లాజరులో
క్రీస్తు శరీరాన్ని గౌరవించుదాం
ఆమో 6:1,4-71;
1 తిమో 6:11-16; లూకా 16:19-31 (26 /C)
“నా నామమున మీకు నీళ్లు త్రాగనిచ్చువాడు తన ప్రతిఫలమును కోల్పోడు అని ప్రభువు చెప్పుచున్నాడు” (DO)
లూకా
సువార్తను తరచుగా పేదల సువార్తగా సూచిస్తారు వేద శాస్త్రులు. కారణం, ఈ సువార్త
పేదల పట్ల దేవునికి ఉన్న కనికర ప్రేమ ప్రాధాన్యతను సుస్థిరంగా ప్రతిబింబింప
చేస్తుంది (లూకా 4:18;
6:20) కాబట్టే! దీని ప్రకారంగా, సువార్తనంతట పేదలు మరియు అణగారిన వారి బాధనే ప్రతిబింబిoప చేస్తాడు లూకా. నేటి సువార్తలోని “లాజరు” అనే పేరు హీబ్రూ
పేరు ఎలీయెజరు నుండి తీసుకోబడింది. లాజరు అంటే “దేవుడు
నా సహాయం” లేదా “దేవుడు సహాయం చేస్తాడు” అని అర్థం. ఊర కుక్కల మధ్య రసి కారే పుండ్లతో
దేహి అని అరచే లాజరు అనే బిచ్చగాడి పాత్ర, పరలోకంలో అబ్రాహాము
వక్ష: స్థలంలో కూర్చోనడం చూపిస్తే, మరోప్రక్క నరకంలో హింసల
పాలవుతున్న ధనవంతుడిని చూపిస్తున్నాడు లూకా. ఎందుకు అలా జరిగింది? లాజరును తన ఇంటి ద్వారం
చెంత నుండి గెంటి వేసే క్రూరుడైన ధనవంతుడిగా చూపించడు లూకా సువార్తికుడు. తన పంచ
పక్ష భోజన బల్ల నుండి జారిపడిన రొట్టె ముక్కలను అందుకొన సాహసించే లాజరును అతను గెంటి
వేయనూ లేదు. అందునా అతను ఉద్దేశపూర్వకంగా అతనిపై ఎలాంటి క్రూరాత్వాన్ని చూపించనూ
లేదు. మరి ఆ ధనవంతుడు చేసిన పాపం ఏమిటి?
మానవ
శాస్త్ర (Anthropological) దృక్కోణం
నుండి, ఈ ఉపమానం
ప్రతి మానవుడు దుర్బలుడు,
పరిమితుడు
మరియు మరణానికి సిద్దుడు అని మనకు గుర్తు చేస్తుంది. “జాతస్య మరణం దృవం” అని జ్ఞాపకం
చేస్తుంది. లాజరు పాత్ర – ధనిక ద్వారం
వద్ద పడిపోయిన, నయంకాని వైరస్ జబ్బులతో నిండిపోయిన, లోకంచే నిర్లక్ష్యం చేయబడిన పేదలు, అణగారిన వారి బాధలను,
బలహీనులను, ఆకలితో మల మలలాడే, చివరకు విస్మరించబడిన
వారిని సూచిస్తూ దేవుని బిడ్డలుగా వారి గౌరవ ప్రతిష్టలను నిలుపుతుంది. ధనవంతుని
పాత్ర తనతోటి మానవ సంబంధ స్వభావాన్ని (nature of human
relation) మరచిపోయి, స్వయం సమృద్ధిలో తనను తాను మూసుకుపోయే హీన స్వభావాన్ని
సూచిస్తుంది. వాటికను రెండవ మహాసభ అందించిన
“ఆధునిక కాలంలో తిరుసభ పరిచర్య నిబంధనా నిర్మాణo: ఆనందం మరియు ఆశ” (Gaudium et Spes) అనే
సిద్ధాంత బోధనలో "మనిషి... తనను తాను నిజాయితీగా ఇచ్చుకున్న బహుమతి
ద్వారా తప్ప తనను తాను పూర్తిగా కనుగొనలేడు" (GS 24) అని మనకు గుర్తు చేస్తుంది.
ధనవంతుని విషాదం ఏమిటంటే,
అతను సంపదను
కలిగి ఉండటం కాదు, కానీ
అతను తన ద్వారం వద్ద వ్రణములతో పడి ఉన్న తన తోటి మానవ సోదరుని వైపు కనీస కంటి చూపు లేకపోవడం. ధనవంతులుగా వుండడం అనేది
ఎన్నడు ఖండించబడలేదు పరిశుద్ధ గ్రంథంలో. కానీ అతని ఇంటి
ముంగిట వారి బాధలను గ్రహించకుండా అంధుడిగానూ మూగ వానిగా తన కష్టాలలో తనను
వదిలివేసి తన కాళ్ళ మీద తనను తాను నిలబడడానికి సహాయం చేయడంలో తాను విఫలవ్వడంలోనే ఖండించబడ్డాడు.
అటువంటి వారికి మోషే, ఆమోసు లాంటి ప్రవక్తలు మరియు దయాకనికర, న్యాయ స్పందన కోసం పిలుపునిచ్చే
దేవుని వాక్యం అందించబడింది. కానీ వారు పెడచెవిన పెడుతున్నారు. కాబట్టి, తన వారు ఒకరు మృతులలో నుండి లేచి వచ్చి బోధించినా, వారు నమ్మరు. అందుకే దైవ
స్వరాన్ని ఆలకించే మారు మనస్సుకు సమయం ఇప్పుడే, రేపు కాదని ఈ ఉపమానం మనకు ఒక హెచ్చరిక చేస్తుంది.
