AletheiAnveshana: ఆయన ఆత్మలో గొప్ప పౌరుడు... యేష 45:1, 4-6; 1 తెస్స 1:1-5; మత్త 22:15-21 (29 / A)

Saturday, 17 October 2026

ఆయన ఆత్మలో గొప్ప పౌరుడు... యేష 45:1, 4-6; 1 తెస్స 1:1-5; మత్త 22:15-21 (29 / A)

ఆయన ఆత్మలో గొప్ప పౌరుడు...

 

యేష 45:1, 4-6; 1 తెస్స 1:1-5; మత్త 22:15-21 (29 / A)

 

"ఆయన బీదలను ధూళిలో నుండి లేపును. దరిద్రులను బూడిద కుప్పలో నుండి పైకి ఎత్తును..."

 

కైసరుకు పన్నులు చెల్లించడం ధర్మమేనా అని వారు యేసును అడిగారు. యేసు 'అవును' అని చెప్పి ఉంటే, విదేశీ పన్నులను అసహ్యించుకొని, దానిని అన్యమత అధికారానికి లొంగిపోవడంగా భావించే యూదుల దృష్టిలో ఆయన ప్రతిష్టను పాడు చేసుకునేవాడు. ఒకవేళ యేసు 'కాదు' అని చెప్పి ఉంటే, రాజద్రోహం మరియు దేశద్రోహం ఆరోపణలపై ఆయన గురించి వెంటనే రోమీయులకు ఫిర్యాదు చేయబడేది. ఒక క్రైస్తవుడు తాను నివసించే తన భౌతిక దేశానికి పౌరుడు. పౌర రాజ్యం నుండి మనం భౌతిక భద్రత, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు మరియు ప్రజా సేవలను పొందుతాము. పౌర బాధ్యత ద్వారా ఆయా వ్యవస్థలకు మద్దతు ఇవ్వడం ఒక న్యాయమైన విధి. కాని రాజ్యాధికారం అనేది దాని సరైన పరిధిలో ఉన్నంత వరకు, భౌతిక మరియు పరలోక విధేయతలు అంతర్గతంగా సంఘర్షించాల్సిన అవసరం లేదని యేసు చూపిస్తున్నాడు.

 

పవిత్ర తిరుసభ  రాజకీయ జీవితంలో "జోక్యం" చేసుకోకూడదని, కేవలం తన రక్షణ కార్యం మరియు విశ్వాస విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలన్నట్లుగా కొన్నిసార్లు మన పూర్వ పెద్దలు నేటి సువార్త పఠనం చెపుతున్నాట్లు అర్థం చేసుకున్నారు. అయితే, ఈ వ్యాఖ్యానం పూర్తిగా తప్పు అనేది నేటి వేద పండితుల వ్యాఖ్యానం. అది ఇప్పుడు అర్ధమవుతుంది. దేవుని విషయాలతో వ్యవహరించడం అంటే కేవలం సంఘారాధనను మాత్రమే పట్టించుకోవడం కాదు, దేవుని బిడ్డలైన ప్రజలందరి పట్ల మరియు మానవుని న్యాయం పట్ల సహితం శ్రద్ధ వహించడం. మన కాలంలోని నైతిక మరియు మానవ సమస్యలు, దురాగతాల ముందు చెవిటి, గుడ్డి మరియు మూగగా ఉంటూ, పవిత్ర సంఘం తన ప్రార్థనా మందిరాల నుండి కదలనట్లు నటించడం, దేవునికి చెందవలసిన దానిని ఆయన నుండి దొంగిలించడంతో సమానం. పోపు 16 వ బెనెడిక్ట్, "దేవుడిని ఒక వ్యక్తిగత అభిప్రాయంగా అంగీకరించి, ఆయనకు బహిరంగ స్థానాన్ని నిరాకరించే సహనం... సహనం కాదు, అది కపటత్వం" అని అంటాడు.

 

పోయిటియర్స్‌కు చెందిన పునీత హిలరీ, “సీజరు నాణెం బంగారంతో చేయబడింది. దానిపై అతని ముఖ చిత్రం చెక్కబడి ఉంటుంది. దేవుని నాణెం మనిషి, అతనిలో దేవుని స్వరూపం చిత్రీకరించబడింది. కాబట్టి, మీ సంపదను సీజరుకు ఇవ్వండి మరియు మీ నిర్దోషిత్వపు మనస్సాక్షిని దేవుని కోసం కాపాడుకోండి అని అంటాడు.” కథోలిక సత్యోపదేశ సంక్షేమం, “పౌరుడు తన మనస్సాక్షిలో తనకు కలిగిన నైతిక క్రమపు ఆవశ్యకతలకు, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు లేదా సువార్త బోధనలకు దూరమౌతున్నట్లుగా గ్రహించినప్పుడు తన పౌర అధికారుల ఆదేశాలను పాటించకూడదనీ, అందుకు బాధ్యత వహించాలి” (2242) అని బోధిస్తుంది. దీనిని అర్ధం చేసుకోవలసిన మన బాధ్యత కదా!!!

 

అయితే, పర్వత ప్రసంగంలో యేసు చేసిన హెచ్చరిక ఇంకా మిగిలే ఉంది. అదేమిటంటే, “ఎవడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు; ఒకడు దేవునికి మరియు ధనానికి. ఇద్దరికీ దాసుడిగా ఉండలేడు” (మత్త. 6:24). పాత నిబంధన తన తొలినాళ్లలో సంపద దేవునిచే సృష్టించబడినదిగానూ, మరియు ప్రత్యేక బాధ్యతలు కలిగిన పితృపాదులు, రాజులు మరియు నాయకులకు ప్రసాదించబడినదిగా భావించబడింది. కాలక్రమేణా, సంపద దేవుని నుండి వచ్చిన బహుమతిగా పరిగణించబడటంగానూ ఆగిపోయింది. “ఇంటిని తమ సొంతం చేసుకునేంతవరకు, ఇంటింటికీ, పొలముకూ పొలమునూ కలుపుకొనేవారికి శ్రమ” అని యెషయా హెచ్చరించాడు (యెష 5:8), మరియు యేసు స్వయంగా, “ధనవంతులైన మీకు శోకం; మీరు ఇప్పుడు సుఖభోగాలతో జీవిస్తున్నారు” (లూకా 6:24). అని హెచ్చరించాడు. ఈ లోకం మరియు దానిలోని వనరులన్నీ మినహాయింపు లేకుండా మానవులందరి ప్రయోజనం కోసం దేవునిచే సృష్టించబడ్డాయి. మరియు ఇది సాధారణంగా వారసత్వంగా వచ్చినదైనా లేదా వ్యక్తిగత కృషి ద్వారా సంపాదించినదైనా సరే, ప్రైవేటు ఆస్తి హక్కుతో పాటుగా వర్తించాలి. మరియు పౌరులందరి ఉమ్మడి ప్రయోజనానికి సహాయపడే విధానాల మధ్య సమతుల్యతను సాధించడం ప్రభుత్వ కర్తవ్యం. మరియు దీనిని సాధించడానికి పన్ను విధించడం అనేది ఇప్పటికీ అత్యంత సాధారణ మార్గాలలో ఒకటి.

 

"ఆయన గర్విష్ఠులను వారి హృదయ అహంకారమునుబట్టి చెదరగొట్టెను..."

No comments:

Post a Comment