కష్టమైనను ఉత్తమమైనదానిని సంపాదించు
ప్రసంగి 1:2; 2:21-23; కొలొ 3:1-5,9-11; లూకా 12:13-21 (18/ C)
మనం... సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన వాటిని పూజించి
సేవ చేయగలమా? (రోమా 1:25)
కీర్తనకారుడు, “నీవు సృజించిన ఆకాశములను
నీవు కలుగజేసిన చంద్రతారకలను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు
వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీ
కంటెను వానిని కొంచెము తక్కువ వానిగా మాత్రమె చేసియున్నావు. మహిమా ప్రభావములతో
వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ సృష్టియంతటి మీద వానికి అధికారమిచ్చి
యున్నావు” (కీర్తన 8: 4-6) అని ప్రార్థించాడు. పోపు ఫ్రాన్సిసు మనలను ఇలా ఆదేశించాడు,
“మీరు చాలా ప్రాముఖ్యమైనవారు! మీరు
ఏమి కలిగి ఉన్నారో దానిని కాదు, మీరు
ఏమిటో అన్నదానిని మాత్రమె దేవుడు
లెక్కిస్తాడు. అతని దృష్టిలో, మీరు
ధరించే బట్టలు లేదా మీరు ఉపయోగించే సెల్ ఫోన్లు ఖచ్చితంగా పట్టింపు కాదు అతనికి.
మీరు స్టైలిష్గా ఉన్నారా లేదా అనేది ఆయనకు పట్టింపు కాదు. ఆయన మీ గురించి శ్రద్ధ
వహిస్తాడు! ఆయన దృష్టిలో మీరు చాలా విలువైనవారు, మీ విలువ అమూల్యమైనది." ఇదే విషయం యిర్మీయా 1:5;
యెషయా 49:16;
కీర్తన 8:4;
కీర్తన 139:18-19 లలో మనకు వాగ్దానం చేయబడినది. మనం చిత్తశుద్ధితో జీవించడం
ద్వారా మాత్రమె పరలోకంలో మన నిధిని నిల్వ చేసుకుంటాము. పునీత జాన్ మేరీ వియాన్నీ గారు,
“మనిషికి ప్రార్థించడం మరియు ప్రేమించడం అనేది ఒక అందమైన
విధి మరియు బాధ్యత. మీరు ప్రార్థించి ప్రేమించినట్లయితే,
మీరు ఈ లోకంలో ఆనందాన్ని
పొందుతారు” అని తన బోధనలో వ్రాసాడు. “పేదల అవసరాలను మనం తీర్చ గలిగినపుడు,
అది దయతో కూడిన పని కాదు. అది మనది
కూడా కాదు. వారిది
వారికే ఇచ్చెస్తున్నామనీ, మనం న్యాయపు రుణాన్ని చెల్లిస్తున్నాము" అని పునీత
గ్రెగొరీ ది గ్రేట్ బోధించాడు. ఇది ఒక విప్లవాత్మకమైన బోధన.
క్రీస్తు విలువలు లోక విలువలకు విరుద్ధంగా వుంటాయి. పౌలు
ఇలా అంటున్నాడు, మనం
లోకం దృష్టిలో మూర్ఖులం, కానీ
ఆయన దృష్టిలో జ్ఞానవంతులం. క్రీస్తు కోసం మనం మూర్ఖులం అవుతాము (1 కొరింథీ 3;19; 4:10). “లోకమంతటినీ సంపాదించి, మనల్ని
మనం పోగొట్టుకోవడం వల్ల లేదా నాశనం చేసుకోవడం వల్ల మనకు ఏమి లాభం?”
(లూకా 9:25).
“మనకు అవసరమైన దానికంటే ఎక్కువ
ఉన్నప్పటికీ, అది మన ఆత్మలకు ఏమాత్రం భద్రత తీసుకు రాలేదు” (లూకా 12:15).
అమూల్యమైన ఉద్దేశపూర్వక జీవితం అనేది
కేవలం డబ్బు లేదా భౌతిక వారసత్వాన్ని కూడబెట్టుకోవడంపై దృష్టి పెట్టదు. నేటి సువార్తలోని
ధనవంతుడు తన శక్తిని సమయాన్ని సంపదపై మరియు సంపదను పోగుచేయడంపై ఖర్చు చేశాడు. యేసు
మన సంపద మరియు ఆరోగ్యానికి వ్యతిరేకమా? “ఆయన
పేదలను దుమ్ములో నుండి పైకి లేపుతాడు. పేదవారిని బూడిద కుప్ప నుండి పైకి లేపుతాడు. వారిని రాజులతో
కూర్చోబెడతాడు. వారిని గౌరవ సింహాసనాన్ని వారసత్వంగా పొందేలా చేస్తాడు” (1 సమూ 2:8) అనే లేఖనాన్ని ఆయన తిరస్కరించడు. ఆయన సౌకర్యాలకు సంపదలకు
వ్యతిరేకి కానే కాదు, కానీ
ఆయనకు ఒక సాధారణ ప్రశ్న ఉంది, “మూర్ఖుడా!
