నా తండ్రి ఇంట్లో నాకో స్థలం
అపొ 6:1-7; 1
పేతురు 2:4-9; యోహాను 14:1-12 (A/5)
ఈస్టరు ఐదవ ఆదివారం నాడు, యోహాను సువార్త (14:2) లో “నేను మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచుటకు
వెళ్లుచున్నాను” అన్న యేసు మాటలు
ప్రగాఢమైన ఓదార్పుతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇవి కేవలం వీడ్కోలు మాటలు మాత్రమే కాదు, గమ్యం, గుర్తింపు
మరియు దైవిక సాన్నిహిత్యపు ప్రత్యక్షత.
“ఒక స్థలమును సిద్ధపరచుట” అంటే ఆ స్థలాన్ని సృష్టించడం కాదు, కానీ దానిని నివాసయోగ్యమైన స్థలంగా
అమర్చడం. అందుకే పరిశుద్ధ పేతురు,
“మన ప్రభు
నిత్యరాజ్యములోనికి మీకు సంపూర్ణముగా ప్రవేశము కలుగును” (2 పేతురు 1:11) అని
వ్రాశాడు. అలాగునే పరిశుద్ధ పౌలు, “అది దేవుని కట్టడము, చేతులతో కట్టబడని నివాసము, పరలోకమందు నిత్యమైనది” (2 కొరింథీ 5:1) అని
విశ్వసించాడు. సరిగ్గానే, “తే దేయుం” అనే అర్చన స్తుతి గీతంలో “మీరు మరణపు ముల్లును జయించి, విశ్వాసులందరికీ పరలోకరాజ్యాన్ని
తెరిచారు” అని శ్లాఘించ బడింది.
“నేను
మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచుటకు వెళ్లుచున్నాను” అనే వాక్యం, యేసు దైవిక మధ్యవర్తి అని మరియు
అంత్యకాలానికి ముందుగా వచ్చేవాడని వెల్లడిస్తుంది. ఆయనే మార్గం (యోహా 14:6). “మార్గము” అనే పదానికి వాడిన గ్రీకు పదం ὁδός (హోదోస్). ఇది కేవలం ఒక దారి కాదు. జీవించిన ఒక ప్రయాణం. ఒక సంబంధం. ఆయన వెళ్లడం అనేది పరిత్యాగం
కాదు. శిలువ నుండి ఆరోహణ వరకు జరిగిన
విమోచనాత్మక కదలిక.
ఇది తండ్రి వద్దకు
ప్రవేశాన్ని తెరచింది. “ఒక స్థలము” (τόπος,
తోపోస్) అనేది ఒక భౌగోళిక
స్వర్గం కాదు. కానీ కీర్తనకారుడు ప్రార్థించినట్లుగా
తండ్రి ఇంట్లో ఒక సంబంధాత్మక నివాసం (కీర్తన 23:6). యేసు
మనలో ప్రతి ఒక్కరి కోసం అటువంటి దయగల బహుమతిని సిద్ధం చేయడానికి వెళుతున్నాడు.
“తండ్రి
ఇల్లు” (οἰκία τοῦ
Πατρός/ హోయ్క తు పాత్రోస్) అనేది దైవిక సహవాసాన్ని, అంటే మహా త్రిత్వైక సమైక్య సహవాస జీవితానికి
మనం ఆహ్వానించబడటం సూచిస్తుంది. ఇది దేవుడు మన మధ్య “నివసిస్తాడు” (నిర్గ 25:8) అనే నిబంధన సంబంధమైన భాష. ఇప్పుడు, క్రీస్తు ద్వారా, ఈ నివాసం వ్యక్తిగతమైనదిగా మరియు
శాశ్వతమైనదిగా మారుతుంది. మనం గ్రహించ వలసిన విషయం ఏమిటంటే - ఈ వాగ్దానం స్థలానికి
సంబంధించినది కాదు.
