AletheiAnveshana: “ప్రేమ సహవాసములోనికి పిలువబడినవారు...” నిర్గ 34:4b-6,8-9; 2 కొరింథీ 13:11-13; యోహా 3:16-18 (A/ అతి పరిశుద్ధ త్రిత్వము)

Saturday, 30 May 2026

“ప్రేమ సహవాసములోనికి పిలువబడినవారు...” నిర్గ 34:4b-6,8-9; 2 కొరింథీ 13:11-13; యోహా 3:16-18 (A/ అతి పరిశుద్ధ త్రిత్వము)

 


ప్రేమ సహవాసములోనికి పిలువబడినవారు...”

 

నిర్గ 34:4b-6,8-9; 2 కొరింథీ 13:11-13; యోహా 3:16-18 (A/ అతి పరిశుద్ధ త్రిత్వము)

 

యేసు బాప్తిస్మము: తండ్రి స్వరము వినబడెను, కుమారుడు యొర్దానులో నిలచెను, మరియు పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చెను.

 

ఈ వారం మనము సాధారణ కాలపు ఆరాధనా కాలానికి తిరిగి వస్తున్నాము. నేటి త్రిత్వైక  ఆదివారమున, ముగ్గురు వ్యక్తులలో ఒకే ఒక్క దేవుని పరిశుద్ధ త్రిత్వపు మర్మమును మనము జరుపుకుంటున్నాము. దైవీక త్రిత్వము అనేది కేవలం అధ్యయనం చేయవలసిన సిద్ధాంతము మాత్రమే కాదు, అది జీవించవలసిన ప్రేమ మర్మము. మన క్రైస్తవ జీవితము త్రిత్వపు నామమున ప్రారంభమవుతుంది. బాప్తిస్మమునందు మనము “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున” బాప్తిస్మము పొందుకున్నాము (మత్త 28:19). పరిశుద్ధ గ్రంథము త్రిత్వమును క్రమముగా బయలుపరచుచున్నది. తండ్రి దేవుడు యెహోవా, సృష్టికర్త; కుమారుడైన రక్షకుడు యేసు; మరియు  సంఘమును సత్యములోనికి నడిపించునది పరిశుద్ధాత్మదేవుడు (యోహా 16:13-15).

 

తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. కుమారుడు తండ్రికి విధేయుడు. పరిశుద్ధాత్మ వారిని పరిపూర్ణ ప్రేమలో ఏకం చేయును. దైవ త్రిత్వ సిద్ధాంతం క్రైస్తవ విశ్వాసానికి కేంద్రమైన మర్మం. ముగ్గురిలో ఒకే దైవిక సారం ఉన్నప్పటికీ ముగ్గురు విభిన్న వ్యక్తులుగా ఉన్నారని సత్యోపదేశ సంక్షేమం మనకు   బోధిస్తుంది (CCC 253). తండ్రి అజన్ముడు, కుమారుడు తండ్రి నుండి నిత్యముగా జన్మించెను, మరియు పరిశుద్ధాత్మ తండ్రికుమారుల నుండి ఉద్భవించెను. అయినప్పటికీ వారు వారి వారి మహిమలోనూ, వైభవంలోనూ మరియు నిత్యత్వంలోనూ సరి సమానులు.

 

అందువల్ల, దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవాళి కూడా సహవాసంలోనూ ఐక్యతలోనూ  సరి సమానంగా జీవించడానికి పిలువబడింది. అందుకే త్రిత్వం మనకు దైవం ఒంటరితనం కాదని, అది ఒక సన్నిహిత సహవాసమని గుర్తుచేస్తుంది. ప్రేమకు సంబంధం అవసరం. అందువల్ల, విశ్వ  సృష్టికి ముందే దేవునిలోని ప్రేమ ఉనికి మనకు సువార్తలో కన్పిస్తుంది. అందుకే పునీత అగస్టిను “మీరు ప్రేమను చూస్తే, మీరు త్రిత్వాన్ని చూస్తారు” అని అన్నాడు. తండ్రి తనను తాను కుమారునికి పూర్తిగా ఇచ్చుకున్నాడు; కుమారుడు తనను తాను తండ్రికి ఇచ్చుకున్నాడు; మరియు పరిశుద్ధాత్మ ఆ  ప్రేమకు బంధంగా నిలిచింది. అందువల్లనే నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఆత్మ సమర్పణ, త్యాగం, క్షమాపణ మరియు ఐక్యత అని మనకు సత్య తిరుసభ నేర్పిస్తుంది.

 

పునీత పాట్రిక్ ఈ త్రిత్వ రహస్యాన్ని ఒకే కాండం నుండి ఉద్భవించిన  కొమ్మలోని మూడు ఆకులుగా  అర్థం చేసుకున్నాడు. కాండంలోని మూడు ఆకులు విభిన్నమైన  అయినప్పటికీ మొక్క ఒక్కటే. ఇది భిన్నత్వంలో ఏకత్వం. దేవునిలో పరిపూర్ణంగా సహజీవనం చేయడం. క్రైస్తవ కుటుంబం ఈ త్రిత్వ జీవనాన్ని ప్రతిబింబించ పిలువబడింది. స్వార్థ స్థానంలో ప్రేమ వచ్చినప్పుడు, కోపాన్ని క్షమాపణ అధిగమించినప్పుడు, ప్రార్థన హృదయాలను ఏకం చేసినప్పుడు ఒక కుటుంబం పవిత్రంగా ఎదుగుతుంది. తండ్రి సంరక్షణ, కుమారుని విధేయత, త్యాగం, మరియు పరిశుద్ధాత్మ శాంతి ప్రతి క్రైస్తవ గృహంలో కనిపించాలి (CCC 2205).

 

ఎవరూ ఒంటరిగా జీవించడానికి పుట్టలేదని త్రిత్వం మనకు బోధిస్తుంది. ఐక్యత అంటే ఏకరూపత కాదు. ప్రతి సభ్యుడు ప్రత్యేకమైనవాడే, అయినప్పటికీ అందరూ ప్రేమతో/లో బంధించబడి ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు మరియు తాతముత్తాతలు పరస్పర గౌరవానికి, సహనానికి మరియు ప్రార్థనకు సాక్షులుగా మారాలి. సంఘమే త్రిత్వానికి ప్రతిరూపంగా నిలవాలి. క్రైస్తవులు ఐక్యతతో, సేవతో మరియు ప్రేమతో జీవించినప్పుడు, యేసు ప్రార్థించినట్లుగా, “వారందరూ ఏకమైయుండవలెను” (యోహా 17:21) అన్న దానిని లోకం దేవుని సన్నిధిని చూస్తుంది. సంఘంలో ఐక్యత కేవలం సంస్థాగతమైనది కాదు. అది త్రిత్వంలో పాతుకుపోయిన ఆధ్యాత్మిక సహవాసం. త్రిత్వైక ప్రేమకు ఒక సజీవ చిహ్నంగా మారుతుంది.

 

"సంఘం దాని మూలం కారణంగా ఏకమై ఉంది: ఈ మర్మానికి అత్యున్నత ఉదాహరణ మరియు మూలం, వ్యక్తుల త్రిత్వంలో ఒకే దేవుని ఐక్యత" (CCC 813)

 

 

 

 

 

 

No comments:

Post a Comment