ఈ రాత్రి, నీ ప్రాణం నీ నుండి
కోరబడితే, నీవు సిద్ధం చేసుకున్న సంపదలు ఎవరివి అవుతాయి?"
ఈ ప్రశ్న పునీత లయోలా పురి
ఇగ్నేషియస్తో మాట్లాడింది. తన సమాధానం చాలా మందికి నేటికీ స్ఫూర్తినిస్తుంది.
మరో తీవ్రమైన విషయం ఏమిటంటే, జీవనోపాధి కోసం మరియు ప్రగతి కొరకు పనిచేయడంలో విలువను
చూడకపోవడం. కొందరు ఇలా అంటారు, “జీవితం
చాలా చిన్నది. మనం ప్రజా ఖర్చుతో ఆహారం
పొందవచ్చు కాబట్టి భారమైన పనులతో ఎందుకు బాధపడాలి?” రాష్ట్ర ప్రయోజనాలతో జీవించడం అనేది చెల్లుబాటు అయ్యే
వృత్తిపరమైన ఎంపిక కాకూడదు. క్రీస్తు రెండవ రాకడ చాలా దగ్గరగా ఉందని,
పని అనవసరమని భావించిన ప్రారంభ తొలి
క్రైస్తవ సంఘంలోని కొంతమంది విశ్వాసుల్లో
ఆ ధోరణి ఉండేది. స్తబ్దత మరియు సోమరితనం ఎటువంటి అభివృద్ధిని తీసుకురాలేదు. దేవుని
నుండి మనం పొందుకున్న ప్రతిభకు మనం జవాబుదారులం (మత్తయి 25:14-30).
పునీత పౌలుడు ఈ విషయంలో ఒక వ్యవహారికసత్తావాది:
“ఎవరైనా పని చేయడానికి నిరాకరిస్తే, వారు
తినకూడదు” (2 థెస్స 3:10) అని నిర్ధారించాడు.
ధర్మం అనేది
సాధారణంగా విపరీత వైపరిత్యాల మధ్య మధ్యస్థాయిగా ఉంటుంది. మనం దీన్ని డబ్బు కోసం శ్రమించే
కోరికలకు అన్వయించుకోవాలి. మనకు కొన్ని ప్రాపంచిక వస్తువులు, నివసించడానికి ఒక ఇల్లు
మరియు మన జీవితాలను పోషించు కోవడానికి డబ్బు అవసరం. సంపదలు వాటంతటకు అవే విలువైనవి
కావు అలాగని విలువ తక్కువవి కూడా కాదు. మనం చూస్తున్నట్లుగా సృష్టించబడిన ప్రతీ జీవి పుడమిలో పురోగతిని
తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తుందో అలాగునే మనం కూడా మెరుగైన సమాజం కోసం పనిచేయడానికి
పిలువబడ్డాము. సంపదలు మంచివే కానీ దేవునిలో ఐక్యత చెందడానికై మన ఆత్మలు కలిగియున్న
వేదనను మాత్రం తీర్చలేవు. తత్ఫలితంగా, మనం వాటిని తాము ఉన్నవిధంగానే మరియు బాధ్యతాయుతమైన
పురోగతికి ఒక మార్గంగా ఉపయోగించుకోవాలి. డబ్బును బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి
అనేక మార్గాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంధములో అగూర్ అనే అతను, “నాకు పేదరికం లేదా
సంపద ఇవ్వకండి, కానీ నా
రోజువారీ ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. లేకపోతే, నా దగ్గర చాలా ఉంటే నిన్ను తిరస్కరించి, ‘ప్రభువు ఎవరు?’ అని అడగవచ్చు లేదా
నేను పేదవాడిని అయి దొంగిలించి నా దేవుని నామాన్ని అవమానపరచవచ్చు” (సామెతలు 30: 8-9) అని భగవంతుణ్ణి వేడుకున్నాడు. అదే విధంగా సొలొమోను రాజు, “కాబట్టి నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి నీ సేవకుడికి
వివేకవంతమైన హృదయాన్ని దయ చేయుము, తద్వారా నేను మంచి చెడుల మధ్య తేడాను వివేచించగలను” (1 రాజు 3:9) అని ప్రార్థించాడు.
అలా మనము మన సంపదల వినియోగార్ధ జ్ఞానము కొరకు ప్రార్ధన చేద్దాం.
"నీతికొరకు
ఆకలిదప్పులు గలవారు ధన్యులు,
వారు సంతృప్తిపరచబడుదురు"
(మత్త 5:6)