“భయపడకుడి: దేవుడు మీతో ఉన్నాడు”
యిర్మీయా 20:10-13; రోమా 5:12-15; మత్తయి 10:26-33 (A / 12)
“దేవునికి
భయపడువారలారా,
వచ్చి
వినండి. ఆయన నా ప్రాణమునకు ఏమి చేసెనో నేను మీకు చెప్పెదను, హల్లెలూయా”.
“భయపడకుడి” అనేది
కేవలం ఒక ప్రోత్సాహపు యేసుని మాట మాత్రమే కాదు, అది ఒక దైవిక హామీ. రక్షణ చరిత్ర అంతటా, దేవుడు తన ప్రజలతో
నిరంతరం “భయపడకుడి,
నేను
మీతో ఉన్నాను” అన్న అదే సందేశంతో మాట్లాడుతాడు.
మన భయాలు,
మన
చింతలు,
రేపటి
గురించిన మన అనిశ్చితి,
మరియు
నొప్పి,
మానసిక వ్యధలతో మన పోరాటాలు ఆయనకు తెలుసు. ఎన్నో నవ్వుతున్న ముఖాల
వెనుక,
కంటికి కనిపించని గాయాలను, దాగివున్న భయాలను హృదయాలు
మోస్తున్నాయి కదా!
యోబు తన శ్రమలో, “నా విమోచకుడు
సజీవుడని నాకు తెలుసు” అని ఒప్పుకున్నాడు (యోబు 19:25). ప్రవక్తయైన యిర్మీయా తన శత్రువులు, “భయం అంతటా ఉంది!
అతనిని తుడిచి పెట్టండి!” (యిర్మీ 20:10) అని బెదిరించినప్పుడు, అతడు దేవునిచే విడిచిపెట్టబడినట్లుగా
మరియు తాను భయపడుతున్నాట్లుగా భావించాడు.
ఆ శ్రమల్లో,
“అయినను
యెహోవా బలమైన యోధునివలె నాతో ఉన్నాడు” (యిర్మీ 20:21) అని ఒప్పుకున్నాడు. అందుకే అతని భయం నమ్మకంగా
రూపాంతరం చెందింది. ధైర్యం అంటే భయం లేక పోవడం కాదు లేదా ఎన్నడూ భయాన్ని అనుభవించకపోవడం కాదు. ధైర్యం అంటే మన
భయాన్ని దేవుని చేతుల్లో పెట్టడం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అబ్రాహాముకు
తెలియని సమయంలో,
దేవుడు
అతనితో,
“అబ్రాము! భయపడకుము, నేను నీకు అండగా
ఉన్నాను” (ఆది 15:1)
అని
చెప్పాడు. మోషే మరియు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఒడ్డున చిక్కుకొని నిలబడినప్పుడు, వారి వెనుక నుండి
ఐగుప్తు సైన్యం సమీపిస్తుండగా, యోహోవా, “భయపడకుడి! నిలకడగా
ఉండి యెహోవా విజయమును చూడుడి” (నిర్గ 14:13) అని ధైర్యం చెప్పాడు.
దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించే బాధ్యతను యెహోషువకు అప్పగించబడినప్పుడు, “బలముగాను ధైర్యముగాను
ఉండుము;
భయపడకుము, ఎందుకంటే నీవు
ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటాడు” (యెహో 1:9) అని ప్రభువు ప్రోత్సహించాడు.
ధైర్యానికి కారణం మన మానవ బలం కాదు. ప్రాపంచిక భద్రత అంతకంటే కాదు. అది ఎప్పుడు మనకు
తోడై వుండే దేవుని నమ్మకమైన సన్నిధి మాత్రమె.
సువార్తలో, “భయపడకుడి” (మత్త. 10:26, 28, 31) అని
యేసు
తన అభయాజ్ఞను మూడుసార్లు పునరావృతం చేస్తున్నాడు. అదే సమయంలో, కష్టాలు లేని
జీవితాన్ని ఎన్నడూ ఆయన తన అనుచరులకు వాగ్దానం చేయలేదు. వారిని తిరస్కరించి, హింసించగల లోకంలోకి
ఆయన వారిని పంపుతున్నాడు. క్రైస్తవ జీవితం అంటే శిలువ శ్రమలు లేకపోవడం కాదు.
