AletheiAnveshana: క్రీస్తు పవిత్ర రక్తపు శక్తి శుభ శుక్రవారం

Friday, 3 April 2026

క్రీస్తు పవిత్ర రక్తపు శక్తి శుభ శుక్రవారం

 

క్రీస్తు పవిత్ర రక్తపు శక్తి

 

శుభ శుక్రవారం

 

 పునీత జాన్ క్రిసోస్టోమ్ గారి ప్రబోధ గ్రంథం (బిషప్ 347 – 407)

 

క్రీస్తు పరమ పవిత్ర రక్తపు శక్తిని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, ఐగుప్తులో దాని పూర్వసూచన గురించిన ప్రాచీన వృత్తాంతాన్ని మనం పరిశీలించాలి. “నిష్కళంకమైన గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించి, దాని రక్తాన్ని మీ ద్వారాలపై చల్లుడి” అని మోషే ఆజ్ఞాపించాడు. దాని అర్థం ఏమిటని, మరియు వివేకం లేని ఒక జంతువు రక్తం, వివేకం గల మనుషులను ఎలా రక్షించగలదని మనం ఆయనను అడిగితే - రక్షించే శక్తి రక్తంలో లేదు, కానీ అది ప్రభువు రక్తానికి ఒక సూచనగా ఉండటంలో ఉందని ఆయన సమాధానమిస్తాడు. ఆ రోజుల్లో, సంహారక దూత ద్వారాలపై రక్తాన్ని చూసినప్పుడు, లోపలికి ప్రవేశించడానికి సాహసించలేదు. కాబట్టి ఇప్పుడు సాతాను – ద్వారాలపై ఉన్న ఆ సూచనాత్మక రక్తాన్ని కాదు, క్రీస్తు ఆలయ ద్వారాలైన విశ్వాసుల పెదవులపై ఉన్న నిజమైన రక్తాన్ని చూసినప్పుడు ఎంతమాత్రం సమీపించడు.

 

ఈ రక్తపు శక్తి కొరకు మీకు మరింత రుజువు కావాలంటే, అది ఎక్కడి నుండి వచ్చిందో మీకు అర్ధం కావాలి. అది  ప్రభువు ప్రక్కలో నుండి శిలువపై నుండి ఎలా ప్రవహించిందో గుర్తుంచుకోండి. క్రీస్తు మరణించి, ఇంకా శిలువపై వ్రేలాడుతుండగా, ఒక సైనికుడు వచ్చి ఈటెతో ఆయన ప్రక్కను పొడవగా, వెంటనే అక్కడ నీరు మరియు రక్తంను శ్రవింపచేసాడని సువార్త తెలియజేస్తుంది. ఆ నీరు బాప్తిస్మానికి, రక్తం పవిత్రమైన యూకరిస్ట్‌కు సూచనగా ఉన్నాయి. ఆ సైనికుడు ప్రభువు ప్రక్కను పొడిచి, పవిత్ర దేవాలయపు తెరను బద్దలు కొట్టాడు. నేను ఆ నిధిని కనుగొని దానిని నా సొంతం చేసుకున్నాను. గొఱ్ఱె పిల్ల విషయంలో కూడా అలాగే జరిగింది. యూదులు బలిని అర్పించారు. నేను దాని ద్వారా రక్షించబడ్డాను.

 

ఆయన ప్రక్క నుండి నీరును రక్తమును ప్రవహించెను.” ప్రియులారా, ఈ మర్మమును గూర్చి ఆలోచించకుండా విడిచిపెట్టవద్దు. దీనికి ఇంకొక నిగూఢార్థము కలదు. దానిని నేను మీకు వివరిస్తాను. నీరు మరియు రక్తం బాప్తిస్మమునకు మరియు పరిశుద్ధ దివ్య సత్ప్రసాదానికి ప్రతీకలని నేను చెప్పాను. ఈ రెండు సంస్కారముల నుండి సంఘము జన్మించుచున్నది. బాప్తిస్మము నుండిపరిశుద్ధాత్మ ద్వారా పునరుజ్జీవనమును మరియు నూతనత్వమును అనుగ్రహింపబడుతుంది. కారణం అది శుద్ధీకరణ జలము. అదేవిధంగా పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం నుండి కూడాను. బాప్తిస్మము మరియు దివ్య సత్ప్రసాదపు ప్రతీకలు ఆయన ప్రక్క నుండి ప్రవహించినందున, ఆదాము ప్రక్క నుండి హవ్వను రూపొందించినట్లే, క్రీస్తు తన ప్రక్క నుండే సంఘమును రూపొందించాడు. మోషే మొదటి మానవుని కథను చెపుతూ, అతనితో “నా ఎముకలలో నుండి ఎముక, నా మాంసములో నుండి మాంసము!” అని పలికించినప్పుడు దీనికి ఒక సూచన ఇస్తాడు. అప్పుడు దేవుడు ఆదాము ప్రక్క నుండి ఒక పక్కటెముకను తీసుకుని స్త్రీని రూపొందించినట్లే, క్రీస్తు సంఘమును రూపొందించడానికి తన ప్రక్క నుండి రక్తమును మరియు నీటిని మనకు ఇచ్చాడు. ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ప్రక్కటెముకను తీసుకున్నాడు. అదే విధంగా క్రీస్తు తన మరణానంతరం మన ప్రోక్షణకు తన  రక్తాన్ని, నీటిని ఇచ్చాడు.

 

అయితే, క్రీస్తు తన వధువును తనతో ఎలా ఏకం చేశాడో మరియు ఆయన మనందరికీ తినడానికి ఏ ఆహారాన్ని ఇస్తున్నాడో మీకు అర్థమవుతోందా? అదే ఆహారం ద్వారా మనం దేవుని ఉనికిలోకి తీసుకురాబడతాము మరియు పోషించబడతాము. ఒక స్త్రీ తన బిడ్డను తన సొంత రక్తం మరియు పాలతో ఎలా పోషిస్తుందో, అలాగే క్రీస్తు కూడా తాను జీవాన్నిచ్చిన వారిని తన సొంత రక్తంతో నిరంతరం పోషిస్తాడు.

 

ఆయన తన ప్రజలకు జీవాన్ని ఇవ్వడానికి మరణానికి తనను తాను అప్పగించుకొని పాపం లేకుండా పాపులతో సమానంగా నిలిచాడు”.

 

No comments:

Post a Comment