AletheiAnveshana: మరణించిన విశ్వాసులందరి స్మరణ ప్రకటన 7:2-4,9-14; 1 యోహాను 3:1-3; మత్తయి 5:1-12a (A / 31)

Saturday, 31 October 2026

మరణించిన విశ్వాసులందరి స్మరణ ప్రకటన 7:2-4,9-14; 1 యోహాను 3:1-3; మత్తయి 5:1-12a (A / 31)

 

మరణించిన విశ్వాసులందరి స్మరణ

 

ప్రకటన 7:2-4,9-14; 1 యోహాను 3:1-3; మత్తయి 5:1-12a (A / 31)

 

“ఆత్మ ఈ జీవితంలోని లక్ష్యం లేని మార్గాల నుండి వైదొలగాలి”

 

సకల ఆత్మల దినోత్సవాన్ని(మరణించిన వారి సంస్మరణ) జరుపుకుంటున్నప్పుడు,  మన ప్రియమైన తల్లిదండ్రులను, తాతముత్తాతలను, బంధువులను, స్నేహితులను, మనకంటే ముందు వెళ్ళిపోయిన వారందరినీ మనం స్మరించుకుంటున్నాము. భారతీయ, మెక్సికన్, ఆఫ్రికన్ మరియు యూరోపియన్ సంప్రదాయాలతో సహా అనేక సంస్కృతులలో, మరణించిన వారిని స్మరించుకోవడం అనేది మన జీవితాలను తీర్చిదిద్దిన వారి జీవితాల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తుంది. అయితే, “హాలోవీన్”, సకల పునీతుల మరియు సకల ఆత్మల పండుగలు అనేవి విభిన్నమైన ఆచరణలు. సౌమహాయిన్ అనేది నవంబర్ 1న జరుపుకునే ఒక కెల్టిక్ మరియు ఐరిష్ పండుగ. ఇది శరత్ ఋతువులో పంట కోత కాలం ముగింపును మరియు శీతాకాలం లేదా సంవత్సరంలోని సగం "చీకటి భాగం" ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది ఐరిష్ మరియు స్కాటిష్ కెల్టిక్ దేశాల నవంబరు నెలకు పేరుగా నిలుస్తుంది. కెల్టిక్ రోజు అనేది సూర్యాస్తమయంతో ప్రారంభమై, మళ్ళి సూర్యాస్తమయంతో ముగియడం వలన,  ఆయా వేడుకలు అక్టోబర్ 31 సాయంత్రం ప్రారంభమయ్యాయి. సౌమహైన్ అనేది వారి అన్యమత పండుగ. దీనిని ఈ లోకానికి మరియు పరలోకానికి మధ్య సరిహద్దుగా భావించేవారు. ఇది 'ఆత్మల'తో సంప్రదింపులు జరిపే అవకాశాన్ని పెంచుతుందని నమ్మేవారు. అదే రోజు సాయింత్రంన మరణించిన వారి ఆత్మలు ఆతిథ్యం కోరుతూ వారి వారి ఇళ్లకు తిరిగి వస్తాయని కూడా భావించేవారు. ఇలాంటి నమ్మకాలే మన భారత భూమి మీద సహితం కన్పిస్తుంది కదా!! అయితే 9వ శతాబ్దంలో, బహుశ: ఐరిష్ మిషనరీల ప్రభావం కారణంగా, పాశ్చాత్య క్రైస్తవ సంఘాలు నవంబర్ 1వ తేదీని సకల పునీతుల రోజుగా ఆమోదించింది, నవంబర్ 2వ తేదీని సకల ఆత్మల రోజుగా కొనసాగించుకున్నారు. అలా నేడు మనం వినే  “హాలోవీన్” అనేది  “సౌమహయిన్” నండి రూపుదిద్దుకుందని నమ్ముతారు. కాబట్టి, “హాలోవీన్” అనే పదం నవంబర్ 1వ తేదీన వచ్చే సకల పునీతుల ముందు రోజు సాయంత్రమైన “ఆల్ హాలోస్ ఈవ్” (ఆల్ = సమస్త; హాలోస్ = పవిత్ర; ఈవ్ = సాయింత్రం/ సకల పునీతుల జాగరణ) నుండి వచ్చింది. మరియు 998 సం.లో క్లూనీకి చెందిన పునీత ఒడిలో తన మఠాలలో నవంబర్ 2వ తేదీని ఒక ప్రత్యేక స్మరణ దినంగా పాటించిన విధానాన్ని మాతృ శ్రీసభ నవంబర్ 2వ తేదీన, మరణించిన విశ్వాసులందరి కోసం ప్రార్థించమని తన క్రైస్తవులను ఆహ్వానిస్తుంది. ఇదే మన సమాధుల మరియు సకల పునీతుల పండుగల నేపథ్యం.

