శక్తిమంతుడును, వినయాన్వితుడైన రాజుకు సాష్టాంగ నమస్కారం
యెష 50:4-7;
ఫిలిప్పీ 2:6-11; మత్త 26:14—27:66 (మ్రాను కొమ్మల ఆదివారం, A)
“ప్రభు దేవా, నీవు ఎంత గొప్పవాడివో, మహిమా వైభవంలో, పటముగా కాబట్టిన వెలుగులో నిండియున్నావు”.
ఈ
రోజు మనం పరిశుద్ధ వారాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ వారపు రోజులలో యేసుతో పాటు ఆయన శిలువ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము.
అలాగునే ఆయన పునరుత్థానం కొరకు ఎదురు చూస్తున్నాము. యెరూషలేములోకి యేసు విజయవంతంగా
ప్రవేశించడాన్ని గుర్తుచేసుకోవడానికి, ఈ రోజు మన ఆరాధనను ఈతాకులు లేదా
కొబ్బరాకుల ఊరేగింపుతో ప్రారంభిస్తున్నాము. యేసు శ్రమల కాలంలోని సంఘటనల క్రమతను
ఈనాటి వాక్యారాధనలో సంపూర్ణంగా ప్రకటించబడుతుంది. అదే సంఘటనల క్రమతను మళ్ళి పరిశుద్ధ
గురువారం నాడు ప్రభువు పస్కాభోజనం,
శుభ శుక్రవారం మరియు ఈస్టర్ జాగరణ వంటి త్రిదినోత్సవ (త్రిదువుం/మూడు
దినములు) ఆరాధనలను మనం జరుపుకునేటప్పుడు ప్రకటించబడతాయి. మ్రాను కొమ్మల ఆదివారం
నాడు మనం యేసు శ్రమలను మత్తయి సువార్త (cycle A) నుండి చదువుతాము. శుభ శుక్రవారం నాడు, యోహాను సువార్త నుండి యేసు శ్రమలను
చదువుతాము. నేటి సువార్తలో మనం గ్రహించే యేసు శ్రమ మరియు మరణం గురించిన చరిత్ర , ప్రత్యేకంగా ఆయన
తన తండ్రి చిత్తానికి విధేయత చూపడం, అదేవిధంగా పూర్వ లేఖనాల సంపూర్ణ పరిపూర్తిపై
దృష్టి పెడుతుంది మత్తయి సువార్త.
మత్తయి
మరియు మార్కు సువార్తలు యేసు శ్రమల వృత్తాంతంలో అనేక సారూప్యతలను కలిగి ఉన్నప్పటికీ, మత్తయి సువార్తలో కొన్ని వివరాలు
గమనించదగినవి. యేసును అప్పగించినందుకు యూదా చెల్లించిన మూల్యం మరియు ఆయన మరణాన్ని
మత్తయి మాత్రమే సూచిస్తాడు. అలాగే పిలాతు భార్యకు కలలో హెచ్చరిక
రావడం మరియు యేసు మరణం విషయంలో పిలాతు తన చేతులు కడుక్కోవడం వంటి వివరాలు కూడా
ఉన్నాయి. చివరగా, యేసు మరణం తర్వాత సంభవించిన భూకంపాలు మరియు ఇతర దృగ్విషయాలను మత్తయి
సువార్త మాత్రమే ప్రస్తావిస్తుంది. తొలి క్రైస్తవ సమాజానికి మరియు వారి యూదు
సమకాలీనులకు మధ్య బహుశా ఉన్న ఉద్రిక్తతను మత్తయి సువార్త ప్రతిబింబిస్తుందని
పండితులు గమనిస్తున్నారు. రెండవ వాటికను మహా
సభలో (1964), యేసు శ్రమలకు మరియు మరణానికి పాపులందరూ బాధ్యత వహించాలని, మరియు యేసు
శ్రమలకు ఆయన యూదు సమకాలీనులను గానీ లేదా నేటి యూదు ప్రజలను గానీ నిందించడం తప్పు
అని ఆసభలోని పండిత పితరులు స్పష్టం చేశారు (నోస్త్రా ఏతాతే - నం. 4 (ఇన్ అవర్ టైమ్/ మన
కాలం 1965). ఇది నేడు మనం గ్రహించ దగిన విషయం.
మత్తయి
సువార్తలోని పాత్రల ద్వారా యేసు శ్రమలను అర్థం చేసుకోవడానికి అనేక ప్రతిబింబాలు
మనకు కనిపిస్తాయి. అవి ఇతరులను సూచించడం కాదు, మనల్నే ప్రతిబింబిస్తాయి. కొన్నిసార్లు
మనం, యేసుకు
ద్రోహం చేసి పశ్చాత్తాపపడిన యూదాలా ఉంటాము. కొన్నిసార్లు , ఆయనను నిరాకరించిన
పేతురులా, లేదా యేసు అత్యంత కష్టకాలంలో నిద్రపోయి, ఆయనను అరెస్టు
చేసినప్పుడు తొందరపాటుతో, హింసాత్మకంగా ప్రవర్తించిన శిష్యులలా మనం ఉంటాము. కొన్నిసార్లు , యేసు సిలువను
మోయడంలో సహాయం చేయడానికి బలవంతంగా నియమించబడిన సీమోనులా మనం ఉంటాము. యేసుకు భయపడే
నాయకుల్లా, లేదా సత్యం కోసం నిలబడకుండా చేతులు కడుక్కున్న పొంతు పిలాతులా కొన్నిసార్లు
మనం ఉంటాము. కానీ మన పాపాలను క్షమించబడటానికి యేసు మరణించాడు. మళ్ళి
మళ్ళి మరణిస్తూనే వుంటాడు.
యేసు
రాజు. రాజాధి రాజు. ఈ రాజు తన రాచరికాన్ని మనపై బలవంతంగారుద్దడు. ఆయనే తనను తాను
సమర్పించుకుంటున్నాడు. ఆయన రాచరికం సేవాభావంతో నిండి ఉంది. “ఆయన వాదించడు. వీధులలో
తన స్వరం వినిపించేలా బిగ్గరగా అరవడు. ఆయన సాత్వికంగా, వినయంగా ఉంటాడు.
ఆయన తన శ్రమల వైపు వేగంగా వెళ్తుండగా, ఆయన మార్గాన్ని వస్త్రాలతో, ఒలీవ కొమ్మలతో, లేదా ఖర్జూరపు
ఆకులతో కప్పకుండా, మన శక్తికొలది ఆయన ముందు సాగిలపడి నమస్కరిస్తూ, ఆయనతో పాటు మనం
కూడా పరుగెడదాం” (పునీత ఆండ్రూ, బిషప్ - క్రీటు).
“ప్రభువు నామమున వస్తున్నవాడు ధన్యుడు; ఈశ్రాయేలు రాజు ధన్యుడు” (Divine Office)
No comments:
Post a Comment