AletheiAnveshana: వినయంలో పుట్టిన నివేదన సిరాకు 35:12-14,16-18; 2 తిమోతి 4:6-8,16-18; లూకా 18:9-14 (30/C)

Friday, 24 October 2025

వినయంలో పుట్టిన నివేదన సిరాకు 35:12-14,16-18; 2 తిమోతి 4:6-8,16-18; లూకా 18:9-14 (30/C)

 

వినయంలో పుట్టిన నివేదన

 

సిరాకు 35:12-14,16-18; 2 తిమోతి 4:6-8,16-18; లూకా 18:9-14 (30/C)

 

వినయవంతుల ప్రార్థన మేఘాలను చీల్చుతుంది. దాని గమ్యాన్ని చేరుకునే వరకు అది విశ్రాంతి తీసుకోదు.” (సిరాకు 35:17)

 

భక్తుడైన యూదుడు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మరియ 3 గంటలకు మూడుసార్లు ప్రార్థన చేసేవాడు. అదే ప్రార్థన ఆలయంలో చేస్తే అది చాలా ప్రభావవంతంగా ఉంటుందని భావించేవారు. దీని ప్రకారంగా, ఆయా సమయాల్లో, చాలామంది ప్రార్థన చేయడానికి ఆలయ ప్రాంగణాలకు వెళ్లేవారు. యేసు ఇద్దరు వ్యక్తులు పైకి వెళ్ళిన దాని గురించి మరియు వారు ప్రార్థించిన విధానం గురించి ప్రస్తావించడం సువార్తికుడు లూకా మనకు వివరిస్తున్న్నాడు. మనకు కథ తెలుసు. మన ప్రార్థన దేవునికి ప్రీతికరమైనదా కాదా అని మనం ఎలా తెలుసుకోగలం? దేవుని నామంలో మాట్లాడిన ప్రవక్త హోషేయ: “నేను త్యాగాన్ని కాదు, స్థిరమైన ప్రేమను కోరుకుంటున్నాను” (హోషే 6:6) అని దైవ అభీష్టాన్ని  ప్రవచించాడు. దేవుని పట్ల మరియు పొరుగువారి పట్ల ప్రేమతో కూడిన హృదయం నుండి ప్రార్ధన ఉద్భవించకపోతే, మనం దేవునికి చేసే ప్రార్థనలు మరియు త్యాగాలు ఆయనకు అర్థరహితంగా ఉంటాయి.

 

మనం వినయంతోనూ, దయ మరియు క్షమాపణ కోరుకునే పశ్చాత్తాప హృదయంతోనూ దేవుని వద్దకు రాకపోతే, ఆయన మన ప్రార్థనలను వింటాడని మనం ఎలా ఆశించగలం? మనకు దేవుని కృప మరియు సహాయం నిరంతరం అవసరం. అందుకే లేఖనం "దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తాడు కానీ వినయస్థులకు కృపను అనుగ్రహిస్తాడు" అని మనకు చెబుతుంది (యాకో 4:6; సామె 3:34). యేసు ఉపమానం ప్రార్థనా స్వభావం మరియు దేవునితో మనకు వున్న సంబంధం గురించి మాట్లాడుతుంది. ప్రార్థన పట్ల రెండు విభిన్న వైఖరులను ఇది విభేదిస్తుంది. పరిసయ్యుడు మతపరమైన ఆచారాలలో గర్వాన్ని సూచిస్తాడు మరియు పన్ను వసూలు చేసే సుంకరి వినయాన్ని సూచించినప్పటికీ మత చ్చాoదస్తపరమైన మనస్సు గలవారు అతన్ని తృణీకరిస్తారు. మనం గర్వంతో కాకుండా వినయంతో దేవుణ్ణి వెతుకుతున్నందున దేవుడు అలాంటి ప్రార్థనను వింటాడు. షిలోహులోని హన్నా మొదలుకొని ఆలయంలో సొలొమోను ప్రార్ధాన వరకు, కార్మేలు పర్వతంపై  ఏలీయా నుండి యేసు కథలోని పన్ను వసూలు చేసే సుకంరి వరకు, నిజమైన ప్రార్థన ఎల్లప్పుడూ వినయం మరియు దేవునిపై ఆధారపడటం నుండే పుట్టింది. హన్నా, “ఓ సైన్యములకధిపతియగు ప్రభువా! నీ దాసి దుఃఖాన్ని నీవు చూస్తే...” (1 సమూ 1:11) అని ప్రార్థించింది. సొలొమోను రాజు, “నీ సేవకునికి నీ ప్రజలను పరిపాలించడానికి వివేకవంతమైన హృదయాన్ని ఇవ్వు” అని ప్రార్థించాడు (1 రాజు 3:9). ఏలీయా , "ఓ ప్రభువా, నాకు ఉత్తరమిమ్ము, ఈ ప్రజలు నీవే దేవుడవని తెలుసుకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము" అని ప్రార్థించాడు.