నిశ్చయంగా,
మనం
శిలువను ఎప్పుడూ ఎన్నటికి ఒంటరిగా మోయము. భయపడకూడదని యేసు తన శిష్యులకు ఒక లోతైన
కారణాన్ని ఇస్తున్నాడు. పిచ్చుకలు కూడా పరలోకపు తండ్రి సంరక్షణలో ఉన్నాయని, మన తల వెంట్రుకలు
కూడా లెక్కించబడ్డాయని ఆయన అంటాడు (మత్త 10:29:31). ఈ అందమైన ఉపమానం దేవుని దయను
వెల్లడిస్తుంది. మనం మరచిపోబడలేదు, పైగా అమూల్యమైన వాళ్ళం. నక్షత్రాలను, గ్రహాలను సృష్టించిన
దేవునికి మన పేర్లు,
మన
పోరాటాలు,
మన
కన్నీళ్లు,
మన
ఆశలు కూడా తెలుసు. అందువల్ల, క్రైస్తవుడు శ్రమను నిరాకరించడు, కానీ నిరీక్షణతో
దానిని ఎదుర్కొంటాడు,
ఎందుకంటే
క్రీస్తు అప్పటికే లోకాన్ని జయించాడు.
సత్యాన్ని
మాట్లాడటానికి భయపడవద్దని,
క్షమించాలని, ప్రతి మానవుని
గౌరవాన్ని,
ముఖ్యంగా
పేదలు బలహీనుల గౌరవాన్ని కాపాడాలని, మరియు మన విశ్వాసం జనాదరణ పొందకపోయినా
దాని ప్రకారం జీవించాలని యేసు మనకు పిలుపునిస్తున్నాడు. 'మగ్నిఫికా హ్యూమానితాస్' మనకు
గుర్తుచేస్తున్నట్లుగా,
నిజమైన
మానవ వికాసం అనేది ఆత్మనిర్భరతలో కాకుండా, దేవునితో మరియు ఇతరులతో సహవాసంలో
పాతుకుపోయి ఉంటుంది. లోకం తాత్కాలిక భద్రతలను అందించవచ్చు, కానీ మన హృదయాల నుండి
భయాన్ని తొలగించే శాశ్వతమైన శాంతిని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. బహుశ: ఈ రోజు మనలో
ప్రతి ఒక్కరం మన ఆరోగ్యం,
మన
కుటుంబం,
మన
భవిష్యత్తు,
మన
వృత్తి,
మన
వైఫల్యాలు లేదా మన అనిశ్చితుల గురించిన ఏదో ఒక వ్యక్తిగత భయాన్ని మోసుకుంటూ ఈ
దివ్య సత్ప్రసాదానికి వస్తున్నాo. యేసు మనలో ప్రతి
ఒక్కరితో వ్యక్తిగతంగా “భయపడకు; నీవు అనేక పిచ్చుకలకంటె శ్రేష్ఠo
నాకు” అని అభయ మిస్తున్నాడు. మన భయాలు వాస్తవమైనవే, కానీ దేవుని సన్నిధి
మరియు ఆయన మనకు ప్రసాదించిన గౌరవం మన భయాల కన్నా గొప్పవి సుమీ!
కాబట్టి, ఈ దివ్యబలిపూజను యిర్మీయా
మాటలు “ప్రభువు పరాక్రమశాలిలా నాతో ఉన్నాడు” అన్న విశ్వాస మాటలతో ముగిద్దాం.
పాపాన్ని,
మరణాన్ని
జయించిన క్రీస్తుకు మన చింతలను అప్పగిద్దాం. మనం భయం నుండి విశ్వాసానికి, ఆందోళన నుండి
నిరీక్షణకు,
మరియు
ఒంటరితనం నుండి దేవునితోను,
ఒకరితో
ఒకరు సహవాసానికి పయనించే ప్రజలుగా మారుదుము గాక!!!
“ప్రభూ, మమ్మును రక్షించుము!
మేము ప్రమాదంలో ఉన్నాము; దేవా, ఆజ్ఞాపించుము, అప్పుడు సమాధానము
కలుగును.”
No comments:
Post a Comment