భయమును విశ్వాసంతో పోరాడు వారు
ధన్యులు
జెఫా 2:3; 3:12-13; 1 కొరింథీ 1:26-31; మత్త 5:1-12
(A 4)
"యెహోవా
పర్వతమును ఎవరు ఎక్కుదురు? ఆయన పరిశుద్ధస్థలములో ఎవరు నిలబడుదురు?"
నేటి పర్వత
ప్రసంగాన్ని గలిలయలో క్రీస్తు పరిచర్యకు కేంద్ర బిందువుగా పరిగణించవచ్చు. ఇది ఆతని
బహిరంగ జీవిత మొదటి సంవత్సరంలో, సుమారు గలిలయ
శీతాకాలం లేదా వసంతకాలపు మధ్య కాలంలో ఇవ్వబడింది అని వేద శాస్త్రులు భావిస్తున్నారు.
బహిరంగ పరిచర్య ప్రారంభంలోనే, అతి సాధారణ
ప్రజల తమ జీవన పోరాటాలను గ్రహించిన యేసు ఒక పర్వత శిఖరం నుంచి, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే మాటలయిన: "ఆత్మలో పేదలు
ధన్యులు..." అని బోధించడం ప్రారంబించాడు. ఇవి నియమాలు లేదా నైతిక నినాదాలు అంత
కంటే కానే కావు. అవి దేవుని రాజ్యపు ముఖ చిత్రం. యేసు
కాలంలోనే కాదు, నేటికీ ఈ సమాజం
- విజయం, ఆధిపత్యం మరియు తనను తాను ఎలాగైనా
రక్షించుకోవాలన్న కాంక్షను మాత్రమె కీర్తిస్తుంది. దానిని "ధన్యత లేదా ధన్యుడు"
అని శ్లాఘిస్తుంది ఈ లోకం. కానీ యేసు అటువంటి తర్కాన్ని తలక్రిందులు చేస్తున్నట్లు
మనకు ఈ నాటి ధన్య వచనాలలో కన్పిస్తుంది.
ఈ
తర్కం యేసు అడుగుజాడల్లో నడిచే శిష్యత్వ ప్రయాణాన్ని కోరుతుంది. ప్రతి
శుభప్రదంలోనూ లేదా ధన్య వచనంలోనూ చాలా అంతర్గత గమనాన్నే కలిగి వుంది. పేదలయిన వాళ్ళు
తమ ఆత్మలో దేవునిపై ఆధారపడటాన్ని గుర్తిస్తారు.
పాపం, అన్యాయం మరియు విసిగి విరిగి వేసారి పోయినందుకు దుఃఖించేటటువంటి వారే
వీరు. సాత్వికులు దేవుని నియంత్రణలో ఆత్మ స్థైర్యమును కనుగొంటారు. నీతి కోసం
ఆకలితో మరియు దాహంతో ఉన్నవారు లోతైన పవిత్రత కోసం ఆకాంక్షిస్టారు. కరుణామయ ప్రేమను
వారు కలిగి ఉన్నట్లుగా వారు ప్రేమించబడతారు. వారి హృదయo స్వచ్ఛమైనది
విభజించబడనిది. శాంతికాములు తండ్రి హృదయాన్ని ప్రతిబింబింప చేస్తారు. హింసింపబడినవారు
ఇంకా హింసింపబడుతున్నప్పటికీ ఎల్లప్పుడూ నమ్మకంగానే క్రీస్తులో ఉంటారు. ఇది యాదృచ్ఛిక లెక్క కాదు.
ఇది క్రీస్తు మార్గం. సువార్తికుడు మత్తయి సమర్పించే అన్ని శుభప్రదాలలో శిలువ దాగి
ఉందని గ్రహిద్దాం.
