AletheiAnveshana: యూదుడు లేదా అన్యుడు కాదు... అందరూ క్రీస్తు యేసులో ఒక్కటే నిర్గమ 17:3-7; రోమా 5:1-2,5-8; యోహాను 4:5-42 (లెంట్ A /2)

Saturday, 7 March 2026

యూదుడు లేదా అన్యుడు కాదు... అందరూ క్రీస్తు యేసులో ఒక్కటే నిర్గమ 17:3-7; రోమా 5:1-2,5-8; యోహాను 4:5-42 (లెంట్ A /2)

 

యూదుడు లేదా అన్యుడు కాదు... అందరూ క్రీస్తు యేసులో ఒక్కటే

 

నిర్గమ 17:3-7; రోమా 5:1-2,5-8; యోహాను 4:5-42 (లెంట్ A /2)

బలహీనులకును అనాథలకును న్యాయం చేయండి. పీడితులకును పేదలకును న్యాయము తీర్చండి

 

ఈ ఆదివారం మరియు రాబోయే రెండు ఆదివారాల్లో, మత్తయి సువార్తను ధ్యానించడం కొంచెం ప్రక్కనపెట్టి యోహాను సువార్తలోని  కొన్ని అధ్యాయాలపై ధ్యానం చేస్తున్నాము మనము. యోహాను సువార్త ఒక నిర్దిష్ట ప్రార్ధనా/అర్చనా సంవత్సరానికి (liturgical Cycle) కేటాయించబడని ఏకైక సువార్త. బదులుగా, యోహాను సువార్త నుండి పఠనాలు మన మూడు సంవత్సరాల ప్రార్ధనా చక్రంలో కుదించబడ్డాయి. నేటి సువార్తలో యేసు మరియు సమరియకు చెందిన ఒక స్త్రీ మధ్య సంభాషణ యూదులు మరియు సమరియుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వెల్లడిస్తుంది. ఇది వారి మధ్య సంభాషణను కూడా నిరోధించింది. “యూదుడా, సమరియ స్త్రీ అయిన నన్ను ఎలా మంచి నీళ్లు ఇవ్వమని అడుగగలవు?” అన్న వాక్యం ద్వారా ఆ స్త్రీ స్వయంగా తన సంప్రదాయం నుండి తానే విడిపోవడాన్ని సూచిస్తుంది.  అయినప్పటికీ యేసు ఆ స్త్రీతో సంభాషించడమే కాకుండా, ఆమె త్రాగే పాత్రను అందించమనీ అడుగుతాడు. ఇది యూదు చట్టం ప్రకారం అతన్ని అపవిత్రుడిని చేస్తుంది.

 

“ఆధునిక ప్రపంచంలో తిరుసభ” అనే అంశంపై రెండవ వాటికను మహా సభ  “పాస్టోరల్ రాజ్యాంగం” అనే శిర్షికన "గౌదియుం ఎత్ స్పెస్" (ఆనందం మరియు ఆశ) అనే ఒక బోధన చేసింది. అది చాలా శ్రేష్టమైన పాఠాన్ని కలిగివుంది. నేటి ప్రపంచాన్ని కలవరపెట్టే ఉద్రిక్తతలు వాస్తవానికి మానవ హృదయంలో పాతుకుపోయిన మరింత ప్రాథమిక ఉద్రిక్తతకు సంబంధించిన వాటిని విశిదం చేస్తుంది ఈ బోధన. మనిషి తనలోనే తనకు, అనేక అంశాలు వివిధ రకాల వివక్షతలో ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. ఒక వైపు, ఒక జీవిగా తానుఅనేక పరిమితుల అనుభవాన్ని కలిగి ఉంటాడు. మరోవైపు, తన ఆకాంక్షలకు పరిమితి లేదని మరియు తాను ఉన్నతమైన జీవితానికి పిలువబడ్డాడని అతనికి తెలుసు. ఇంకా, తన బలహీనత మరియు పాపభరితత్వంలో, అతను తరచుగా తాను చేయకూడనిది చేస్తాడు. తాను చేయాలనుకున్నది చేయడంలో విఫలమవుతాడు. పర్యవసానంగా, అతను తనలో తాను సంఘర్షణకు గురవుతున్నాడు. ఇది సమాజంలో చాలా గొప్ప ఉద్రిక్తతలకు దారితీస్తుంది అని చెప్తుంది ఈ బోధన.

 

మానవులు మరియు చివరకు భూమి ఆధారిత జీవి ఏ జీవి అయినా దుమ్ము నుండి వచ్చి దుమ్ములో తిరిగి కలిసి పోవలిసిందే. “జాతస్య మరణం ధృవం”. మరణం తర్వాత తమతో ఏమి తీసుకువెళతారు? కాబట్టి, “గౌదియుం ఎత్ స్పెస్” - మనిషి అంటే ఏమిటి? ఇంత గొప్ప పురోగతి ఉన్నప్పటికీ ఇంకా కొనసాగే బాధ, చెడు, మరణాల అర్థం ఏమిటి? ఎంతో ఖర్చుతో సాధించిన ఆ విజయాల ప్రయోజనం ఏంగానూ? మనిషి సమాజానికి ఏమి దోహదపడగలడు? సమాజం నుండి అతను ఏమి ఆశించగలడు? భూమిపై ఈ జీవితం తర్వాత ఏమి తెస్తుంది?  అన్న ప్రశ్నలపై మనల్ని ఆలోచించమని పిలుస్తుంది ఈ బోధన. సమరియ స్త్రీ సంభాషణలోని అత్యున్నత అంశం - మెస్సీయలో మాత్రమే జీవించాలనే పిలుపు!! ప్రపంచంలో తన చరిత్రను సృష్టించిన అన్ని అడ్డంకులు మరియు సరిహద్దులను విస్మరించి, సత్యం మరియు ఆత్మతో ఆయనను ఆరాధించండి అని పిలుపు నిస్తుంది.

 

యేసు మరియు సమరయ స్త్రీ మధ్య జరిగిన సమావేశ ప్రాముఖ్యత అనేక స్థాయిలను కలిగి ఉంది. మొదటిది వ్యక్తిగతమైనది. ఆ స్త్రీ తనను తాను యేసునందు విశ్వాసంలోకి మార్చుకున్న విధంగా, మనం దేవుని వాక్యంలో మారడానికి పిలువబడ్డాము. రెండవది సామాజికమైనది. ఆమె తన స్వంత ప్రజలకు సువార్తికురాలిగా మారినట్లు, మనం సువార్తికులకు సువార్తికులుగా మారడానికి పిలువబడ్డాము. మూడవ స్థాయి విద్యాపరమైనది. దేవుని దయ పరిమితి లేదని తన శిష్యులకు బోధించడంలో యేసు సమరియ స్త్రీతో తనకు కలిగిన పరిచయాన్ని వివరిస్తున్నాడు. ఆయన దయను పొందడానికి మనము కలిగి యున్న సామాజిక అడ్డంకులను ఆయన లెక్కించడు. చివరగా, సమరయ పట్టణవాసుల మనోమార్పిడి అనేది సమస్త జనులను ఏకం చేసేవాడు యేసు మాత్రమె  అని నమ్మే ప్రపంచంలో - నూతనంగా సృష్టించబడే దైవరాజ్య సమాజానికి ముందస్తు రుచి!!

 

 

బలహీనులను పేదలను రక్షించండి. దుష్టుల చేతిలో నుండి వారిని విడిపించండి”.

No comments:

Post a Comment