“సమాధి నుండి బయటకు రా...”
యెహె 37:12-14 రోమా 8:8-11; యోహా 11:1-45 (లెంట్ A / 5)
“ఆయన దేవుని మహిమ తేజోవంతమైన వెలుగు. ఆయన
స్వభావానికి పరిపూర్ణమైన ప్రతిరూపం”
మరణం
మాత్రమే ఏలే చోట దేవుడు జీవాన్ని తెస్తాడు అన్నది నేటి లిటర్జికల్ పఠనాల
సందేశం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రవాసంలో నివసిస్తున్న (యెహె 37:12–14)
రోజులవి. వారి దేశం నాశనం చేయబడింది వారి
ఆలయం ద్వంశమయింది. వారి ఆశ పాతిపెట్టబడింది. వారు ఇక చనిపోయిన వ్యక్తులులా భావించుకున్నారు. కానీ యెహోవా
దేవుడు “నేను మీ సమాధులను తెరిచి మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాను” అని ప్రవక్త యేహెజ్కేలు
ద్వారా వాగ్దానం చేశాడు. దేవుడు తన “רוּחַ”
(ruaḥ ఆత్మ) ను వారిలో ఉంచుతానని చెప్పాడు. హెబ్రీ పదం “రువా” అనే పదానికి “శ్వాస”, “ఆత్మ” లేదా “జీవశక్తి”
అని అర్థం. సృష్టి కథనంలో దేవుడు ఆదాములోనికి (ఆది 2:7), అంటే మానవాళి భౌతికతలోకి ప్రాణం
పోసినప్పుడు ఉపయోగించిన తన శక్తికి పదం ఇదే. జీవాన్ని సృష్టించిన దేవుడు
జీవితాన్ని పునరుద్ధరించగలడు.
జనులు
ఆధ్యాత్మికంగా లేదా సామాజికంగా చనిపోయినట్లు భావించినప్పుడు కూడా, దేవుని ఆత్మ
వారిని పునరుద్ధరించగలదు. ఈ వాగ్దానం నేటి సువార్తలో నెరవేరినట్లు మనం చూస్తున్నాము
(యోహా 11:1–45). లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉన్నాడు. మానవీయంగా చెప్పాలంటే, ప్రతిదీ తనకు ముగిసిపోయింది.
మార్తా మరియు మరియ దుఃఖిస్తున్నారు. ఆ సమాజం తన మరణాన్ని అంగీకరించింది. కానీ యేసు
"నేనే పునరుత్థానం మరియు జీవం" అని ఒక గర్భిత ప్రకటన చేశాడు. పునరుత్థానం కోసం
ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం "ἀνάστασις (అనాస్తాసిస్)", దీని అర్థం
"మళ్ళీ లేవడం". ఇది మరణం తర్వాత మనకు సంభవించే పరలోక జీవితం గురించి
మాత్రమే కాదు. నిరాశ నుండి కొత్త
జీవితంలోకి ఎలాంటి వాడినైనా సరే దేవుడు పైకి లేపగలడని దీని అర్థం. యేసు అధికారంతో
"లాజరు, బయటకు రా!" అని భావోద్వేగ గద్గద గొంతుతో పిలిచాడు. ఆ శక్తితో చనిపోయిన
వ్యక్తి సమాధి నుండి బయటకు వచ్చేసాడు. ఈ అద్భుతం లోతైన వేదాంత సత్యాన్ని
వెల్లడిస్తుంది. యేసు జీవానికి, జీవితానికి నాథుడు. మానవత్వం ముగింపును చూసే చోట, క్రీస్తు ఒక కొత్త
ప్రారంభాన్ని సృష్టిస్తాడు.
మనలో
ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు మన జీవితాల్లో సమాధి అనుభవాన్ని కలిగే ఉన్నాము. ఆశ పాతివేయబడినట్లు
అనిపించే ప్రదేశ అనుభవాలు. కొందరు పాప సమాధిలో, మరికొందరు భయం అనే సమాధిలో, తెగిపోయిన వివాహ సంబంధం
అనే సమాధిలో, విశ్వాసం కోల్పోయిన లేదా నిరుత్సాహం అనే సమాధిలోనే జీవి స్తున్నారు.
అయినప్పటికీ క్రీస్తు ప్రతి సమాధి ముందు నిలబడి, లాజరును పిలిచినట్లే మనల్ని పేరు పెట్టి
పిలుస్తున్నాడు. ఆయన స్వరం మనల్ని బంధించే వాటి నుండి బయటపడమని ఆహ్వానిస్తుంది.
ప్రార్థన, పశ్చాత్తాపం మరియు దేవునిపై నమ్మకం ద్వారా, మనం ఇంకా
ఆధ్యాత్మిక పునరుత్థానాన్ని అనుభవించగలం. ఈ సందేశానికి సామాజిక అర్థం ఉంది. నేడు
చాలా మంది “సామాజిక సమాధులు” అని పిలవబడే సమాధిలో నివసిస్తున్నారు. పేదరికం, ఒంటరితనం, అన్యాయం లేదా
బహిష్కరణ అనేవే సామాజిక సమాధులు. క్రీస్తు అనుచరులుగా, మనం కొత్త
జీవితాన్ని పొందడమే కాకుండా ఇతరులకు జీవితాన్ని అందించడంలో సహాయపడటానికి
పిలువబడ్డాము. పోపు ఫ్రాన్సిసు తన “Fratelli Tutti” అనే విశ్వ లేఖలో, పాతుకుపోయిన సోదరభావం,
సంఘీభావం సమాజం మరచిపోయినట్లు భావించే
వారికి ఆశను పునరుద్ధరించగలదని మనకు గుర్తు చేస్తుంది. నేటి సువార్త చివరలో, "అతని కట్లు
విప్పి వదిలేయండి” అని యేసు సమాజానికి చెప్పాడు." లాజరును సమాధి నుండి బయటకు
పిలిచిన తర్వాత, సమాజం అతన్ని బంధించే కట్టుల్ని తీసివేసింది. నేడు క్రీస్తు సంఘంగా ఇదే
మన లక్ష్యం. మనల్ని బంధించే వాటి నుండి ఒకరినొకరు విడిపించుకోవడంలో సహాయపడటం.
మనం
పవిత్ర వారాన్ని సమీపిస్తున్న కొద్దీ, క్రీస్తు నేటికీ అదే శక్తివంతమైన “బయటకు రా....” అన్న మాటతో మనలను గద్దిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు:
భయం నుండి బయటకు రా.. . పాపం నుండి బయటకు రా... నిరాశ నుండి బయటకు రా.. అని
పిలుస్తున్నాడు. తన “రువా” (దేవుని ఆత్మ)
మన జీవితాలను నింపినప్పుడు, మనం “అనస్తాసిస్” (పైకి లేప బడటం) ను అనుభవిస్తాము. క్రీస్తుతో కొత్త బంగారు జీవితంలోఎదగలము.
“దేవుని వాక్యమనే కృప ద్వారా ప్రతిఒక్కరూ సంపూర్ణంగా శుభ్రపరచబడతారు”(Divine Office)
No comments:
Post a Comment