 

నేడు సమాధులలోనికి వెళ్లి సమాధులలో నిద్రించు వారిని గౌరవించడం అనే కథోలిక సంప్రదాయం వారి వారి ఆత్మలకు నిత్య రక్షణ కొరకు భగవంతుణ్ణి అర్దించే పరిశుద్ధ గ్రంథ  సంస్కృతిని నేర్పుతుంది. “నీతిమంతుల ఆత్మలు దేవుని చేతిలో ఉన్నాయి” (జ్ఞాన గ్రంథము 3:1) అని జ్ఞాన గ్రంథం ప్రకటిస్తుంది. అందువల్ల, మనం మన మరణించిన వారిని భయంతో కాకుండా, ప్రార్థనతో, దేవుని కరుణపై నమ్మకంతో మరియు పునరుత్థానంపై నిరీక్షణతో స్మరించుకుంటున్నాము. మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వికరిస్తున్నాము. మరణించిన విశ్వాసుల ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాము. తద్వారా మరణం తర్వాత కూడా సంఘ ఐక్యతపై మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలుగుతున్నాము. ఈ స్మరణలో ఒక మానవతా బాధ్యత కూడా ఇమిడి ఉంది. మన పూర్వీకులను గౌరవించడానికి ఉత్తమ మార్గం కేవలం వారి ఛాయాచిత్రాలను/ఫోటోలను  భద్రపరచడం, వారి సమాధులను సందర్శించడం లేదా వారి సంప్రదాయాలను పునరావృతం చేయడం మాత్రమే కాదు, వారు ప్రారంభించిన మంచిని కొనసాగించడం. మన తల్లిదండ్రులు మనకు దాతృత్వాన్ని నేర్పినట్లయితే, మనం పేదలను ఆదరిద్దాం. మన పెద్దలు కుటుంబ ఐక్యతకు విలువనిచ్చినట్లయితే, మనం ఒకరితో ఒకరం సయోధ్య చేసుకుందాం. మన పూర్వీకులు మన విద్య మరియు భవిష్యత్తు కోసం త్యాగాలు చేసినట్లయితే, మనం రాబోయే తరానికి మరింత కరుణామయమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం.

 

మన ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వం కేవలం ఆచారాల సమాహారం కాదు. అది ప్రేమ, విశ్వాసం, త్యాగం మరియు బాధ్యతల వారసత్వం. “హాలోవీన్”/ సమాధుల  పండుగ సాంస్కృతిక వేడుకల ద్వారా సమాజాలను ఏకం చేయవచ్చు. అయినప్పటికీ, సర్వ ఆత్మల సంస్మరణ రోజు మనల్ని మరింత లోతైన స్మరణకు పిలుస్తుంది. అది  మరణించిన వారి కోసం ప్రార్థించడానికి, దుఃఖిస్తున్న వారిని ఓదార్చడానికి మరియు వర్తమానంలో విశ్వాసంతో జీవించడానికే!! మన ప్రియమైన మరణించిన వారిని కృతజ్ఞతతో స్మరించుకుందాం. వారిని దేవుని దయకు అప్పగిద్దాం. మరియు వారి మంచి ఆదర్శం మన జీవితాలకు మార్గదర్శకంగా ఉండనిద్దాం. మన పూర్వీకుల జ్ఞాపకం నేడు జీవిస్తున్న వారికి ఆశీర్వాదంగా మారాలి మరియు క్రీస్తుపై మనకున్న నిరీక్షణ మనలను నిత్యజీవ వాగ్దానం వైపు నడిపించాలి. ఆమేన్.

 

“నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసించుటకును, యెహోవా ఎంత కృపాశీలుడో చూచుటకును నేను ప్రార్థించెదను”.

 

 

 

 

 

No comments:

Post a Comment