అమ్మా! నీ శరీరం
పవిత్రం మహిమాన్వితం
1 దినవృత్తా 15:3-4,15-16,16:1-2; 1 కొరింథీ 15:54-57; లూకా 11:27-28 (C)
“ఓ కన్య రాణి, లెమ్ము! నీవు నిత్య
గౌరవానికి అర్హురాలవు. శాశ్వత రాజు అద్భుత రాజభవనంలోకి ప్రవేశించు.” (Divine Office)
దేవుని తల్లి ఆరోహణ పండుగ రోజున తిరుసభ
పితృ పాదులు తమ ప్రసంగాలలోనూ, వేద పండితులు తమ గ్రంథాలలో ఆమె ఆరోహణను
గురించి వ్రాస్తూ గ్రంథ రచన కన్నా ముందే ఆదిమ సంఘ విశ్వాసులు అప్పటికే మరియ మాత ఆత్మ
శరీరములతో పరలోక ఆరోహణ చేసినట్లు విశ్వసించారని
తెలియజేస్తున్నారు. వారు చేసినదంతా ఒక్కటే, అది అదే విశ్వాసాన్ని సకల జనులకు వెల్లడి చేసి దాని అంతర్య అర్థం మరియు
సారాంశాన్ని సులువైన పదాలలో వివరించడం మాత్రమె చేస్తున్నామని వివరించారు.
అన్నింటికంటే మించి, ఈనాటి వేడుక పవిత్ర కన్య మరియ
శారీరక క్షీణతను అనుభవించలేదనే వాస్తవాన్ని మాత్రమే కాకుండా, ఆమె ఏకైక
కుమారుడైన యేసుక్రీస్తు మాతృకను అనుసరించి మరణం మరియు ఆమె స్వర్గపు మహిమపై
సాధించిన విజయాన్ని కూడా గుర్తుచేస్తుందని వారు చాలా స్పష్టంగా చెప్పారు.
పునీత జాన్ డమస్సీను అనే
పితృపాదులు ఆమె పొందుకున్న అధికారాలను ఈ విధంగా హెచ్చించాడు: “ పవిత్ర నిష్కళంక
ప్రసవ ప్రక్రియ ద్వారా తన కన్యత్వాన్ని భంగ పరచకుండా ఎలా భద్రపరచబడినదో మృత్యువుచేత
ఆమె శరీరాన్ని కుళ్ళిపోకుండా అదేవిధంగా భద్రపరచబడినది అని విశ్వసించడం సరైనదే. తన
సృష్టికర్తకు పసితనంలో తన రొమ్ము వద్ద స్థానం ఇచ్చిన ఆమెకు అదే సృష్టికర్త తన
నివాస స్థలంలో ప్రముఖ స్థానం ఇవ్వడం అనేది సరైనదే. పరలోకతండ్రి ఏర్పాటు చేసిన స్వర్గపు కళ్యాణ గదిలో ఈ వధువు నివసించడం సరైనదే. జనన సమయంలో
దాటిపోయిన బాకు శిలువపై తన కుమారుడిని చూసిన క్షణంలో తన హృదయంలోకి దూసుకు పోయిన ఆ దుఃఖ
బాకుతో, ఇప్పుడు అతని తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువును చూడటం ఆమెకు సరైనదే
కదా! దేవుని తల్లి తన కుమారునికి చెందిన సమస్తమును తాను కలిగి ఉండటం అనేది మరియు
దేవుని తల్లిగానూ సేవకురాలిగానూ ప్రతి సృష్టి జీవిచే గౌరవించబడటం సరైనదే.
కాన్స్టాంటినోపుల్‌కు చెందిన పునీత జర్మనసు, “దేవునకు జన్మ నిచ్చిన తల్లి శరీరం
కుళ్ళిపోకుండా కాపాడాలని భావించాడు దేవుడు. ఎందుకంటే ఆమె దేవుని నివాస స్థలం
అయింది కాబట్టి. ఇది నాశనం కాని ఒక మహిమాన్వితమైన జీవితంగా మారింది. మచ్చలేని సజీవిగా పరిపూర్ణ
జీవితాన్ని పంచుకుంది” అని విశ్వసించాడు.
నూతన ఆదాముకు (రోమి 5:12-21) నూతన హవ్వగా కన్య మరియను
గుర్తుంచుకోవడం ముఖ్యం. అలాగని ఆమె ప్రభువుకు సమానం కాదు. కానీ మృత్యు
శత్రువుపై సాధించిన యుద్ధంలో అతనికి సహకారాన్ని అందించింది. ఎదోను
తోటలో వాగ్దానం చేయబడిన పాపానికి శాపం మరియు మృత్యువుపై సాధించిన విజయంతో ముగిసింది
(ఆది 3:
14-19). ఈ విజయానికి చివరి బహుమతికి క్రీస్తు మహిమాన్విత
పునరుత్థానం అతి ప్రాముఖ్యమైనది. కానీ ఆ పోరాటంలో ధన్య కన్యమరియ
భాగస్వామ్య సహకార ప్రక్రియ తన భూ మర్త్యశరీరాన్ని మహిమపరచడంలో
ముగుస్తుంది. అపొస్తలుడు పౌలు చెప్పినట్లుగా: ఈ మర్త్య
స్వభావం అమరత్వాన్ని ధరించినప్పుడు, మరణం విజయంలో
మ్రింగివేయబడింది" (1 కొరింథీ 15) అని చెప్పిన
లేఖనంలో మనకు చక్కగా ఈ ఆంతర్యం అర్ధమవుతుంది.
తండ్రి దేవుని రక్షణ ప్రణాళికలో కుమార
వాక్కు దేవుడు యేసుక్రీస్తుకు గొప్ప తల్లిగా, తన శాశ్వతత్వంనందు
అగోచారంగా ఐక్యమై, నిష్కళంకంగా గర్భం దాల్చింది. రక్షణ
చరిత్రలో క్రీస్తు సహచరురాలిగా, పాపాన్ని మరియు దాని పరిణామాలను ఆమె ఓడించింది.
మరణంపై తన కుమారుడు విజయం సాధించడంలో అవినీతి సమాధి నుండి రక్షించబడే తుది కిరీట
అధికారాన్ని పొందింది. ఆ విధంగా ఆమె తన ఆత్మశరీరాలతో స్వర్గపు అత్యున్నత మహిమకు దేవునిచే
కొనిపోబడింది. అదే అమర రాజు తన కుమారుని కుడి ప్రక్కన, యుగ యుగాల
రాణిగా ప్రకాశిస్తుంది.
"ప్రభువు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె
పుట్టకముందే అతను ఆమెను ఎన్నుకున్నాడు. అతను తన సొంత నివాస స్థలంలో నివసించడానికి ఆమెను
తీసుకొని వెళ్ళాడు" (Divine Office).