AletheiAnveshana: “హృదయాలు జ్వలించుట, కనులు తెరువబడుట” అపొ 2:14,22-33; 1 పేతురు 1:17-21; లూకా 24:13-35 (ఈస్టర్ 3 /ఎ)

Saturday, 18 April 2026

“హృదయాలు జ్వలించుట, కనులు తెరువబడుట” అపొ 2:14,22-33; 1 పేతురు 1:17-21; లూకా 24:13-35 (ఈస్టర్ 3 /ఎ)


హృదయాలు జ్వలించుట, కనులు తెరువబడుట”

 

అపొ 2:14,22-33; 1 పేతురు 1:17-21; లూకా 24:13-35 (ఈస్టర్ 3 /ఎ)

హల్లెలూయా. మరియా! ఏడవకుము: ప్రభువు మృతులలో నుండి లేచెను. హల్లెలూయా.


నేటి సువార్త ఎమ్మావు మార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులను చూపిస్తుంది. వారు సంతోషంగా లేరు. వారు నిరుత్సాహంతో, గందరగోళంతో, కృంగిపోయి ఉన్నారు. వారి సంభాషణ వారి వేదనను వెల్లడిస్తుంది. వారు నమ్మినదంతా శిలువ వద్ద కూలిపోయినట్లు వారికి అనిపించింది. వారు యెరూషలేము నుండి, సమాజం నుండి, నిరీక్షణ నుండి దూరంగా నడుస్తూ వెళ్లి పోతున్నారు. ఆ క్షణంలో, పునరుత్థానం చెందిన యేసు వారి దగ్గరకు వచ్చి వారితో నడుస్తున్నాడు. వారు ఆయనను గుర్తించలేదు. ఇది మన పరిస్థితి లాంటిదే! కొన్నిసార్లు, మన చుట్టూ జరిగే సంఘటనల వల్ల మనం భారమైన హృదయాలతో, నిరాశతో, బాధతో, గందరగోళంతో నడుస్తూoటాము. ఆ శిష్యుల వలె, మనం కూడా కొన్నిసార్లు “మేము నిరీక్షించాము…” అని అనుకుంటాము. కానీ ఇది గమనించండి: “వారు ఆయనను గుర్తించనప్పుడు కూడా, యేసు వారితో నడుస్తున్నాడు. ఆయన వారి మాటలు విన్నాడు. వారి దుఃఖాన్ని వ్యక్తపరచడానికి ఆయన వారికి సమయాన్ని ఇచ్చాడు.

 

అప్పుడు, ఆయన ఓపికతో “మోషేతో మరియు ప్రవక్తలందరితో మొదలుపెట్టి…” లేఖనాలను వ్యాఖ్యానించడం ప్రారంభి౦చాడు. శ్రమ అంతం కాదని, శిలువ మహిమకు నడిపిస్తుందని ఆయన వారికి అర్థమయ్యేలా సహాయం చేసాడు. ఆయన మాట్లాడుతుండగా, వారిలో ఏదో మార్పు రావడం మొదలయింది. ఇదే దేవుని వాక్యపు శక్తి. క్రీస్తు మాట్లాడినప్పుడు, చల్లారిపోయిన హృదయాలు మళ్ళీ దహించడం మొదలవుతాయి. లేఖనం విప్పి చెప్పినప్పుడు, నిరాశ నిరీక్షణకు దారి ఇవ్వడం మొదలవుతుంది. అయినప్పటికీ, ప్రయాణం దారిలో పూర్తి కాదు. అది బల్ల వద్ద పరిపూర్ణతను పొందుతుంది. యేసు రొట్టెను తీసుకుని, దానిని ఆశీర్వదించి, విరిచి, వారికి ఇచ్చినప్పుడు, వారి కళ్ళు తెరుచుకున్నాయి. రొట్టె విరవడంలో వారు ఆయనను గుర్తించారు. ఇక్కడ మన విశ్వాసంలోని గొప్ప మర్మాన్ని మనం చూస్తున్నాము. క్రీస్తు తన వాక్యంలో ఉంటాడు. కానీ ఆయన దివ్య సత్ప్రసాదంలో పూర్తిగా ప్రత్యక్షమవుతాడు.

 

 

రొట్టె విరిచే కార్యక్రమంలో క్రీస్తును గుర్తించమని మనం పిలువబడ్డామని పునీత అగస్టిన్ చెప్పారు. ఎమ్మావు గ్రామంలో శిష్యులు ఏమి అనుభవించారో, దానినే మనం ప్రతి దివ్యబలిపూజలో అనుభవిసస్తున్నాము. మొదట, ఆయన లేఖనాలలో మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత, దివ్యబలిపూజలో ఆయన తనను తాను మనకు అనుగ్రహించుకుంటాడు. ఎంతో తరచుగా పరధ్యానంతో, అలసిపోయి, లేదా నిత్యకృత్యాలకు కట్టుబడి దివ్యబలిపూజకు వస్తుంటాము.  అయినప్పటికీ ఈ సువార్త ప్రతి దివ్యబలిపూజ ఒక ఎమ్మావు క్షణమే అని మనకు గుర్తుచేస్తుంది. మనం నిష్కపటంగా వస్తే, మన హృదయాలు ప్రజ్వరిల్లుతాయి. మన కళ్ళు తెరుచుకుంటాయి. వారు ఆయనను గుర్తించిన తర్వాత, ప్రతిదీ మారిపోయింది. మార్పు చెందిన శిష్యులు ఉన్నచోటనే ఉండిపోలేదు. వారు వెంటనే లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. నిరాశ నుండి, వారు పరిచర్య వైపు కదిలారు. మౌనం నుండి, “ప్రభువు నిజంగా పునరుత్థానం చెందారు!” అన్న ప్రకటన వైపు వారు కదిలారు.

 

ఈ రోజు మనకు ఇవ్వబడిన పిలుపు ఇదే! అనేకులు గాయపడి, గందరగోళానికి గురై, మనః శాంతి నిమిత్తం అన్వేషిస్తున్నారు. మనం క్రీస్తు వలె మార్గంలో నడవడానికి పిలువబడ్డాము. ప్రజలతో నడుస్తూ, వారి పోరాటాలను వింటూ, దేవుని వాక్యంతో వారి జీవితాలను ప్రకాశింపజేస్తూ, వారిని దివ్య సత్ప్రసాదానికి నడిపించడానికి పిలువ బడ్డాము. అక్కడ వారు పునరుత్థానం చెందిన ప్రభువును నిజంగా కలుసుకోగలరు. క్రీస్తుతో నిజమైన కలయిక రహస్యంగా ఉండజాలదు. మన హృదయాలు నిజంగా ప్రజ్వరిల్లితే, మన కళ్ళు నిజంగా తెరుచుకుంటే, అప్పుడు మనం ముందుకు సాగి ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఈ రోజు, పునరుత్థానం చెందిన యేసు మనతో మన సందేహాలలో, మన పోరాటాలలో, మన దైనందిన ప్రయాణంలో నడుస్తున్నాడని గ్రహిద్దాం.

 

 

యేసు తన మరణానికి జ్ఞాపకార్థంగా తన శరీరం మరియు రక్త సంస్కారాన్ని స్థాపించాడు, హల్లెలూయా.

 

 

 

 

No comments:

Post a Comment