రక్షణ విశ్వాసమునకు ప్రతిఫలము కాదు
అది ఒక కృప
యెష 55:6-9; ఫిలి 1:20-24,27; మత్త 20:1-16
“మీ చింతలను
ప్రభువునకు అప్పగించుడి, ఆయన మిమ్మును ఆదుకొనును”
నేటి సువార్త రక్షణ మర్మమును గూర్చి
ధ్యానించమని మనలను ఆహ్వానిస్తుంది. సి. జి. మాంటిఫియోర్ ఈ ఉపమానాన్ని “అన్నిటికంటే
గొప్పదైన మరియు అత్యంత మహిమాన్వితమైన ఉపమానాలలో ఒకటి” అని పిలిచాడు. ఎందుకంటే ఇది మన క్రైస్తవ విశ్వాసపు
హృదయాన్ని తాకుతుంది. మనం విశ్వసించినందువల్ల, ప్రార్థించినందువల్ల, పనిచేసినందువల్ల, లేదా మతపరమైన విధులను
నిర్వర్తించినందువల్ల రక్షణ అనేది మనం డిమాండ్ చేయగల ప్రతిఫలం కాదు. విశ్వాసం
అవశ్యకమే, కానీ రక్షణ దేవుని కృపాపూర్వక
బహుమానంగానే మిగిలిపోతుంది. మనం “విశ్వాసము ద్వారా కృపచేత” రక్షింపబడ్డామని, మరియు ఇది “దేవుని బహుమానము” అని
పరిశుద్ధ పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు (ఎఫె 2:8-9). విశ్వాసం
మన హృదయాలను కృపకు తెరుస్తుంది.
అది దేవుణ్ణి మనకు
రుణపడి ఉండేలా చేయదు. దేవునికి మన ప్రతిస్పందన కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన కృప మన ప్రతి స్పందనకు
ముందే వస్తుంది కాబట్టి.
యేసు, “మీరు
రోజంతా ఇక్కడ పనిలేకుండా ఎందుకు నిలబడి ఉన్నారు?” (మత్త
20:3, 6) అని అడుగుతున్నాడు. సంతలో, ఈ పనివారు దేవుని సేవలోకి పిలువబడటానికి
ఎదురుచూస్తున్న ఆత్మలకు ప్రతీకగా ఉన్నారు. నాయకుడు యెహోషువ, “ఈ రోజు మీరు ఎవరిని సేవిస్తారో
ఎంచుకోండి” (యెహో 24:15)
అని వలస యూదులను ఉద్దేశించి అన్నాడు. మనం
దేవుని పిలుపుకు స్పందించే వరకు,
మనం ఆధ్యాత్మికంగా
నిష్క్రియులుగా ఉండగలము. సంత అనేది శబ్దం,
వ్యాపారం, పోటీ, వినోదం
మరియు పరధ్యానంతో నిండిన ప్రపంచానికి కూడా ప్రతీకగా ఉంది కదా!! దాని మధ్యలో, జ్ఞానం కేక వేస్తుంది (సామె 1:20-21), మరియు సువార్త మనలను వ్యర్థత మరియు
పరధ్యానం నుండి అర్థవంతమైన సేవా జీవితానికి పిలుస్తుంది.
కూలి వారు ఒక రోజు కోసం నియమించబడతారు. మనం
కులివారము. మన భూలోక జీవితం ఆ ఒక్క రోజే! దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి
చేయడానికి మనకు పరిమిత సమయాన్నె ఇచ్చాడు. అందువల్ల, కష్టాల
మధ్యలోనూ మనం శ్రద్ధ, ఓర్పు మరియు విశ్వాసపాత్రతను కలిగి
ఉండాలని పిలువబడ్డాము. పని ఒక రోజుకే,
కానీ ప్రతిఫలం
శాశ్వతమైనది సుమా!! యజమాని వేర్వేరు సమయాల్లో పనివారిని నియమించుకుంటాడు. రక్షణ
చరిత్రలోని వివిధ దశలలో మరియు జీవితంలోని వివిధ సమయాలలో దేవుడు ప్రజలను
పిలుస్తాడని ఈ ఉపమానం మనకు గుర్తు చేస్తుంది. న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు, అపొస్తలులు మరియు సంఘం ఆయన ద్రాక్షతోటలో
పని చేయడానికి, యూదులకు మరియు అన్యజనులకు సరి సమానంగా
ఆయన పిలుపున అందించడానికి వీరు పంపబడ్డారు. ఈ పనికి కేంద్రబిందువు దేవుని ఏకైక
కుమారుడైన యేసు క్రీస్తు.
