సంఖ్యా 21:4b–9; ఫిలి 2:6–11; యోహాను 3:13–17 (C / Sep 14)

నీ పవిత్ర శిలువ ద్వారా, నీవు లోకాన్ని విమోచించావు (Divine Office) 

నేడు మనం సిలువ విజయోత్సవ పండుగను జరుపుకుంటున్నాము. క్రీ. శ. 326 వ సంవత్సరములో – యేసు క్రీస్తు వారు భరించిన శిలువను పునీత హెలెనా వారు కనుగొనడంతో మాతృ శ్రీసభ దానిని పరిశీలించి నిర్ధారించిన తరువాతి నుండి విశ్వాసులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పాత నిబంధనలోని ఒక చారిత్రాత్మక సంఘటన (సంఖ్యా 21:4-9)  వృత్తాంతంను యేసయ్య శిలువలో దేవుని రక్షణ ప్రణాళిక పరిపూర్తి అయిన విధానాన్ని  సువార్తికుడు యోహాను నేటి సువార్తలో ప్రస్తావిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో  దేవునిపై తీవ్రంగా ఫిర్యాదు చేశారు. వారిని శిక్షించడానికి, దేవుడు ప్రాణాంతకమైన సర్పాల తెగులును పంపాడు. చాలా మంది మృత్యువాత పడ్డారు. ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని దయ కోసం మొరపెట్టుకున్నారు. సర్ప కాటు విరుగుడు కోసం సర్పపు ప్రతిమను తయారు చేసి దానిని ఒక గెడపై వ్రేలాడదీయాలని దేవుడు మోషేను ఆదేశించాడు. వ్రేలాడదీయబడిన సర్పాన్ని వీక్షించిన వారు సర్ప విష విరుగుడుగా స్వస్థత పొందుకున్నారు. స్వస్థత తరువాతనూ అదే ప్రక్రియ ఇశ్రాయేలీయుల జీవితంలో కొనసాగింది. హిజ్కియా రాజు కాలంలో అది ఇత్తడి సర్పపు విగ్రహంగా మారి యూదుల విచిత్ర ఆరాధనా సంస్కృతిగా మారిపోయింది!!! ప్రజలు దానినే  ఆరాధించడం వలన అది నాశనం చేయబడింది (2 రాజులు 18:4). తమ విగ్రహాలను తయారు చేసుకోవడం నిషేధించబడిందా అని యూదులు అయోమయంలో పడ్డారు!! అందువల్ల, రబ్బీలు(బోధకులు) “జీవాన్ని ఇచ్చింది సర్పము కాదు. వారిని స్వస్థపరిచింది దేవుడే. స్వస్థపరిచే శక్తి ఇత్తడి సర్పంలో లేదు. అది దేవుణ్ణి సూచించడానికి ఒక చిహ్నం మాత్రమే” అని వివరించి హెచ్చరించారు.

శిలువపై ఎత్తబడిన యేసును, గెడపై ఎత్తబడిన కంచు సర్పముగా పోల్చి చూపించడానికి సువార్తికుడైన యోహానుకు కలిగిన ఆలోచన ఏమిటి? ఏదోను తోటలో తొలి ఆదిదంపతులను మోసగించిన సర్పపు శోధనాత్మక కాటును (ఆది 3) భగవంతుడు యూదులకు జ్ఞాపకపరిచాడు. అవిధేయత వల్ల పొందుకున్న శాపం నేటి శాపానికి మూల కారణం అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేతనే బాప్తిస్మ యోహాను యోర్ధనులో బప్తిస్మము ఒసగుతూ “ఓ సర్ప సంతానమా! (మత్త 3:7-9 = 12:34; 23:33) అని యూదులను సంభోదించాడు. సైతాను శోధన యేసు రాజ్యంలో ప్రతి ఒక్కరినీ ఇంకా వెంటాడుతూనే వుంది. ఇదే నేపథ్యంలో సువార్తికుడు యోహాను ఈ పోలికను చేస్తూ యేసుక్రీస్తు నందు రక్షణ పొందు కోవడానికి తన పాఠకులను ఆహ్వానిస్తున్నాడు.

ఈ చారిత్రాత్మక సంఘటనను ఉపయోగిస్తూ విశ్వాసులు తమ ఆలోచనలను మార్చుకుని నిత్యజీవం కోసం శిలువపై ఎత్తబడిన యేసు వైపు చూస్తూ విశ్వసించి చావు నుండి రక్షణ పొందుకోవాలి. గ్రీకు క్రియా పదం "హుప్సౌన్" అంటే ఆంగ్లంలో “లిఫ్ట్ అప్” – తెలుగునందు "పైకి ఎత్తడం" అని అర్థం. ఈ పద ప్రయోగమును యేసు ఎడల రెండు అర్థాలను చూపిస్తున్నాడు సువార్తికుడు. మొదటిగా,  సిలువపై “ఎత్త బడటం” (యోహా 8:28; 12:32). రెండవది, స్వర్గపు మహిమలోకి “ఎత్త బడటం” (అపొ 2:33; 5:31; ఫిలి 2:9). ఈ రెండు సంఘటనలు  విడదీయరాని అనుసంధానంగా ఉన్నాయి. శిలువ లేకుండా మహిమ అనేది అనివార్యం. శ్రమ వల్లనే విజయ ప్రాప్తి. "ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడు(యోహా 3:15, 16) అనే ఒక పదబంధం మనకు సువిశేషంలో కన్పిస్తుంది కదా! దీని అర్థం కనీసం మూడు విషయాలను తెలియ చేస్తుంది. అవి మొదటగా, దేవుడు తను సృష్టించిన మానవులందరినీ సరి సమానంగా ప్రేమిస్తున్నాడు మరియు క్షమిస్తున్నాడు. రెండవది, ఆయన తన ఏకైక కుమారుడైన యేసును తన మరణ పునరుత్థానాల ద్వారా మానవులకు నిత్యజీవం ఇవ్వడానికి పంపాడు. మూడవదిగా, యేసు చెప్పేది నిజం కాబట్టి మానవులందరూ దానిని నమ్మాలి.

