AletheiAnveshana: విశ్వాసపు శ్రేష్ఠమైన పోరాటమును ధైర్యముతో పోరాడు ఆది 2:7-9, 3:1-7; రోమా 5:12-19; ​​మత్త 4:1-11 (A - లెంట్ 1)

Saturday, 21 February 2026

విశ్వాసపు శ్రేష్ఠమైన పోరాటమును ధైర్యముతో పోరాడు ఆది 2:7-9, 3:1-7; రోమా 5:12-19; ​​మత్త 4:1-11 (A - లెంట్ 1)

 


విశ్వాసపు శ్రేష్ఠమైన పోరాటమును ధైర్యముతో పోరాడు

 

ఆది 2:7-9, 3:1-7; రోమా 5:12-19; ​​మత్త 4:1-11 (A - లెంట్ 1)

క్రీస్తులో మనం శోధనలకు గురయ్యాము. ఆయనలో అపవాదిని అధిగమించాము” (Divine Office)

 

మన జీవితాన్ని పరిశీలించే ఒక ఆలోచనాత్మక మార్గం ఏమిటంటే దానిని పాపం, కృప, స్వార్థం మరియు పవిత్రత మధ్య పోరాటంగా చూడటమే! నేటి లేఖనాలు శోధన గురించిన రెండు విరుద్ధమైన ప్రతి చర్యలను చూపుతున్నాయి. మొదటిగా, ఆది తల్లిదండ్రులు, ఆదాము మరియు హవ్వలు, దేవుని చిత్తం కంటే తమ స్వంత కోరికలకే ఇష్టపడడం (ఆది 2:16-17; 3:1-6). రెండవదిగా, అనేక సందర్భాల్లో, అబ్రాహాము తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి మరియు అతనికి ఇచ్చిన వాగ్దానాలలో అతని ఆశను బలోపేతం చేసు కోవడానికి దేవుడు పరీక్షించడం; తన వాగ్దాన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అతను ఇష్టపూర్వకంగా విధేయత చూపించడం; ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తులో తీవ్రంగా పరీక్షించబడినప్పుడు, వారు ఆయనను మరచిపోకుండా దేవుని మాటను పాటించడం, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం, అలాగునే వారికి వాగ్దానం చేయబడిన స్వదేశానికి దేవుడు వారిని నడిపించబడడం వంటి విశ్వాసపు రెండు ప్రతి చర్యలు.

 

తన తండ్రి తనకు ఇచ్చిన మిషన్ పరిపూర్ణత కోసం ఇటువంటి పరీక్ష లేదా తయారు కావడానికి యేసు నడిపింపబడిన అరణ్య పరీక్ష ఏమాత్రం మినహాయింపు కానేకాదు కదా! ఆయన శోధనను ఎదుర్కొన్నాడు. దేవుని చిత్తానికి నమ్మకంగా జీవించాడు. ఆహారం మరియు ఆశ్రయం లేకుండా  40 రోజులు అరణ్యంలో ఆయన శోధనకు గురయ్యాడు. ఆ  బంజరు అరణ్యంలో తనను తాను నిలబెట్టుకోవడానికి నలభై రోజుల ప్రార్థన మరియు ఉపవాసపు బలం  తప్ప ఆయనకు ఏమీ లేదు. ఆ కఠినమైన వాతావరణంలో యేసు ఒంటరిగా వున్నది లోక రక్షణ నిమిత్తమే.  బాధలు కష్టాలు, అవమానం  తిరస్కరణ, మరియు శిలువపై మరణమును జయించ శోధనతో పోరాడదానికే.

 

ఒక రూపంలో లేదా మరొక రూపంలో ఎదురయ్యే సాతాను శోధన, జీవితంలో తప్పించుకోలేని ఒక నిత్య సత్యం. మన జీవిత భాగ స్వామి. మన దైనందిన అనుభవాన్ని మనం నిజాయితీగా పరిశీలిస్తే, శోధనలోని అనేక దీర్ఘా౦శాలను మనం కనుగొనవచ్చు. అవి ప్రేరణలు లేదా ధోరణులు. అవే సరైన నిక్కచ్చైన పనులను చేసే విధానానికి విరుద్ధంగా ఉంటాయి. మనం ఈ ప్రలోభాలను హేతుబద్ధంగా తర్కిస్తే, అవి సామాజికంగా ఆమోదయోగ్యమైనవిగానూ మరియు రాజకీయంగా సరైనవిగానూ కన్పిస్తాయి. కొనసాగిస్తే అదే ఒక కృత్రిమ శోధనగా మారిపోతుంది.

 

లేఖనం శోధకుడిని అనేక పేర్లతో పిలుస్తుంది. అవి “అపవాది” సాతాను (ప్రక 12:9), దయ్యాలకు అధిపతి, బేల్జెబూలు (లూకా 11:15, మత్త 12:24), దుష్టుడు (మత్త 13:38), మరియు అబద్ధాలకు తండ్రి (యోహా 8:44). శోధకుడి మోసాన్ని తట్టుకునే శక్తిని యేసు ఎక్కడ కనుగొన్నాడు? ఆయన దేవుని మాటను తిని తన తండ్రి చిత్తాన్ని సిద్ధింప చేయడంలో బలాన్ని పొందుకున్నాడు.

 

పాపాన్ని అధిగమించి, మన వికృత కోరికలపై, సాతాను మరియు లోకపు అబద్ధాలపై ఎలా మనం స్వేచ్ఛను  పొందగలం? మన బలహీనతలో మనకు సహాయం చేయడానికి (రోమా 8:26) మరియు శోధన - పరీక్షలలో మనకు మార్గదర్శకుడిగానూ, ఓదార్పునిచ్చేవాడిగానూ ఉండటానికి ప్రభువైన యేసు మనకు తన ఆత్మను ఇస్తున్నాడు (1 కొరింథీ 10:13). ఆయనపై ఆధారపడటాన్ని అంగీకరించే వినయస్థులకు ఆయన తన కృపను ఇస్తున్నాడు (యోహా 4:6) మరియు మనలను నాశనం చేయడానికి ప్రయత్నించే మన శత్రువగు సాతాను అబద్ధాల దాడులకు వ్యతిరేకంగా నిలబడటానికి సహాయం చేస్తున్నాడు (1 పేతు 5:8-10; ఎఫె 6:10-18). పరిశుద్ధాత్మ నుండి వచ్చే శక్తి మరియు బలంతో మనం "విశ్వాసపు మంచి పోరాటం పోరాడాలని" (1 తిమో 6:12) ఆయన కోరుకుంటున్నాడు. ఈ లెంట్‌లో మన ఆధ్యాత్మిక బలం మరియు విజయం కోసం ప్రభువుపై ఆధారపడతామా? లేకా లోకశోధనలకు దాసోహమవుదామా?

 

 

అతను శోధనలకు గురికాకపోతే, శోధనలపై ఎలా విజయం సాధించాలో మీకు నేర్పించలేడు (Divine Office)

 

 

 

No comments:

Post a Comment