AletheiAnveshana: “క్రీస్తు కరుణ మరియు అద్భుతమైన మానవత్వం - పరిచర్య” నిర్గ 19:2-6; రోమా 5:6-11; మత్త 9:36-10:8 (A / 11)

Saturday, 13 June 2026

“క్రీస్తు కరుణ మరియు అద్భుతమైన మానవత్వం - పరిచర్య” నిర్గ 19:2-6; రోమా 5:6-11; మత్త 9:36-10:8 (A / 11)

 


క్రీస్తు కరుణ మరియు అద్భుతమైన మానవత్వం - పరిచర్య”

 

నిర్గ 19:2-6; రోమా 5:6-11; మత్త 9:36-10:8 (A / 11)

 

ప్రభూ, నీ రాజ్యము నిత్యమైన రాజ్యము, హల్లెలూయా.

 

యేసు జనసమూహములను చూచినప్పుడు, “కాపరిలేని గొఱ్ఱెలవలె వారు దిక్కుతోచని స్థితిలో పాడుపడిరి గనుక వారియందు కనికరపడెను” (మత్త 9:36). క్రీస్తు చూపు తీర్పు తీర్చుటకు సంబంధించినది కాదు, కరుణతో కూడినది. మానవ హృదయంలో దాగి ఉన్న గాయాలను ఆయన చూస్తాడు—విస్మరించబడిన వారి ఒంటరితనం, జీవితానికి అర్థం కోసం వెతికే వారి ఆందోళన, పేదల బాధ, మరియు సాంకేతికతలో సంపన్నమై, నిజమైన సంబంధాలు లేని ఈ ప్రపంచంలో తరచుగా ఉండే శూన్యతను ఆయన చూస్తాడు. ‘మగ్నిఫికా హ్యూమానితాస్’ (మహిమాన్విత మానవత్వం) స్ఫూర్తితో, మన కాలపు అతిపెద్ద సంక్షోభం కేవలం ఆర్థిక, రాజకీయ, లేదా సాంకేతికమైనది కాదని, అది పూర్తిగా మానవ సంబంధమైనదని మనం గుర్తిస్తున్నాము. చాలా మందికి యావత్ ప్రపంచంతో సంభాషించే మార్గాలు లేదా AI తో కూడిన social media ఉన్నప్పటికీ, తమ పక్కనే నిలబడిన వ్యక్తిని కలుసుకోవడానికి వారు ఇబ్బంది పడుతున్నారు. మానవాళి జ్ఞానంలోనూ, శక్తిలోనూ పురోగమిస్తున్నప్పటికీ, కరుణ, సంఘీభావం, మరియు ఆత్మార్పణ ప్రేమ వంటి వివేకాన్ని కోల్పోయే ప్రమాదంలోకి దిగజారిపోయింది. ప్రతి వ్యక్తి ఆ కరుణ పరివర్తనాత్మక ప్రతిబింబమేనని వెల్లడిస్తూ, మానవాళి నిజమైన గొప్పతనాన్ని పునరుద్ధరించడానికే క్రీస్తు మన మధ్య తనను తాను నిలుపుకున్నాడు.

 

