నమ్మదగిన
వాగ్దానాలకు పిలుపు
యెషయా 7:10-14; రోమా
1:1-7; మత్తయి 1:18-24
“గ్రహించలేనిది అర్థంకాని విధంగా పరిపూర్తి
అయింది” పునీత ఆంబ్రోసు
అనిశ్చితి లేదా ప్రతికూలతను ఎదుర్కొoటున్న సమయాలలో మనం దేవుని వాగ్దానాలను గ్రహించి
నమ్మగలమా? నిస్సహాయ పరిస్థితిలో ప్రవక్త యెషయా ఆశాదాయక
ప్రవచనాలను అందిస్తున్నాడు. రాజు ఆహాజు (క్రీ.పూ.735) తనను
మరియు తన ప్రజలను నాశనం చేయ బెదిరించే శక్తులు చుట్టుముట్టినప్పుడు... దావీదు మరియు అతని వారసులకు తాను చేసిన
వాగ్దానపు భరోసాను దేవుడు ఒక సంకేత రూపంలో ఇచ్చి నట్లు గుర్తు తెచ్చుకున్నాడు .
అయితే, ఆహాజు రాజు దేవునిపై ఆశను కోల్పోయినప్పటికీ
అనుగ్రహ సంకేతాన్ని అడగడానికి మాత్రం నిరాకరించాడు. అయినప్పటికీ, దేవుడు వారికి శాంతి మరియు నీతితో
పరిపాలించే రక్షకుడిని నిజంగా ఇస్తానని హామీ ఇచ్చే ఒక సంకేతాన్ని ఇచ్చాడు (యెష 7:11..). ప్రవక్త యెషయా వలె, మనం కూడా తన వాగ్దానాలలో ఆశకు
వ్యతిరేకంగా (రోమా 4:18)
విశ్వసించాలని పులువ బడినాము.
దేవుని ఎడల తనకు వున్న విశ్వాసం నిమిత్తం మరియ తల్లి ఒక పెద్ద
సవాలునే ఎదుర్కొంది. ఆమెను ఒక బృహత్తరమైన బాధ్యతను స్వీకరించమని అడిగాడు దేవుడు.
సహజ తండ్రి లేకుండా బిడ్డ పుట్టవచ్చని ఇంతకు ముందు ఎప్పుడూ యూదు చరిత్రన వినబడలేదు!!
ప్రకృతి నియమాలకు ఈ అద్భుతమైన మినహాయింపును అంగీకరించమని, ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచమని మరియను కోరుకున్నాడు
దేవుడు. ఆమెను ఈ గొప్ప సాహసం చేయమని అడిగాడు దేవుడు. యోసేపు మరియు ఆమె స్వంత ప్రజలందరూ ఈ విషయమై ఆమెను
తిరస్కరించి ఉండేవారే. దేవుని నుండి ప్రత్యక్షత లేకుండా యోసేపు మరియు ఆమె కుటుంబం
అర్థం చేసుకోలేరని మరియకు తెలుసు. అయినప్పటికీ ఆమె దేవుని వాగ్దానాలను నమ్మింది
మరియు విశ్వసించింది.
దైవభక్తిగల యోసేపు,
తన భార్య మరియ
గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఆమెను శిక్షించడానికి ఇష్టపడలేదు. యోసేపు
నిస్సందేహంగా ఈ బాధ కలిగించే విషయాన్ని ప్రార్థనలో దేవునికి తెలియజేశాడు. తీర్పు
చెప్పడానికి లేదా బాధతో మరియు కోపంతో స్పందించడానికి అతను తొందరపడలేదు. దేవుడు
అతనికి మార్గదర్శకత్వం మరియు ఓదార్పుతో మాత్రమే కాకుండా, అతను నిజంగానే మరియ భర్త అని పిలిచాడనీ,
మరియు దేవునిపై అత్యంత నమ్మకం అవసరమయ్యే
ఒక లక్ష్యాన్ని చేపట్టాడని దైవిక హామీతో
ప్రతిఫలమిచ్చాడు. మరియను తన భార్యగా స్వీకరించి ఆమె గర్భంలో ఉన్న బిడ్డను
వాగ్దత్త మెస్సీయగా అంగీకరించాలనే దైవిక సందేశాన్ని యోసేపు నమ్మాడు.
మరియవలే,
యోసేపు కూడా మనకు
విశ్వాసానికి ఒక నమూనా. ఆయన దేవుని విమోచన ప్రణాళికకు నమ్మకమైన సాక్షి మరియు
సేవకుడు. గందరగోళ పరిస్థితులు మరియు అధిగమించలేని సమస్యలు ఎదురైనప్పుడు, దేవుని వాగ్దానాలను నమ్మడానికి మనం
సిద్ధంగా ఉన్నామా? దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ తన ఏకైక కుమారుడు, మన ప్రభువు మరియు రక్షకుడు అయిన
యేసుక్రీస్తును మన ముందు ప్రత్యక్ష పరిచాడు. మనం క్రిస్టమసు మరియు సాక్షాత్కార
పండుగలను ఆనందకరమైన హృదయంతో జరుపుకుందాం. దేవుని ఎడల, ఆయన విమోచన పనిలో మన
విశ్వాసాన్ని మరియు దానిలోని ఆశను పునరుద్ధరించుకుందాం.
“ఈ స్థితికి చేరుకోగలిగిన ఆత్మ ప్రభువు
గొప్పతనాన్ని ప్రకటిస్తుంది” పునీత ఆంబ్రోసు
No comments:
Post a Comment