కానీ ఒక సమైక్య సమూహా
సంఘటిత జివితానికి చెందినదిగా ఉండటానికి సంబంధించినది. అందుకే “ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడియుందురో
అచ్చోట, నేను ఉందును” (మత్తయి 18:20) అని యేసు అన్నాడు. పరలోకం అనేది మానవుల లోతైన ఆకాంక్షలకు
అంతిమ గమ్యం మరియు నెరవేర్పు అని పవిత్ర మాతృ శ్రీసభ సత్యోప దేశం ద్వారా మనకు బోధిస్తుంది (CCC 1024).
అది దివ్య దర్శనం. దేవుణ్ణి ముఖాముఖిగా చూడటం మరియు మన పొరుగువారిలో ఆయన ముఖాన్ని దర్శించడం.
రక్షణ అనేది అమూర్తమైనది కాదని,
అది ఆయన ద్వారానే
సిద్ధపరచబడి, ఉద్దేశపూర్వకంగా మరియు సురక్షితంగా
ఉంటుందని యేసు వాగ్దానం మనకు హామీ ఇస్తుంది. ఇది నిరీక్షణ సిద్ధాంతాన్ని, అనగా శాశ్వత సమైక్య సహవాసాన్ని సహితం బలపరుస్తుంది.
పితృ పాదులు మరియు పునీత అగస్టిను ఈ
"స్థలాన్ని" క్రీస్తు సాక్షాత్తు పరమ దేహమైన సంఘంగా వ్యాఖ్యానించారు. విశ్వాసులు అందులో ఐక్యం చేయబడతారు.
వారి దృష్టిలో క్రీస్తు సిద్ధపరిచే "స్థలం"
మన పరివర్తనే! మారిన మనస్సే! ఇళ్ళు,
వృత్తులు మరియు
గుర్తింపుల వంటి తాత్కాలిక భద్రత పట్ల వ్యామోహంలో ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో క్రీస్తు మనలను ఒక శాశ్వత నివాసానికి
మళ్ళిస్తున్నారు. "నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను" అనే వాగ్దానం దైవ
సంకల్పంపై నమ్మకాన్ని కలిగిస్తుంది. అది మనలను యజమానులుగా కాకుండా యాత్రికులుగా; భయంతో కాకుండా నిరీక్షణతో జీవించమని
సవాలు చేస్తుంది.
అంతేకాకుండా, “నేను వెళ్తున్నాను” అనేది వర్తమాన
కాలంలో ఉంది. ఇది కొనసాగుతున్న కార్యాన్ని
సూచిస్తుంది కదా!! క్రీస్తు నిరంతరం సిద్ధపరుస్తూ, నిరంతరం
విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు (హెబ్రీ 7:25).
మన జీవితాలు
మరచిపోబడలేదని, కానీ మహిమ కొరకు తీర్చిదిద్దబడ్డాయని
ఇది మనకు హామీ ఇస్తుంది. నేటి సంఘానికి,
దీని అర్థం మన
సమాజాలలో ఈ “సిద్ధపరచబడిన స్థలాన్ని” మూర్తీభవించడం, తండ్రి
ఇంటిని ప్రతిబింబించే స్వాగతం,
న్యాయం మరియు ప్రేమతో
కూడిన ప్రదేశాలను సృష్టించడం. కుటుంబాలు,
విచారణలు మరియు
సమాజాలు ఈ దైవిక ఆతిథ్యాన్ని ప్రతిబింబించమని పిలువబడ్డాయి. సువార్తికుడు, “పరలోక రాజ్యం మీ చేతిలో ఉంది” (మత్త. 3:2, 4:17; మార్కు 1:15) అన్నట్లు మన మధ్య క్రీస్తు పరలోక స్థానాన్ని మనం
అనుభవిద్దాం. మనం దేవుని ఆలయాలమైతే (1 కొరింథీ 3:16), మనలో ఆయన రాజ్య స్థానాన్ని కలిగి ఉండమని
మనం పిలువబడ్డాము.
No comments:
Post a Comment