ఈ ఉపమానం
ఒక సుస్థిరమైన సందేశాన్ని ప్రతిధ్వనిస్తుంది. దేవుడు పేదలను ఉద్ధరిస్తాడు మరియు
గర్విష్ఠులను పడగొడతాడు (లూకా 1: కీర్తన 113: 7). రెండవ వాటికను మహాసభ “దేవుని
వాక్య సమృద్ధి దాని అధికారం” గురించి ప్రతి ఘటిస్తుంది. “దేవుని వాక్యం” (Dei Verbum) అనే తన అధికార పత్రంలో, "మన రక్షణ
కోసం" ఈ వుల్లెఖనం ఇవ్వబడిందని మనకు చెప్పబడింది (DV 11). అయినప్పటికీ
ధనవంతులు తమ హృదయాలను కఠినతరం చేసుకుంటున్నారు. మహత్కార్య సంకేతాల కోసం వేచి
ఉండకూడదని, ప్రతి
ఆదివారం మనం వినే వాక్యం ఇప్పుడే ఇక్కడే మన మనస్సు మార్పు చెందనివ్వాలని మనకు
హెచ్చరిక చేస్తుంది. తిరుసభ సామాజిక బోధనా (Social
Teachings of the Church) దృక్కోణం నుండి, ఈ ఉపమానం మరింత అత్యవసరతను సంతరించుకుంటుంది. “ఆనందం మరియు ఆశ” (Gaudium
et Spes) సిద్ధాంత బోధనలో, "ఈ యుగపు మనుషుల
ఆనందాశలు, దుఃఖాలు,
ఆందోళనలు, ముఖ్యంగా
ఎలాంటి బాధలకైనా గురి అయ్యే పేదల బాధసాధాకాలన్నీ క్రీస్తును అనుసరించే శిష్యులవే! అని
బోధిస్తుంది (G.S 1). పుడమిన దేవునిచే సృష్టింపబడిన సమస్త సహజ వనర సంపద అందరికీ సరి సమాన ఉపయోగార్ధంగా
వర్తింప ఉద్దేశించబడినదని ఈ కౌన్సిలు నొక్కి చెబుతుంది (G.S
69). కాబట్టి ఒకరికి
కలిగిన సంపద అనేది తన గృహనిర్వాహకత్వపు బాధ్యతే గానీ, అది ఒక ప్రైవేట్ కోట
కాకపోవచ్చు. లాజరును విస్మరించడం అంటే లాజరులోని క్రీస్తును విస్మరించడమే కదా! అటువంటి
లాజరును గౌరవించడం అంటే తనను తాను తన కాళ్ళ మీద నిలబడి తన జీవనోపాదిని సుస్థిరం
చేసుకోవడానికి ఉత కర్రను అందించాలే కానీ తన జీవితాంతం పరాన్నజీవిగా మార్చి బిచ్చగానిగా
మార్చడం కాదు.
పునీత
జాన్ క్రిసోస్టమ్, “మీరు క్రీస్తు శరీరాన్ని గౌరవించాలనుకుంటున్నారా? ఆయన నగ్నంగా
ఉన్నప్పుడు ఆయనను నిర్లక్ష్యం చేయవద్దు. బయట చలిలో నగ్నత్వంతో బాధపడుతున్నప్పుడు తనను
నిర్లక్ష్యం చేస్తూ, ఇక్కడ
చర్చిలో పట్టు వస్త్రాలతో ఆయనను గౌరవించవద్దు” అని హెచ్చరించాడు. ఈ హెచ్చరిక పేదలను
మేల్కొల్పి సహాయం అందించే దాతలుగా జాగురుత పరుస్తుందే కానీ నిత్యం చేయి చాచే
వాళ్ళుగా మలచదు. “విశ్వ జనుల కాంతి” (Lumen Gentium) అనే తిరుసభ
సిద్ధాంత ప్రకటనలో - ‘తిరుసభ దేవునితో ఐక్యత’ అనేది ఒక దివ్య సంస్కారమనీ, అలాగునే ‘సమస్త
మానవ జాతి ఐక్యత’ కూడా ఒక దివ్య సంస్కారమనీ మనకు గుర్తు చేస్తుంది (LG 1). తిరుసభ “తాను నిజంగా
మానవాళితోనూ మరియు దాని చరిత్రతో లోతైన బంధాలలో/ ద్వారా ముడిపడి ఉందని మనకు గుర్తు
చేస్తుంది” (GS 1). మనం
నిజంగా క్రీస్తులో ఒకే శరీరం అయితే, లాజరు మన శరీరమే లేదా సోదరుడు. అతని బాధ
మన బాధ్యత. ఈ ఉపమానం మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి ఇవ్వబడింది. శాశ్వతత్వంలో ధనవంతుడిని మరియు లాజరును వేరు
చేసిన గొప్ప అగాధం చరిత్ర జీవితంలో ఇప్పటికే ఉదాసీనత, అంధత్వం, నిర్లక్ష్యం మరియు
హృదయ కాఠిన్యం ద్వారా తవ్వబడింది. కానీ నేటి సువార్త మనకు ఆశను అందిస్తుంది. నేడు, ఆ
అగాధాన్ని మన
జీవితంలో, విద్యా చైతన్యం, దాతృత్వం, సంఘీభావం మరియు మారు
మనస్సు ద్వారా దాటవచ్చు. క్రీస్తులో అనేకమంది లాజరులను స్వీకరించడానికి ఆయనే స్వయంగా తన శాశ్వత విందుకు
మనలను స్వాగతిస్తూ, ఆ విందు కొరకు సిద్ధం కావడానికి మనకు కృపను ఇస్తాడు.
“ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికి
మీరు ఏమి చేసితిరో, అది నాకు
చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” (మత్త 25:45)
No comments:
Post a Comment