గాయపడిన మానవాళి పట్ల యేసు ప్రతిస్పందన - జనసమూహాలను తన మాటలతో ఓదార్చడమే కాక, ఆ పనిని కొనసాగించే పనివారిని తన పంటలోనికి పంపడమూ కలబోసుకున్నది. “పంట విస్తారంగా ఉంది, కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు; కాబట్టి, పంట యజమానిని తన పంటలోనికి పనివారిని పంపమని అడగండి” (మత్త 9:37-38) అన్న వాక్యపు అర్ధం ఇదే. ఈ పరిచర్య బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తికి చెందుతుంది. ఇది ప్రపంచంలో దేవుని సన్నిధికి ఒక చిహ్నం. నిన్నటి మార్పు చెందినవారు రేపటి మిషనరీలుగా మారాలి. క్రీస్తును నిజంగా అనుభవించే సంఘం ఎన్నడూ తనలో తాను మూసుకుపోయి ఉండదు. నూతనపరచబడిన సంఘం కేవలం నిర్దిష్టమైన  సాంఘిక సామాజిక గొప్ప కార్యక్రమాలతోనే కాకుండా, రూపాంతరం చెందిన హృదయాలతో ఉంటుంది. నీవు విశ్వవ్యాప్త సంఘంలో కాపరిగా మారి, ఆయన పిలుపు కోసం ప్రార్థించి, వివేచించి, ఉదారంగా ప్రతిస్పందించాలి. ప్రభూ, నీ ప్రజల కోసం నేను ఏమి చేయాలని కోరుకుంటున్నావు?” అని అడగడానికి యువతను ప్రోత్సహించే ఒక ప్రదేశంగా లేదా స్థలంగా నీవు మారాలి.

 

మానవ గౌరవం ఇతరులకు బహుమతిగా మారినప్పుడే పరిపూర్ణతను పొందుతుందని “మాగ్నిఫికా హ్యూమానితాస్” మనకు గుర్తు చేస్తుంది. అందువల్ల, ఈ మిషన్ కేవలం భౌగోళిక సరిహద్దులను దాటడం మాత్రమే కాదు; అది ఉదాసీనత అనే అడ్డంకులను అధిగమించడంతో మొదలవుతుంది. గొప్ప మిషనరీ క్షేత్రాలు తరచుగా మన ఇళ్లలో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో మరియు పరిసరాల్లోనే కనిపిస్తాయి. మన చుట్టూ ఒంటరిగా, తిరస్కరించబడిన, గాయపడిన ప్రజలు ఉన్నారు, వారు కరుణతో తమను ఆలకించే వారి కోసం వెతుకుతున్నారు. పునీత జాన్ క్రిసోస్టోమ్ "ఇతరుల మోక్షం గురించి పట్టించుకోని క్రైస్తవుని కంటే నులి వెచ్చనివాడు మరొకడు లేడు" అన్న తన శక్తివంతమైన మాటలతో మనకు ఒక సవాలు విసురుతున్నాడు. క్రీస్తు శిష్యుడు ఒంటరితనం అనే గోడలను బద్దలు కొట్టి, కలయికకు వారధిగా మారాలి. అదేవిధంగా, పునీత థెరేసా ఆఫ్ లిసియుక్స్ - ఎన్నడూ విదేశాలకు ప్రయాణించనప్పటికీ, తన ప్రార్థన, త్యాగం మరియు సాధారణ దైనందిన జీవితాన్ని ప్రేమతో కూడిన సార్వత్రిక మిషన్‌గా మార్చడం ద్వారా మిషన్ ప్రాంతాలకు పాలక పునీతురాలిగా నిలిచింది.

 

సువార్తను ప్రకటించే ధ్యేయము కేవలం సిద్ధాంతాలను బోధించుటకు మాత్రమే కాదు, మన జీవితాల ద్వారా క్రీస్తు స్వరూపాన్ని బయలుపరచుట౦ కూడా. అందువలన, సర్వవ్యాప్త పవిత్ర కథోలిక సంఘముతో పాటు, మనమందరం మన మన సామర్థ్యానికి మరియు ప్రతిభకు అనుగుణంగా మిషనరీలమవుదాము. ప్రభువు మన గాయాలను మాన్పి, మన సహవాస భావనను బలపరిచి, “మహిమాన్విత మానవత్వము” లేదా Magnifica Humanitas మిషనరీలుగాను మరియు మన తోటి వారిని దేవుని ప్రేమగా మార్చేవారిగాను మనలను పంపును గాక!!!

 

“ప్రభువు తన మాటలన్నిటిలో నమ్మకమైనవాడును, తన కార్యములన్నిటిలో ప్రేమగలవాడును.” హల్లెలూయా.

 

 

No comments:

Post a Comment