ఆంగ్ల పదం “బ్లెస్డ్"
అంటే "సంతోషం(గా)” అని సాధారణ అర్ధం. కాని దాని కంటే ఎక్కువ అర్ధాన్ని ఈ పదం కలిగి
వుంది. "బ్లెస్డ్" లేదా “సంతోషం(గా)” అన్న పదములకు గ్రీకు పదం “మకారియోస్”
ను మత్తయి ఉపయోగించినట్లు మనకు అర్ధమౌతుంది కదా! ఈ పద అర్ధం కేవలం తాత్కాలిక “సంతోషం”
కాదు. దేవునిలో పాతుకుపోయిన లోతైన మరియు అచంచలమైన ఆనందం. ఇది బాధలను
తట్టుకుంటుంది. తిరస్కరణను భరిస్తుంది, హింసలోనూ అధికంగా
తట్టుకుంటుంది. అందుకే యేసు, “సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును” అని
చెప్పడానికి ధైర్యం చేసాడనుకుంటాను. నేటి ధన్య వచనాలు ఒక దైవ పిలుపు.
ఓదార్పునిచ్చే స్థానం కాదు. ఇది గర్వ సంస్కృతిలో మనల్ని ఆత్మలో పేదలుగా ఉండటానికి
సవాలు చేస్తుంది. ఉదాసీనత సంస్కృతిలో దుఃఖించడం నేర్చుకోవడానికి మనల్ని సవాలు
చేస్తుంది. దూకుడు సంస్కృతిలో సాత్వికతను ఎంచుకోవాలని ఇది మనల్ని
ప్రోత్సహిస్తుంది. రాజీ సంస్కృతిలో నీతి కోసం ఆకలిని కలిగి ఉండాలని మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రతీకార సంస్కృతిలో
దయగలవారిగా ఉండటానికి మనకు శక్తినిస్తుంది. విభజించబడిన మనుష్యుల హృదయాల/మనసుల
సంస్కృతిలో మనం స్వచ్ఛతను కోరుకోవాలని ఇది డిమాండ్ చేస్తుంది. విభజన సంస్కృతిలో
శాంతిని సృష్టించేవారిగా ఉండటానికి ఇది మనల్ని బలోపేతం చేస్తుంది. విశ్వాసానికి
వ్యతిరేకమైన సంస్కృతిలో దృఢంగా నిలబడటానికి ఇది మనల్ని బలపరుస్తుంది. శిలువ మరియు
పునరుత్థానం ద్వారా చూసినప్పుడు మాత్రమే ఈ శుభ వచనాలు అర్థవంతంగా ఉంటాయి.
మనం
గర్వం కంటే వినయాన్ని, తీర్పు కంటే దయను, ఓదార్పు
కంటే విశ్వాసాన్ని ఎంచుకున్న ప్రతిసారీ, మనం దేవుని
రాజ్యాన్ని దృశ్యమానం చేయగలం. ధన్యతలు ఇప్పుడు మరియు ఎప్పుడునూ సమాజంలోని నిర్దిష్ట వాస్తవాలలో
జీవించడానికి ఉద్దేశించబడ్డాయి. నేటి ధ్రువణ ప్రపంచంలో - రాజకీయ, జాతి, సైద్ధాంతిక - విభజనలను రేకెత్తించకుండా,
వాటిని స్వస్థపరచడానికి, క్రీస్తు శాంతికి
సాధనంగా మారడానికి మాతృ శ్రీసభ మనల్ని పిలుస్తుంది. విశ్వాసం అపహాస్యం చేయబడిన
లేదా అణగదొక్కబడిన లౌకిక యుగంలో, ఈ ధన్యతలు మనల్ని దృఢంగా నిలబెట్టడానికి
బలపరుస్తాయి - చేదుతో కాదు, ఆధ్యాత్మిక
ఆశతో. మనం ధన్యతలను జీవిస్తే, ప్రపంచం
ఎల్లప్పుడూ మనల్ని ప్రశంసించకపోవచ్చు - కానీ అది మనలో నివసిస్తున్న క్రీస్తును
గుర్తిస్తుంది. ఇది తథ్యం.
"ఓ దేవా! విరిగిన మరియు నలిగిన హృదయాన్ని నీవు
తృణీకరించవు" (కీర్త 51:17).