ప్రార్థనగా కార్యాచరణగా మారే ప్రేమ
నిర్గ 22:21-27; 1 థెస్స 1:5c-10; మత్త 22:34 – 40 (A / 30)
“జ్ఞానము రమ్యమగు
మార్గములలోను,
సమాధానముగల
మార్గములలోను నడుచును”
“నీవు నీ దేవుడైన ప్రభువును నీ
పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణమనస్సుతోను ప్రేమించవలెను,” మరియు “నీ పొరుగువానిని నీవలెనే
ప్రేమించవలెను” (మత్త 22:37-39) అని నేటి సువార్తలో, యేసు మనకు రెండు దివ్య ఆజ్ఞలను
ఇస్తున్నాడు. ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల బోధనలంతయు ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి
ఉన్నాయి. అయితే ఈ ప్రేమను మన దైనందిన జీవితంలోకి ఎలా అనువదించుకోవాలి? యేసు నేర్పిన ‘పరలోక ప్రార్థన’ (Our Father) మనకు ఒక ఆచరణాత్మక సమాధానాన్ని
అందిస్తుంది. అది పునీత అగస్టీను వివరించినట్లుగా, మనం
దేవునికి ఉపదేశించడానికి లేదా ఆయన మనసు మార్చడానికి ప్రార్థించము కానీ మన
హృదయాలను మార్చుకోవడానికి మరియు మన జీవితాలను ఆయన చిత్తానికి అనుగుణంగా
మలచుకోవడానికి మాత్రమె ప్రార్థిస్తాము.
మనం, “నీ
నామము పరిశుద్ధపరచబడును గాక” మరియు “నీ రాజ్యము వచ్చును గాక” అని
ప్రార్థించినప్పుడు, మన జీవితాల ద్వారా దేవుణ్ణి ఘనపరచాలని
మరియు ఆయన రాజ్యానికి—అంటే నీతి,
శాంతి మరియు ప్రేమ గల
రాజ్యానికి—సాధనాలుగా మారడానికి పిలువబడ్డాము. గ్రీకు పదం “అగాపే” (agape) ఇతరుల మేలును కోరే ఆత్మార్పణ ప్రేమను
వ్యక్తపరుస్తుంది. కేవలం ప్రేమను అనుభూతి చెందడానికి మాత్రమే కాకుండా, క్షమాపణ మరియు సేవ ద్వారా దానిని
ప్రదర్శించమని యేసు మనలను పిలుస్తున్నాడు. మనం బలహీనుల గౌరవాన్ని కాపాడినప్పుడు, మన “అగాపే” దేవుని పట్ల మనకున్న ప్రేమకు
సజీవ వ్యక్తీకరణగా మారుతుంది. భక్త యోహాను మనకు గుర్తుచేసినట్లుగా, మనం చూసే మనవంటి వారిని ప్రేమించడంలో విఫలమైతే, మనం చూడలేని దేవుణ్ణి ప్రేమించలేము (1 యోహా 4:20).
“పరలోకమందు
నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందునూ నెరవేరును గాక” అని మనం ప్రార్థించినప్పుడు, ఈ ప్రేమను ఆచరించడానికి కావలసిన కృపను
కోరుకుంటున్నాము. “ఈ రోజు మాకు మా దైనందిన ఆహారాన్ని దయచేయుము” అనే మాటలలో ఒక మానవతా బాధ్యత ఇమిడి ఉంది. (నీతి)ఆకలితో ఉన్నవారి పట్ల, నిరాశ్రయుల పట్ల మరియు ప్రాధమిక
హక్కులను కోల్పోయి బాధపడుతున్నవారి పట్ల ఉదాసీనంగా ఉంటూ, మనం మన దైనందిన ఆహారం కోసం
హృదయపూర్వకంగా ప్రార్థించలేము. మనం స్వీకరించే దివ్య సత్ప్రసాదపు రొట్టె, ఉదారత, సంఘీభావం
మరియు సేవ ద్వారా ఇతరులకు రొట్టెగా మారడానికి మనల్ని ప్రేరేపించాలి. “మా
అపరాధములను మేము క్షమించినట్లు,
మా అపరాధములను
క్షమించుము” అని మనం చెప్పినప్పుడు,
దేవుని కరుణను పొందడం
అనేది ఇతరుల పట్ల కరుణను చూపడానికి మనల్ని పిలుస్తోందని మనం అంగీకరిస్తున్నాము. హెబ్రీ పదం హేసేద్
(Hesed) దేవుని స్థిరమైన ప్రేమను, నిబంధన విశ్వసనీయతను మరియు కరుణామయ దయను
వ్యక్తపరుస్తుంది. అందుచేతనే క్షమాపణ,
సయోధ్య మరియు కరుణ
ద్వారా ఈ దైవిక ప్రేమను ప్రతిబింబించడానికి మనం పిలువబడ్డాము.
అదేవిధంగా, “మమ్మల్ని శోధనలోకి నడిపించవద్దు” అనే
విన్నపం స్వార్థం, ద్వేషం మరియు అవినీతిని ఎదిరించమని
మనల్ని సవాలు చేస్తుంది.
అయితే “కీడు నుండి
మమ్మల్ని రక్షించు” అనేది దేవుని సహాయం కోరుకోమని మరియు అన్యాయానికి గురైన వారికి
అండగా నిలబడమని మనల్ని పిలుస్తుంది. రెండవ వాటికను మహాసభ, “గౌదియుం ఎత్ స్పెస్” (24)లో,
మన మానవ పిలుపు ద్వారా ఇతరుల పట్ల మనం చూపించ గలిగే మన సహవాసం గురించిన మన
బాధ్యతను నొక్కి ఒక్కాణిస్తుంది. అందువల్ల,
దేవుని ప్రేమను మానవ
గౌరవం పట్ల మర్యాద మరియు బలహీనుల విడుదల నుండి వేరు చేయలేము. “పరలోక తండ్రీ” అనే
యేసు నేర్పిన ప్రార్థన మన జీవితాలను పరిశీలించుకోమని మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రేమ
లేని ప్రార్థన వట్టి మాటలే అవుతాయి. క్రియలు లేని ప్రేమ నెరవేరని
వాగ్దానంగానే మిగిలిపోతుంది. గ్రీకు పదం “అగాపే” మనల్ని ఆత్మార్పణ ప్రేమకు
పిలుస్తుంది. అలాగునే హీబ్రూ పదం “హెసెద్” స్థిరమైన, కరుణామయమైన విశ్వాసానికి మనలను
పిలుస్తుంది. మన సంపూర్ణ అస్తిత్వంతో దేవుణ్ణి మరియు మన పొరుగువారిని మనలాగే
ప్రేమిద్దాం. మన ప్రార్థన క్రియగానూ,
మన విశ్వాసం సేవగానూ, మరియు మన ప్రేమ మానవాళికి ఆశాకిరణంగానూ
మారుగాక!! మన ప్రార్థనపు నిజమైన కొలమానం,
మనం దేవునితో ఎంత
తరచుగా మాట్లాడగల మనేది కాదు,
కానీ ఆయన మన
జీవితాల్లో అప్పగించిన వ్యక్తుల ద్వారా మనం దేవుణ్ణి ఎంత విశ్వాసంగా
ప్రేమిస్తామనేదే పెద్ద కొలమానం.
“అమూల్యమైన ముత్యమైన
జ్ఞానాన్ని కనుగొన్నవాడు ధన్యుడు”

No comments:
Post a Comment