అలాగునే సువిశేషంలోని “నిత్యజీవము” (యోహా 3:16) అనే పదబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం నిత్యజీవంలోకి ప్రవేశిస్తే, అది మనకు ఏమి ఇస్తుంది? ఈ నిత్య జీవము మనకు దేవునితో శాంతిని ఇస్తుంది. తోటి మనుషులతో మనకు శాంతిని ఇస్తుంది. దేవుడు  సృష్టించిన మనుషులందరినీ తాను చూసే విధంగా చూడటానికి ఇది మనకు కనువిప్పు కల్పిస్తుంది. మన జీవితంలో శాంతిని ఇస్తుంది. ఇలా మన మంచి కోసం పరమోన్నతుడు అన్ని విషయాలను క్రోడికరించి మనకు అందిస్తున్నాడు. మనం మన జీవితాన్ని తగినంత విధంగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఎన్నటికీ దానిపై మనం ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఆ “నిత్య జీవ(ము)” కృపను మాత్రం కలిగి ఉంటామన్నది తథ్యం. ఇది మనతో మనకు శాంతిని కలిగిస్తుంది. మరేదైనప్పటికీ – మనమంటే మనమే, మనకు మనమే ఎక్కువగా భయపడిపోతూoటాము ఒక్కొక్కసారి. మన బలా బలాలు, బల బలహీనతలు మనకు తెలుసు. మనకు కలిగే శోధనలు, పరాపజయలు, పరాభావాలు మరియు మన జీవితాల డిమాండ్ల బలం మనకు తెలుసు. కానీ  దేవుని కృపతో ఎల్లప్పుడూ మనం వాటినన్నింటినీ ఎదుర్కొనగలమని మనకు తెలుసు. మనలో జీవించేది మనం కాదు కదా! మనలో నివసించేది క్రీస్తు. క్రీస్తుపై ఆధారపడిన శాంతి మనలో ఉంది. అదే మనలను విజయవంతులను చేస్తుంది.

భూమిపై అందింపబడే కేవల లోక విధాన శాంతి ఖచ్చితంగా రాబోయే అంతిమ శాంతి కాంతులకు ఒక నీడలాంటిది మాత్రమె. అటువంటిది మనకు ఆశను మరియు దాని వైపు ప్రయాణించడానికి ఒక లక్ష్యాన్ని చూపిస్తుందని మర్చిపోకూడదు. అది ఈ లోకంలో అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది. అదే సమయంలో, ఇంకా ఉత్తమమైన రాబోయే జీవితాన్ని అందిస్తుంది. శిలువ విజయం యేసుక్రీస్తు విజయం. మరణంపై విజయం. శిలువ తత్వ లోతైన అర్థం యేసు "కెనోసిస్"లో ప్రదర్శించబడింది. గ్రీకు పదం “కెనోసిస్” అంటే  తనను తాను ఖాళీ చేసుకోవడం అని అర్ధం. సువార్తలో ఉపయోగించబడిన "ఆయనను విశ్వసించేవాడు ప్రతివాడును” (3:16) అనే పదబంధంలోని "ప్రతివాడును" అనే పదం దైవిక కరుణలో, ఎటువంటి పరిమితి లేదా పరిస్థితి లేదని దైవిక జ్ఞానం సూచిస్తున్నట్లు అర్థం ఇస్తుంది. ఇది నీచమైన వాటిని మినహాయించగలదు. తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ దారితప్పిన వారిని వెతకడంలో ఆనందిస్తాడు. అతను వారిని తన కౌగలిత  చేతులతో ఇంటికి స్వాగతిస్తున్నాడు. ప్రతి పశ్చాత్తాపపడిన విశ్వాసి శిలువపై ఉన్న యేసు వైపు చూడటం ద్వారా సాటిలేని మోక్ష బహుమతిని పొందుతాడు. మహిమా కిరీటం పొందుకున్న వ్యకులమాత మధ్యస్థ ప్రార్ధనా సహాయత మనకు ఎల్లప్పుడూ అందుకు తోడుగా వుంటుంది. తథాస్తు.

"మీ ద్వారా ప్రపంచం ప్రభువు రక్తం ద్వారా విమోచించబడింది" (Divine Office)

No comments:

Post a Comment