ఆయన తన బలియాగ మరణం
మరియు పునరుత్థానం ద్వారా మన రక్షణను నెరవేర్చాడు.
ఈ ఉపమానంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చివరి నిమిషంలో వచ్చినవారు సహితం, ఉదయం నుండి పనిచేసిన వారితో సమానమైన
దేనార్లను పొందారు. దీని అర్థం వారి శ్రమ సమానమైనదని కాదు. మనం దేవునికి ఎంతకాలం (నాణ్యమైన)
సేవ చేశామనే దానిని బట్టి రక్షణ కొలవబడదని దీని అర్థం. చివరి క్షణంలో కూడా
క్రీస్తు వైపు హృదయపూర్వకంగా తిరిగే వ్యక్తి దేవుని సంపూర్ణ రక్షణ కృపను పొందగలడు.
మొదటి పనివారు, “నీవు వారిని మాతో సమానులుగా చేశావు” అని
ఫిర్యాదు చేశారు (మత్త 20:12).
కానీ యజమాని, “నేను మీకు ఎటువంటి అన్యాయం చేయడం లేదు”
అని జవాబిస్తాడు (మత్త 20:13).
దేవుడు ఎవరికీ ఎన్నడు
అన్యాయం చేయలేడు. ఆయన మనకు ఇవ్వని కృపను వేరొక వ్యక్తికి ఇస్తే, ఆ వ్యక్తి పట్ల ఆయన చూపిన ఉదారత మన పట్ల
అన్యాయం కానే కాదు. కాకూడదు! మనం వేరొకరి
కృపను చూసి అసూయపడకూడదు.
అదే సమయంలో, మనం పొందుకున్న కృప మన జీవితాలను అజాగ్రత్తగా మార్చదు.
దేవుని కృప మనలను నీతి వైపు పిలుస్తుంది. మనమందరం క్రీస్తు ఎదుట హాజరై, మనం చేసినదాని ప్రకారం ప్రతిఫలం
పొందుతామని పరిశుద్ధ పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు (2 కొరింథీ 5:10). కాబట్టి మన విశ్వాసం నీతివంతమైన
జీవితంలో ఫలించాలి. రక్షణ అనేది కృప,
జీతం కాదు. విశ్వాసం ఆ కృపను పొందుతుంది. మరియు నీతి దాని ఫలాన్ని
వెల్లడిస్తుంది. “క్రీస్తు కొరకు నేను ఎక్కువ శ్రమ చేశాను కాబట్టి దేవుడు నాకు
రక్షణ ఇవ్వాలి” అని మనం అనలేము. మన విశ్వాసం మరియు సేవ చేయగల మన సామర్థ్యంతో సహా
మనకున్న ప్రతిదీ ఇప్పటికే ఒక బహుమానమే. కాబట్టి
మనం దేవుని ద్రాక్షతోటలో నమ్మకంగా పనిచేద్దాం. మనం పొందిన కృపకు కృతజ్ఞతతో ఉందాం. మరియు చివరి గడియలోనూ దేవుడు అదే కృపను
ఇతరులకు అందించినప్పుడు ఆనందిద్దాం.
“ఓ
దేవా! నీ శక్తిని చూడటానికి నేను వేకువజామున
మెళకువగా ఉంటాను.
హల్లెలూయా”.
No comments:
Post a Comment