 

జాను క్రిసోస్టము అనే పితృపాదులు పరిసయ్యుడు దేవునికి కాదు ప్రార్ధించింది, తనకు తనకే ప్రార్థించుకున్నాడు. అతను తన సొంత వ్యర్థానికకే ధూపం వేసుకున్నాడు” అని అంటున్నాడు.  అంటే తన తగ్గింపు జీవితాన్ని తెలుసు కున్నాడు అని అర్ధం. పునీత జాను డమస్సీన్ అనే మరో పితృ పాదులు, “ప్రార్థన అంటే ఒకరి మనస్సు మరియు హృదయాన్ని దేవుని వైపు ఎత్తడం లేదా దేవుని నుండి మంచి విషయాలను అభ్యర్థించడం” అని  అంటున్నాడు. కానీ మనం ప్రార్థించేటప్పుడు, మనం మన గర్వ సంకల్పపు ఎత్తుల నుండి మాట్లాడుతున్నామా లేదా వినయపూర్వకమైన పశ్చాత్తాపపడిన హృదయపు 'లోతుల నుండి' మాట్లాడుతున్నామా? (కీర్తన 130:1). పునీత అగుస్టీను ఇటువంటి వినయ తత్త్వాన్ని  సువార్తపు హృదయంగా వివరిస్తూ, “తాను అనారోగ్యంతో ఉన్నానని తెలిసినవాడు వైద్యుడిని వెతుకుతాడు. పాపపు ఒప్పుకోలు అనేది స్వస్థతకు నాంది.” అని వ్యాఖ్యానించాడు. మనం దేవుని ముందు బిచ్చగాళ్లం. “మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదని” మనం వినయంగా అంగీకరించినప్పుడు మాత్రమే, ప్రార్థన బహుమతిని స్వేచ్ఛగా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండగలం. దేవుని చెవి దీనుల వైపు వంగి ఉంటుంది. గర్విష్ఠులు గోపురాలు “దైవ శిఖరాలు”  నిర్మిస్తారు. వినయస్థులు జీవిత బలిపీఠాలను నిర్మిస్తారు. దేవుడు గోపురాలు లేదా “దైవ శిఖరాలు” పై కాకుండా, జీవిత బలిపీఠాలపై జీవిస్తాడు. దర్శనమిస్తాడు. నేడు మనం: “ఓ దేవా, పాపిని, నన్ను కరుణించు” అనే స్ఫూర్తితో ప్రార్థిద్దాం. మరియు మనం హృదయపూర్వకంగా, వినయంగా, నిజాయితీగా ప్రార్థిస్తే - అప్పుడు పన్ను వసూలు చేసే వ్యక్తివలే, మనం కూడా నీతిమంతులుగా ఇంటికి వెళ్ళగలము. అప్పుడు దేవుడు మాత్రమే ఇవ్వగల శాంతితో మన హృదయాలు నిండి ఉంటాయి.

 

"క్రీస్తులో మనం దేవునికి ఎలా ప్రార్థించాలో నేర్చుకుందాము - ఎందుకంటే ఆయన మన కోసం, మనలో, మరియు మన ద్వారా ప్రార్థించాడు" (పునీత అంబ్రోసు)

 

No comments:

Post a Comment